Share News

వాళ్లది ఫ్యాక్షన్‌.. మనది ఫైటర్‌ జెట్‌

ABN , Publish Date - May 16 , 2026 | 06:18 AM

ఏఎంసీఏ.. అనంతపురానికి తమ రిటర్న్‌ గిఫ్ట్‌ అని మంత్రి లోకేశ్‌ చెప్పారు. ఈ ప్రాజెక్టు ఉమ్మడి అనంతపురం జిల్లా చరిత్రను మార్చబోతోందన్నారు. డిఫెన్స్‌ రంగంలో పెద్దఎత్తున పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు రానున్నాయని...

వాళ్లది ఫ్యాక్షన్‌.. మనది ఫైటర్‌ జెట్‌

  • ఏఎంసీఏ.. ‘అనంత’ చరిత్రను మార్చేస్తుంది

  • డిఫెన్స్‌లో పెద్దఎత్తున ఉద్యోగాలు: లోకేశ్‌

ఏఎంసీఏ.. అనంతపురానికి తమ రిటర్న్‌ గిఫ్ట్‌ అని మంత్రి లోకేశ్‌ చెప్పారు. ఈ ప్రాజెక్టు ఉమ్మడి అనంతపురం జిల్లా చరిత్రను మార్చబోతోందన్నారు. డిఫెన్స్‌ రంగంలో పెద్దఎత్తున పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు రానున్నాయని, వీటిని యువత అందిపుచ్చుకోవాలని పిలుపిచ్చారు. భగవాన్‌ సత్యసాయిబాబా నడచిన ఈ పవిత్ర భూమి దేశ రక్షణరంగానికి కొత్త శక్తి కేంద్రంగా మారుతోందన్నారు. ‘యువగళం పాదయాత్ర నుంచి చూస్తున్నాను. ఉమ్మడి అనంతపురం జోషే వేరు.. ఈ జిల్లా ఎన్‌డీఏకి కంచుకోట. 14కి 14 సీట్లూ క్లీన్‌స్వీప్‌ చేశాం. అందుకే ఇప్పుడు ఏఎంసీఏ రూపంలో రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తున్నాం. ఈ నేలకు సత్యసాయి ఆశీస్సులు ఉన్నాయి’ అని అన్నారు.

నమో జోడీ వల్లే భారీ పెట్టుబడులు

‘గూగుల్‌ డేటా సెంటర్‌ రూ.1.35 లక్షల కోట్లు.. ఆర్సెలార్‌ మిట్టల్‌ రూ.1.35 లక్షల కోట్లు.. ఇప్పుడు పుట్టపర్తిలో ఫైటర్‌ జెట్స్‌ రూ.లక్ష కోట్ల పెట్టుబడులు పెడుతున్నాయి. అమరావతి, పోలవరానికి నిధులు తెచ్చుకుంటున్నాం. విశాఖ ఉక్కును కాపాడుకున్నాం. విశాఖ రైల్వే జోన్‌ తెచ్చుకున్నాం. త్వరలో కర్నూలకు హైకోర్టు బెంచ్‌ రాబోతోంది. ఇవన్నీ నమో జోడీ (నాయుడు, మోడీజీ) వల్లే..’ అని లోకేశ్‌ అన్నారు. ఏఎంసీఏ ప్రాజెక్టు రాకతో ఈ ప్రాంత యువతకు ఇక్కడే పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు.


ఈ ముగ్గురూ 75 ఏళ్ల కుర్రాళ్లు..

‘ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌, సీఎం చంద్రబాబు 75 ఏళ్ల కుర్రాళ్లు’ అని లోకేశ్‌ చమత్కరించారు. ‘ఆపరేషన్‌ సిందూర్‌ వెనుక అతిపెద్ద శక్తి, మన ఐరన్‌ మ్యాన్‌, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌’ అని కొనియాడారు. ‘దేశమంతా నమో అంటే నరేంద్ర మోదీజీ.. ఏపీలో నమో అంటే నాయుడుజీ, మోదీ జీ. ఇది ఒక పవర్‌ఫుల్‌ కాంబినేషన్‌. మోదీజీ, రాజ్‌నాథ్‌సింగ్‌ జీ, మన నాయుడు గారికి ఒక కామన్‌ థింగ్‌ ఉంది. వీరంతా 75 ఏళ్ల కుర్రాళ్లు. ఈ ముగ్గురి స్పీడ్‌ తట్టుకోవడం ఎవరి వల్లా కాదు’ అని తెలిపారు.

ఈ ప్రాజెక్టు వెనుక కథ..

‘ప్రతి పెద్ద ప్రాజెక్టు వెనుక ఒక కథ ఉంటుంది. ఏఎంసీఏ కథ కూడా 2025లో మొదలైంది. గత ఏడాది ఫిబ్రవరి 5న ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ను కలిశాను. ఏఎంసీఏ ప్రాజెక్టును రాష్ట్రానికి ఇవ్వాలని అభ్యర్థించాను. మన పరిశ్రమల మంత్రి టీజీ భరత్‌ కూడా ఈ మిషన్‌ను నిరంతరం ముందుకు తీసుకెళ్లారు. ఏపీకి ఇంత మహత్తరప్రాజెక్టును ఇచ్చిన ప్రధాని మోదీ, రాజ్‌నాథ్‌సింగ్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతదూరం వచ్చి పంచ్‌ డైలాగ్‌ లేకపోతే ఎలా? వాళ్లది (వైసీపీ) ఫ్యాక్షన్‌ బ్యాక్‌గ్రౌండ్‌. మనది ఫైటర్‌ జెట్‌ బ్యాక్‌గ్రౌండ్‌. వాళ్లది కిడ్నాప్‌ బ్యాక్‌గ్రౌండ్‌. మనది కియా బ్యాక్‌గ్రౌండ్‌. అర్థమైందా రాజా..’ అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర మంత్రులు కూడా పాల్గొన్నారు.


ఏడు సంస్థలతో రక్షణ ఎంవోయూలు..

పుట్టపర్తిలో రక్షణ రంగంలో పెట్టుబడులకు 7 సంస్థలు ఎంవోయూలు కుదుర్చుకున్నాయి. రాజ్‌నాథ్‌సింగ్‌, చంద్రబాబు సమక్షంలో భారత్‌ ఫోర్జ్‌, రఘువంశీ మెషీన్‌ టూల్స్‌, సాగర్‌ డిఫెన్స్‌ ఇంజనీరింగ్‌, ఎన్‌ఐబీఈ గ్రూపు, పీఎంకే డిఫెన్స్‌, చక్రవ్యూహ్‌ డైనమిక్స్‌, ఇండస్‌ బ్రిడ్జ్‌ వెంచర్స్‌ ప్రతినిధులు ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఈ సంస్థలు రూ.4,400 కోట్ల పెట్టుబడి పెడుతున్నాయి. 6400పైగా ఉద్యోగాలు కల్పిస్తాయి.

Updated Date - May 16 , 2026 | 06:20 AM