Share News

బలమైన రాష్ట్రాలతోనే పటిష్ఠ భారత్‌

ABN , Publish Date - Jun 20 , 2026 | 04:38 AM

బలమైన రాష్ట్రాలతోనే పటిష్ఠ భారత్‌ ఆవిర్భవిస్తుందని విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్‌ పేర్కొన్నారు. స్పీడ్‌, సుస్థిరత, సర్వీసు.. ఏపీ ప్రత్యేకతలుగా వెల్లడించారు.

బలమైన రాష్ట్రాలతోనే పటిష్ఠ భారత్‌

  • స్పీడ్‌.. సుస్థిరత.. సర్వీసు.. ఏపీ ప్రత్యేకతలివే: లోకేశ్‌

  • వీటి కారణంగానే పెట్టుబడులు వస్తున్నాయ్‌

  • ఐసీసీ ప్లీనరీలోమంత్రి లోకేశ్‌.. పారిశ్రామికవేత్తలతో భేటీలు

ఒక బ్రాండ్‌ను సృష్టించడం.. ఆ బ్రాండ్‌పై విశ్వాసం కల్పించడం ఎంత కష్టమో నాకు తెలుసు. రాష్ట్రానికి మా ముఖ్యమంత్రి చంద్రబాబే బ్రాండ్‌గా ఉన్నారు. ఆయనకు అద్భుతమైన ట్రాక్‌ రికార్డు ఉంది.

పెట్టుబడులు, పారిశ్రామిక, ఆర్థిక వృద్ధిలో రాష్ట్రాల నడుమ స్నేహపూర్వక పోటీ దేశానికి మంచిది. వాటి మధ్య స్పర్థ ఉంటేనే ఉన్నత ఫలితాలు సాధించగలుగుతాయి. రాష్ట్రాభివృద్ధి జరుగుతుంది.

- మంత్రి లోకేశ్‌

అమరావతి, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): బలమైన రాష్ట్రాలతోనే పటిష్ఠ భారత్‌ ఆవిర్భవిస్తుందని విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్‌ పేర్కొన్నారు. స్పీడ్‌, సుస్థిరత, సర్వీసు.. ఏపీ ప్రత్యేకతలుగా వెల్లడించారు. దేశ మేధో, సాంస్కృతిక ఆర్థిక కేంద్రంగా కోల్‌కతా బలమైన పునాది వేసుకుని ఉందన్నారు. పశ్చిమ బెంగాల్‌తో ఆంధ్రప్రదేశ్‌ పరస్పర భాగస్వామ్య మైత్రిని కోరుకుంటోందని తెలిపారు. శుక్రవారం కోల్‌కతాలో ఇండియన్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ‘ఏపీలో పెట్టుబడుల అవకాశాలు’ అన్న అంశంపై నిర్వహించిన ప్లీనరీలో ఆయన ప్రసంగించారు. ఈ రోజు బెంగాల్‌ ఏది ఆలోచిస్తుందో.. రేపు భారత్‌ అదే ఆలోచిస్తుందని చెప్పారు. అందుకే ఈ సమావేశంలో అందరి మధ్య గడపడం సంతోషంగానూ, గర్వకారణంగానూ ఉందన్నారు. మేం ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ను అధిగమించి.. స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ అమలు చేస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్థ నాయకత్వంలో నిర్ణయాలు చాలా వేగంగా తీసుకుంటున్నారు. విదేశీ పెట్టుబడులను భారీగా రప్పిస్తున్నాం. 13 నెలల్లోనే గూగుల్‌ డేటా సెంటర్‌ను ఏపీకి రప్పించాం. ఏపీకి పెట్టుబడులు రావడానికి రెండో కారణం సుస్థిరత. సుస్థిర ప్రభుత్వం ఉందన్న విశ్వాసం పెట్టుబడిదారుల్లో కలిగించాం’ అని వివరించారు. ఏపీ అభివృద్ధి ప్రయాణంలో బెంగాల్‌ పారిశ్రామిక, ఆర్థిక, వాణిజ్యవేత్తల సహకారాన్ని కోరారు.


భూసమీకరణ విధానంపై సువేందు ఆరా..

రాష్ట్రంలో ల్యాండ్‌ పూలింగ్‌లో అనుసరిస్తున్న విధానాలేమిటని బెంగాల్‌ ముఖ్యమంత్రి సువేందు అధికారి తనను ప్రశ్నించారని లోకేశ్‌ చెప్పారు. తమ సీఎం చంద్రబాబుపై ఉన్న విశ్వాసంతోనే రాజధాని నిర్మాణానికి రైతులు 33,000 ఎకరాలను భూసమీకరణ కింద ఇచ్చారన్నారు. ఈ ల్యాండ్‌ పూలింగ్‌ విధానాన్ని ప్రపంచదేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయని, దేశానికి నమో అంటే నరేంద్ర మోదీ.. కానీ ఆంఽధ్రప్రదేశ్‌కు మాత్రం చంద్రబాబు, నరేంద్ర మోదీ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో డబుల్‌ ఇంజన్‌ బుల్లెట్‌ట్రైయిన్‌ సర్కార్‌ ఉందన్నారు.

ఆగస్టులో తిరుమలకు సువేందు..

శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం నిర్మించేందుకు కోల్‌కతాలో భూమి కేటాయించాలని సీఎం సువేందు అధికారిని కోరగా సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఈ ఏడాది ఆగస్టులో తిరుమలకు వస్తున్నట్లు చెప్పారని అన్నారు. ఏపీలో క్రాప్‌ వ్యాల్యూ చైన్‌ క్లస్టర్‌లో పెట్టుబడులు పెట్టాలని ఐటీసీ చైర్మన్‌ సంజీవ్‌పూరీని లోకేశ్‌ కోరారు. తాము రాష్ట్రంలో ఇప్పటికే పెట్టుబడులు పెట్టామని పూరీ వెల్లడించారు. స్పైసెస్‌ ప్రాసెసింగ్‌, గ్రీన్‌ లీఫ్‌ టుబాకో ప్రాసెసింగ్‌ ప్లాంట్లు, అగ్రిబిజినెస్‌ చేస్తున్నామని తెలిపారు.

ఈవీ గ్రేడ్‌ అల్యూమినియం తయారీ యూనిట్‌ పెట్టండి

రాష్ట్రంలో ఈసీ గ్రేడ్‌ అల్యూమినియం తయారీ యూనిట్‌ నెలకొల్పాలని శ్యామ్‌ మెటాలిక్స్‌ డైరెర్టర్‌ శీతల్‌ అగర్వాల్‌, రష్మి మెటాలిక్స్‌ డైరెక్టర్‌ సంజీవ్‌ కేఆర్‌ పట్వారీ వద్ద లోకేశ్‌ ప్రతిపాదించారు. ప్రోత్సాహకాలను వినియోగించుకుని విజయనగరంలో స్టీల్‌ ప్లాంట్‌ సామర్థ్యాన్ని ఏటా 2 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యానికి పెంచాలని సూపర్‌ స్మెల్టర్స్‌ లిమిటెడ్‌ చీఫ్‌ గోపాలకృష్ణను కోరారు. ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌, డక్టెల్‌ ఐరన్‌ పరిశ్రమను స్థాపించాలని రష్మి మెటాలిక్స్‌ డైరెక్టర్‌ సంజయ్‌ కేఆర్‌కు విజ్ఞప్తి చేశారు. వారు సానుకూలంగా స్పందించారు. రాయలసీమలో ఇంటిగ్రేటెడ్‌ సోలార్‌ హబ్‌ ఏర్పాటు చేయాలని విక్రమ్‌ సోలార్‌ సీఈవో అరుణ్‌ మిట్టల్‌ను లోకేశ్‌ కోరారు. దీనిపై మిట్టల్‌ సానుకూలంగా స్పందించారు. చిత్తూరు లేదా నెల్లూరులో ఎలక్ట్రానిక్ తయారీ క్లస్టర్లలో హిమాద్రి ఫేజ్‌-2 క్లీన్‌ టెక్‌ లేదా సిలికాన్‌ కార్బన్‌యానోడ్‌ యూనిట్‌ స్థాపించాలని హిమా ద్రి స్పెషాలిటీకెమికల్స్‌ సీఎండీ అనురాగ్‌చౌదరిని లోకేశ్‌ కోరారు.

Updated Date - Jun 20 , 2026 | 04:39 AM