చాలెంజ్ చేస్తున్నా.. డీఎస్సీ మీద చర్చిద్దాం రా
ABN , Publish Date - Jul 28 , 2026 | 05:07 AM
మెగా డీఎస్సీ అంశంలో తనపై, కూటమి ప్రభుత్వంపై బురద చల్లుతున్న వైసీపీ నేతలను, జగన్‌ను విద్యాశాఖ మంత్రి లోకేశ్ నేరుగా సవాల్ చేశారు. ‘‘జగన్.. చాలెంజ్ చేస్తున్నా..
టైమ్, డేట్ నువ్వే ఫిక్స్ చెయ్.. జగన్‌కు మంత్రి లోకేశ్ సవాల్
మేం పారిపోయే టైప్ కాదు భాయ్.. దొంగ చానళ్లు పెట్టింది మేం కాదు
లిక్కర్‌లో ఎవరెంత డబ్బు దోచేశారో అదీ చర్చిద్దామన్న మంత్రి
విజయవాడ/ కంకిపాడు, జూలై 27 (ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీ అంశంలో తనపై, కూటమి ప్రభుత్వంపై బురద చల్లుతున్న వైసీపీ నేతలను, జగన్‌ను విద్యాశాఖ మంత్రి లోకేశ్ నేరుగా సవాల్ చేశారు. ‘‘జగన్.. చాలెంజ్ చేస్తున్నా.. బహిరంగ చర్చకు రా.. డీఎస్సీ నిర్వహణపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు. టైమ్, డేట్ నువ్వే ఫిక్స్ చెయ్.. లోకేశ్ ఒక్కడే వస్తాడు. డీఎస్సీ మీద చర్చిద్దాం. లిక్కర్‌లో ఎవరెంత డబ్బులు దొబ్బేశారో కూడా చర్చించుకుందాం. మేం పారిపోయే టైప్ కాదు భాయ్. రెండు లక్షల టీచర్ పోస్టులు భర్తీ చేసిన ఘనచరిత్ర మాది. ఐదేళ్ల మీ పాలనలో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదు. పారదర్శకంగా డీఎస్సీ నిర్వహిస్తే బురద జల్లుతారా? కేసులు వేసి అడ్డుకునే ప్రయత్నం చేస్తారా? దొంగ చానళ్లు పెట్టి తప్పుడు ప్రచారాలు చేయడం కాదు. రా..వచ్చి కూర్చో. ఇద్దరం డీఎస్సీపై చర్చించుకుందాం. ఓపెన్ ఆఫర్ ఇస్తున్నా’’ అని లోకేశ్ వ్యాఖ్యానించారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడులో పెనమలూరు నియోజకవర్గ కార్యకర్తలను ఆయన కలుసుకున్నారు. ఈ సమావేశంలో జగన్‌పై మంత్రి నిప్పులు చెరిగారు. ‘‘రిజర్వేషన్లను పక్కాగా అమలుచేస్తూ, అత్యంత పారదర్శకంగా 150 రోజుల్లో డీఎస్సీ నిర్వహిస్తే, ఏకంగా 150 కేసులు వేసి అడ్డుకోవాలని చూశారు. ఆ కేసులన్నీ కోర్టులు కొట్టివేశాయి. విధ్వంసం, బూతులు మాట్లాడటం, బాబాయిని గొడ్డలితో లేపేయడం, తల్లిని, చెల్లిని ఇంట్లోంచి తరిమేయడం గొడ్డలి పార్టీ విధానం. జగన్‌కు ‘క్రెడిట్ చోరీ డిజార్డర్’ అనే మానసిక రుగ్మత ఉంది.
కూటమి ప్రభుత్వం రేయింబవళ్లు కష్టపడి తెచ్చిన ఆర్సెలార్ మిత్తల్, గూగుల్, రాయల్ ఎన్‌ఫీల్డ్ పరిశ్రమలను తానే తె చ్చానని చెప్పుకోవడం ఆయనకున్న జబ్బు లక్షణం’’ అని మంత్రి తెలిపారు. ఆదిత్య బిర్లా యాజమాన్యంతో మాట్లాడి స్టీల్ ప్లాంట్ తాను తీసుకురాగా, జగన్ ప్రెస్‌మీట్ పెట్టి అబద్ధాలు మాట్లాడారని అన్నారు. ప్లాంట్ ఒడిస్సా వెళ్లిపోతుంటే తాము పట్టుకొచ్చి సుబ్బారెడ్డితో శంకుస్థాపన చేయించామని చెబుతున్నారు. మన పార్టీకి మంచి సిద్ధాంతాలు ఉన్నాయి. గొడ్డలి పార్టీకి సిద్ధాంతమే లేదని ఎద్దేవా చేశారు.