7 రోజులు.. 50 కంపెనీలతో సంప్రదింపులు
ABN , Publish Date - Jul 12 , 2026 | 04:54 AM
పెట్టుబడుల సాధన లక్ష్యంగా ఐటీ, విద్య, ఎలకా్ట్రనిక్స్ శాఖ మంత్రి లోకేశ్ వారం రోజుల పాటు సాగించిన దక్షిణ కొరియా పర్యటన ముగిసింది.
ముగిసిన లోకేశ్ కొరియా పర్యటన
ఏపీలో సానుకూల అవకాశాలను వివరించిన మంత్రి
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సానుకూలత
అమరావతి, జూలై 11 (ఆంధ్రజ్యోతి): పెట్టుబడుల సాధన లక్ష్యంగా ఐటీ, విద్య, ఎలకా్ట్రనిక్స్ శాఖ మంత్రి లోకేశ్ వారం రోజుల పాటు సాగించిన దక్షిణ కొరియా పర్యటన ముగిసింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని, తమ యూనిట్లను స్థాపించాలని కొరియన్ కంపెనీలతో లోకేశ్ సంప్రదింపలు జరిపారు. ఆయన ప్రతిపాదనలపై పలు దిగ్గజ కంపెనీలు సానుకూలత వ్యక్తం చేశాయి. ఈ నెల 5వ తేదీ నుంచి శనివారం దాకా ఏడు రోజుల పాటు సాగిన కొరియా పర్యటనలో పెట్టుబడుల ఆకర్షణ కోసం దిగ్గజ సంస్థల యాజమాన్యాలతో లోకేశ్ సంప్రదింపులు జరిపారు. దాదాపు 50 కంపెనీల యాజమాన్యాలతో చర్చించారు. శాంసంగ్, ఎల్జీ, కియ వంటి అంతర్జాతీయ స్థాయి కొరియా కంపెనీల నుంచి ఆయనకు అత్యంత గౌరవం లభించింది. తొలిరోజున కొరియాలోని ప్రవాసాంధ్రులతో సమావేశంతో పర్యటన మొదలైంది. శుక్రవారం సీఐఐ ఆధ్వర్యంలో పెట్టుబడిదారులతో జరిగిన రోడ్ షోతో ముగిసింది. రాష్ట్రంతో వాణిజ్య సహకారాన్ని కొరియా బలోపేతం చేయాల్సిన అవసరాన్ని లోకేశ్ వివరించారు. ప్రఖ్యాత కంపెనీలు ఎల్జీ, హ్యుండ్, కియ, వీఎన్‌కే ఫైనాన్షియల్ వంటి సంస్థలు ఏపీని తమ వాణిజ్య స్థావరంగా చేసుకోవడంపై సానుకూలంగా స్పందించాయి. రాష్ట్రంలో పోర్టులు, ఎయిర్‌పోర్టులు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ల్యాండ్ బ్యాంకులు, పెట్టుబడిదారులకు పారిశ్రామిక ప్రోత్సాహకాలపై కొరియా పారిశ్రామికవేత్తలకు లోకేశ్ వివరించారు. ఆయన చొరవ, వేగాన్ని చూసిన కొరియా పెట్టుబడిదారులు, ప్రతినిధులు ‘పల్లి.. పల్లి మంత్రి’ (వేగమంతమైన మంత్రి) అంటూ ప్రశంసించారు. కొరియా పర్యటన ఫలితాలు మరికొద్ది రోజుల్లోనే కనిపిస్తాయని అధికారులు విశ్వాసం వ్యక్తం చేశారు. భారత్-కొరియా దేశాల మధ్య ఉన్న సంబంధం మరింత బలోపేతం అవుతుందని వాణిజ్య రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.