Share News

ప్యాలెస్‌లో కూర్చోవడం కాదు.. బయటికి రా!

ABN , Publish Date - Aug 23 , 2026 | 04:18 AM

డీఎస్సీ, ఏపీపీఎస్సీ మధ్య కూడా తేడా తెలియని స్థితిలో మాజీ సీఎం జగన్‌ ఉన్నాడని మంత్రి లోకేశ్‌ ఎద్దేవా చేశారు. మెగా డీఎస్సీ నిర్వహణపై చర్చకు రావాలని, ‘తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చోవడం కాదు. బయటికి రా’ అని సవాల్‌ విసిరారు.

ప్యాలెస్‌లో కూర్చోవడం కాదు.. బయటికి రా!

  • ఐదోసారి సవాల్‌ చేస్తున్నా.. డీఎస్సీపై చర్చిద్దామా?

  • డీఎస్సీ, ఏపీపీఎస్సీ మధ్య తేడా తెలియని స్థితిలో జగన్‌

  • వైసీపీ అబద్ధాలను ప్రతి ఒక్కరూ తిప్పికొట్టాలి

విజయనగరం ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): డీఎస్సీ, ఏపీపీఎస్సీ మధ్య కూడా తేడా తెలియని స్థితిలో మాజీ సీఎం జగన్‌ ఉన్నాడని మంత్రి లోకేశ్‌ ఎద్దేవా చేశారు. మెగా డీఎస్సీ నిర్వహణపై చర్చకు రావాలని, ‘తాడేపల్లి ప్యాలె్‌సలో కూర్చోవడం కాదు. బయటికి రా’ అని సవాల్‌ విసిరారు. శనివారం నిర్వహించిన విజయనగరం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి లోకేశ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ ద్వారా అత్యంత పారదర్శకంగా 16 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిందని పేర్కొన్నారు. అయితే డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ కోర్టుకు వెళ్లి పిటిషన్లు వేసిందని, కోర్టు కూడా ఎక్కడా ప్రభుత్వాన్ని తప్పుబట్టలేదన్నారు. ‘ఏపీపీఎస్సీ, డీఎస్సీపై కనీస అవగాహన లేని వ్యక్తి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఐదేళ్లలో ఒక్క టీచర్‌ పోస్టు భర్తీ చేయలేదు. వెర్జికల్‌, హారిజాంటల్‌ రిజర్వేషన్‌ అంటే ఏంటో కూడా జగన్‌కు అర్థం కాలేదు. డీఎస్సీపై గొడ్డలి పార్టీ చేస్తున్న దుష్ప్రచారంపై చర్చకు జగన్‌కు చాలెంజ్‌ చేశాను. అయినా జగన్‌ రాలేదు. ఈ రోజు కూడా ఐదోసారి చాలెంజ్‌ చేస్తున్నా.


నువ్వే టైమ్‌, డేట్‌ ఫిక్స్‌ చెయ్యి. డీఎస్సీపై చర్చిద్దాం రా..’ అని సవాల్‌ చేశారు. కష్టపడి టెట్‌, డీఎస్సీ రాసి ఎంపికైన ఉపాధ్యాయులను జగన్‌ అనుమానిస్తున్నారని మండిపడ్డారు. జగన్‌ పదేపదే చెబుతున్న అబద్ధాలను కార్యకర్తలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే వెన్నెముక అని, కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తను గుర్తించి సముచిత స్థానం కల్పించే బాధ్యత తనదేనని భరోసా ఇచ్చారు. కార్యకర్తలు తనను వెతుక్కుంటూ రావాల్సిన అవసరం లేదని, కష్టపడే కార్యకర్తలను తానే వెతుక్కుంటూ వస్తానని స్పష్టం చేశారు. పార్టీ, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం ఆలోచించే వ్యక్తి అశోక్‌గజపతిరాజు అని లోకేశ్‌ కొనియాడారు. ‘వైసీపీ రప్పా రప్పా అంటే చూస్తూ ఊరుకోం. చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తీసుకొనే బాధ్యత నాది. రెడ్‌బుక్‌ దాని పని అది చేసుకుంటూ పోతుంది. అందరినీ గుర్తు పెట్టుకున్నా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనపై దుష్ప్రచారం చేసిన వాళ్లు గుర్తున్నారు. మన పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్లు ఇప్పుడు తిరిగి పార్టీలోకి రావాలని చూస్తున్నారు. వారికి నో ఎంట్రీ. ఇక్కడ హౌస్‌ ఫుల్‌’ అని లోకేశ్‌ స్పష్టం చేశారు.


జోరువానలోనూ అపూర్వ స్వాగతం

టీడీపీ వర్కింగ్‌ ప్రెసిండెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి విజయనగరం వచ్చిన మంత్రి లోకేశ్‌కు అపూర్వ స్వాగతం లభించింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు భారీగా తరలివచ్చారు. జోరువాన కురుస్తున్నా యువనేతకు నీరాజనం పలికారు. లోకేష్‌ శనివారం మధ్యాహ్నం 12.10 గంటలకు వై.జంక్షన్‌కు చేరుకున్నారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు నాగార్జునతో కలిసి లోకేష్‌ రోడ్‌షో ముందుకు సాగింది. జనం భారీగా తరలి రావడంతో రోప్‌పార్టీ సహాయంతో లోకేశ్‌ వాహనాన్ని ముందుకు పంపించారు. దారిపొడవునా మహిళలు, చిన్న పిల్లలను లోకేశ్‌ ఆత్మీయంగా పలకరించారు.

Updated Date - Aug 23 , 2026 | 04:20 AM