తీరం మరింత భద్రం
ABN , Publish Date - Mar 13 , 2026 | 03:23 AM
రక్షణ రంగ పరిశ్రమ అయిన సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ రాష్ట్రానికి, దేశానికీ గర్వకారణంగా నిలుస్తుందని మంత్రి లోకేశ్ అన్నారు. ఈ పరిశ్రమ దేశ రక్షణ రంగంలో కీలక భూమిక పోషిస్తుందని చెప్పారు.
నెల్లూరు జిల్లాలో సాగర్ డిఫెన్స్ పరిశ్రమకు శంకుస్థాపన
దేశ రక్షణ రంగంలో ఈ పరిశ్రమది కీలక పాత్ర
మత్స్యకారుల జీవన ప్రమాణాల మెరుగుకు దోహదం
సాంకేతిక పరిజ్ఞానంతో మత్స్య సంపదను గుర్తిస్తుంది
అనుకోని విపత్తుల్లో రక్షణగా ఉంటుంది
ఉపాధి కల్పనలో స్థానిక యువతకు మొదటి ప్రాధాన్యం
గొప్ప పరిశ్రమను తెచ్చినందుకు గర్వంగా ఉంది: లోకేశ్
నెల్లూరు, మార్చి 12(ఆంధ్రజ్యోతి): రక్షణ రంగ పరిశ్రమ అయిన సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ రాష్ట్రానికి, దేశానికీ గర్వకారణంగా నిలుస్తుందని మంత్రి లోకేశ్ అన్నారు. ఈ పరిశ్రమ దేశ రక్షణ రంగంలో కీలక భూమిక పోషిస్తుందని చెప్పారు. తీరం వెంబడి భద్రతను ఇది మరింత బలోపేతం చేయనుందన్నారు. ప్రపంచంలోనే ఒక గొప్ప పరిశ్రమను తీసుకొచ్చినందుకు గర్వంగా ఉందన్నారు. గురువారం నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రాంగణంలో సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ ఏర్పాటు చేసే అటానమస్ మారిటైమ్ షిప్‌యార్డ్, సిస్టమ్స్ డెవల్‌పమెంట్ సెంటర్‌కు లోకేశ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రాంగణంలో రక్షణ రంగానికి చెందిన పరిశ్రమ ఏర్పాటు చేయడం ద్వారా మత్స్యకార కుటుంబాల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేశారు. వారి జీవన ప్రమాణాల మెరుగుదలకు భరోసా ఇచ్చారు. ఆయన ఏమి చెప్పారంటే.. ‘‘రాష్ట్రంలో పొడవైన సముద్ర తీర ప్రాంతంలోని లక్షలాది మంది మత్స్యకార కుటుంబాలకు, ముఖ్యంగా నెల్లూరు జిల్లా పరిధిలోని వేలాది మత్స్యకార కుటుంబాలకు మాట ఇస్తున్నాను. మీతోనే నిలబడతా. మీ జీవనోపాధిని మరింత మెరుగుపరిచే బాధ్యత తీసుకుంటా. నా పాదయాత్ర సందర్భంగా ఈ మత్స్యకారవాడల్లో నడిచాను. ఆనాడు మీరు చూపించిన ప్రేమాభిమానాలు, కనబరిచిన క్రమశిక్షణ నేను మరే గ్రామాల్లోనూ చూడలేదు. ఆనాడే మీకు నేను మాటిచ్చాను.
ఆ మాట మేరకు ఎప్పుడూ మీకు అండగా నిలబడతా. సాగర్ డిఫెన్స్ పరిశ్రమ వల్ల సముద్ర తీరాల వెంట రక్షణతో పాటు మత్స్యకార కుటుంబాలకు మేలు జరుగుతుంది. జీవనపోరాటంలో జీవితాన్ని పణంగా పెట్టి సముద్రంపైకి వెళ్లిన మత్స్యకారులకు రక్షణ కల్పించడానికి ఈ పరిశ్రమ ఎంతో ఉపయోగపడుతుంది. ఊహించని విపత్తులు సంభవించినప్పుడు మెరుగైన రక్షణ కల్పించడానికి దోహదం చేస్తుంది.
సాగర్ రాకతో బ్లూ ఎకానమీ బలోపేతం
ఈ పరిశ్రమలో మత్స్యకార కుటుంబాల యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, ఆ కుటుంబాలకు చెందిన విద్యావంతులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని యాజమాన్యాన్ని కోరుతున్నా. ఈ పరిశ్రమ ద్వారా తొలి విడతలో వెయ్యి మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. సాగర్ డిఫెన్స్ పరిశ్రమ రాకతో రాష్ట్రంలో బ్లూ ఎకానమీ, సముద్ర పరిశ్రమలు, ఆధునిక సాంకేతిక రంగాలు మరింత బలోపేతం అవుతాయి. సాగర్ డిఫెన్స్ కంపెనీని ఎలా ఆకర్షించారు, ఇక్కడ తేవడానికి ఎలా ఒప్పించారు అని నన్ను చాలా మంది అడిగారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికత దానికి కారణం. భారత్ బయోటెక్ అధినేత కృష్ణా ఎల్లా సూచన మేరకు సాగర్ డిఫెన్స్ కంపెనీ చైర్మన్ నికుంజన్‌ను కలిశాను. ఒకసారి చర్చలతోనే సాగర్ కంపెనీ ఇక్కడికి రావడానికి అంగీకరించింది. ఈ పరిశ్రమ ఇక్కడకు రావడానికి ప్రధాన కారణం. మనకు గొప్ప ప్రధాని, ముఖ్యమంత్రి ఉన్నారు. ఒకవైపు నాయుడుజీ.. మరోవైపు మోదీజీ.. వీరిద్దరి నాయకత్వంలో రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం మొదలైంది. దేశంలో డబుల్ ఇంజన్ సర్కార్లు చాలా ఉండవచ్చు. కానీ మన రాష్ట్రంలో మాత్రం డబుల్ ఇంజన్ బుల్లెట్ సర్కారు ఉంది. చంద్రబాబు, మోదీ నాయకత్వాలే దీనికి కారణం’’ అని లోకేశ్ చెప్పారు. భూమి పూజలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, కాకర్ల సురేశ్, ఇంటూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్సీలు బీద రవిచంద్ర, బల్లి కల్యాణ్ చక్రవర్తి, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, సాగర్ డిఫెన్స్ కంపెనీ చైర్మన్ నికుంజన్, సీఈఓ ఆర్‌కేబీ సింగ్, ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ, సీఈఓ అభిషేక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
విశాఖలో భారీ ఎమ్యూజ్‌మెంట్ పార్క్
100 కోట్లతో మోడర్న్ మస్తీ సంస్థ ఏర్పాటు
రాష్ట్ర పర్యాటక శాఖతో ఒప్పందం
విశాఖపట్నం, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో రూ. 100 కోట్ల పెట్టుబడితో భారీ ఎమ్యూజ్‌మెంట్ పార్క్, రిసార్ట్ ఏర్పాటు చేయడానికి మోడర్న్ మస్తీ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ ముందుకువచ్చింది. ఆ కంపెనీతో పర్యాటక శాఖ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ముంబైలో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఎమ్యూజ్‌మెంట్ పార్క్స్ అండ్ ఇండస్ట్రీస్ గురువారం నిర్వహించిన ఎక్స్‌పో-2026లో రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేశ్, మోడర్న్ మస్తీ ప్రతినిధులు ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఈ సందర్భంగా దుర్గేశ్ మాట్లాడుతూ, విశాఖలో సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో ఎమ్యూజ్‌మెంట్ పార్కు, రిసార్ట్ (100 విలాసవంతమైన గదులు) నిర్మిస్తారన్నారు. ప్రాజెక్టు వల్ల 300 మందికి ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు.