డిగ్రీలుంటే సరిపోదు
ABN , Publish Date - Jul 03 , 2026 | 04:25 AM
కేవలం డిగ్రీ ఉంటే సరిపోదని, సమస్యను పరిష్కరించడం.. సాంకేతికతకు తగ్గట్టు మారడం అవసరమని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు.
సాంకేతికతకు తగ్గట్టు మారాలి
జీవితాంతం నేర్చుకునేలా విద్యార్థులను సిద్ధం చేయాలి
శ్రీ సిటీ ఇంటర్నేషనల్ వర్సిటీ ప్రారంభోత్సవంలో లోకేశ్
తిరుపతి సిటీ, జూలై 2(ఆంధ్రజ్యోతి): కేవలం డిగ్రీ ఉంటే సరిపోదని, సమస్యను పరిష్కరించడం.. సాంకేతికతకు తగ్గట్టు మారడం అవసరమని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. జీవితాంతం నేర్చుకుంటూనే ఉండేలా మన విద్యార్థులను సిద్ధం చేయడం చాలా ముఖ్యమని, అలాంటి ఆలోచనతోనే శ్రీసిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ (ఎస్‌ఐయూ) ఏర్పాటైందని మంత్రి వివరించారు. తిరుపతి జిల్లాలోని శ్రీసిటీలో గురువారం ఆయన ‘ఎస్‌ఐయూ’ను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ఇంకో కొత్త యూనివర్సిటీని ప్రారంభించడమే కాకుండా, ఉన్నత విద్య గురించి కొత్తగా ఆలోచించే విధానానికీ పునాది వేశామన్నారు. ‘‘ఇన్నేళ్లుగా ఎన్ని డిగ్రీలు ఇచ్చారు.. ఎంతమంది పాస్ అయ్యారనే దాన్నిబట్టే యూనివర్సిటీల స్థాయిని కొలిచేవారు. ఇకముందు, సమాజంలో ఎలాంటి మార్పు తీసుకొస్తున్నామనే దాన్ని బట్టి అంచనా వేస్తారు. ఇలాంటి కొత్త ఆలోచనతో వచ్చిన ఎస్‌ఐయూ రాష్ట్ర యువతకు ఒక వరం. ఈ క్యాంపస్ 5 వేల మంది విద్యార్థులతో మొదలవుతోంది. దీనిద్వారా మరో 75వేల ఉద్యోగాలు తీసుకు రావాలన్నది నా లక్ష్యం. 2029 కల్లా దానిని సాకారం చేయాలి. 31 దేశాల నంచి 200 కంపెనీలు శ్రీసిటీలో ఉన్నాయి. ఇందుకుగాను శ్రీనిరాజు, రవి సన్నారెడ్డికి అభినందనలు’’ అని లోకేశ్ అన్నారు.
యువత మనకు బలం...చాలెంజ్
‘‘మన జనాభాలో దాదాపు 65 శాతం మంది 35 ఏళ్లలోపు వాళ్లే. ఈ యువశక్తి మనకు పెద్ద బలం కావచ్చు. లేదా పెద్ద చాలెంజ్ కూడా అవ్వొచ్చు. ఐటీ కన్నా.. విద్యాశాఖ మంత్రిగా విధులే నాకు ఎక్కువ ఇష్టం. అదే నా ‘భారత్ హ్యాట్’. నేను మానవ వనరుల శాఖ మంత్రిని కూడా. మనుషుల నైపుణ్యాన్ని, ప్రతిభను బయటకు తీస్తేనే మనం చాలా సాధించగలమని గట్టిగా నమ్ముతా. టెక్నాలజీ ప్రపంచాన్ని మారుస్తుంది.. కానీ ఆ టెక్నాలజీతో మార్పు తీసుకొచ్చే మనుషులను తయారు చేసేది మాత్రం చదువే. అందుకే మనం చేసే ఏ పనికైనా విద్య ప్రధాన కేంద్రంగా ఉండాలి.’’
ఆ మూడు అంశాలే కీలకం
‘‘ఎస్‌ఐయూలో వర్క్ స్టడీ మోడల్, ఏఐ వినియోగం, స్టార్టప్ ఎకో సిస్టమ్ నాకు బాగా నచ్చిన విషయాలు. ప్రతి ఇంట్లో బిజినెస్ చేసే వ్యక్తి ఒకరు ఉండాలనేది సీఎం ఆలోచన. రైతు దగ్గర్నుంచి ఏఐ ఇంజనీర్ల దాకా... ప్రతి ఇంట్లో ఒక ఎంట్రప్రెన్యూర్ ఉండాలి. ఈ మోడల్‌ను ముందుకు తీసుకెళ్లడానికి మాకు శ్రీనిరాజు సహకారం కావాలి. ఒక ఫ్యామిలీ, ఒక ఎంట్రప్రెన్యూర్ అనేది మాకు చాలా కీలకం కాబోతోంది. పెట్టుబడులకు మా వద్ద 3ఎస్ (స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్) మోడల్ ఉంది. ఒకసారి మీ ప్రాజెక్టుకి ఓకే చెప్పామంటే, దానిని మేం సొంతం అన్నట్టు భావిస్తాం. దీనికి ఎస్‌ఐయూనే మంచి ఉదాహరణ. ఎస్‌ఐయూ ప్రతిపాదనను ఓకే చేసినప్పుడు నేను రష్యా పర్యటనలో ఉన్నా. ఫైల్ నా లాగిన్‌కి రాగానే, చదివాను. ఒక మీటింగ్ నుంచి ఇంకో మీటింగుకు వెళ్లే మధ్యలోని విరామంలో ఆ ఫైల్ క్లియర్ చేశాను. మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన వారికి ఏవైనా సమస్యలుంటే, వాటిని పరిష్కరించడానికి అధికారికంగా ఒక డెస్క్ ఏర్పాటు చేశాం. ప్రస్తుతం 2.20 బిలియన్ డాలర్ల ఎకానమీగా ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2047నాటికి 2.4 ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలని కృతనిశ్చయంతో ఉన్నాం’’ అని మంత్రి లోకేశ్ అన్నారు.