మత్స్యకారులకు లోకేశ్ ఆత్మీయ ఆతిథ్యం
ABN , Publish Date - May 20 , 2026 | 06:13 AM
మత్స్యకారులకు రాష్ట్ర మంత్రి లోకేశ్ ఆత్మీయ ఆతిథ్యం ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా రెండో ఏడాది మత్స్యకారుల సేవలో..
అమరావతి, మే 19(ఆంధ్రజ్యోతి): మత్స్యకారులకు రాష్ట్ర మంత్రి లోకేశ్ ఆత్మీయ ఆతిథ్యం ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా రెండో ఏడాది మత్స్యకారుల సేవలో.. నిధులు విడుదల అయ్యాయి. ఈ సందర్భంగా మత్స్యకారులు 100 పడవల్లో కృష్ణా నదిపై సీఎం ఇంటి వద్దకు వచ్చి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. వారిని లోకేశ్ ఇంటికి ఆహ్వానించారు. మత్స్యకారులను అభినందించిన లోకేశ్ వారితో మాట్లాడారు. తన యువగళం పాదయాత్ర సమయంలో జువ్వలదిన్నె చేరుకున్నప్పుడు మత్స్యకారుల్లో పట్టుదల, ఐకమత్యం చూశానని, అంతా కలిసి ఒక్క మాట అనుకుంటే దానిపై నిలబడటం మత్స్యకారుల గొప్పతనమన్నారు. మత్స్యకారుల పిల్లలకు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి తన శాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మత్స్యకారులకు ఏ కష్టం వచ్చినా తమ ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు. మత్స్యకారులందరితో ఫొటోలు దిగి, వారికి భోజనాలు పెట్టి పంపారు.