మనసులు గెలవండి
ABN , Publish Date - May 06 , 2026 | 06:15 AM
టీడీపీలో వ్యక్తు లు శాశ్వతం కాదని, పార్టీ శాశ్వతమని టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి లోకేశ్ అన్నారు. పార్టీ శ్రేణులు ఏమైనా సమస్యలుంటే అంతర్గత వేదికలపై...
ప్రజలే మనల్ని మళ్లీ మళ్లీ గెలిపిస్తారు
ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకమే
తమిళనాట ఒక్క ఓటుతోనూ గెలిచారు
టీడీపీ కార్యకర్తలతో లోకేశ్ ‘కాఫీ కబుర్లు’
అమరావతి, మే 5(ఆంధ్రజ్యోతి): టీడీపీలో వ్యక్తు లు శాశ్వతం కాదని, పార్టీ శాశ్వతమని టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి లోకేశ్ అన్నారు. పార్టీ శ్రేణులు ఏమైనా సమస్యలుంటే అంతర్గత వేదికలపై మాట్లాడి పరిష్కరించుకోవాలని, బహిరంగ వేదికలు ఎక్కవద్దని సూచించారు. ప్రజల్లో పార్టీ ప్రతిష్ఠను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. వివిధ కారణాలతో నాయకత్వంపై అలిగి, ఇంట్లో పడుకోవడం వల్ల అంతిమంగా పార్టీ నష్టపోతుందని హితవు పలికారు. అమరావతి ఉండవల్లి నివాసంలో మంగళవారం సాయంత్రం టీడీపీ క్లస్టర్, యూనిట్ ఇన్‌చార్జులతో నిర్వహించిన కాఫీ కబుర్లు కార్యక్రమంలో లోకేశ్ మాట్లాడారు. ‘‘మనం చేసిన అభివృద్ధి- సంక్షేమం ప్రజలకు వివరించండి, అహంకారం వీడి సత్ప్రవర్తన, మంచి మాటలతో ప్రజల మనసులను గెలవండి. ప్రజలే మనల్ని మళ్లీ మళ్లీ గెలిపిస్తారు’ అని లోకేశ్ పార్టీ క్యాడర్‌కు దిశానిర్దేశం చేశారు. గత ఎన్నికల్లో గొడ్డలి పార్టీ 151 నుంచి 11 సీట్లకు దిగజారడానికి వారి అహంకారమే కారణమన్నారు. చంద్రబాబు వద్ద కోటరీలు లేవని, సామాన్య కార్యకర్త సైతం నేరుగా ఆయనను కలిసి సమస్యలు చెప్పుకొనే అవకాశం ఉందన్నారు. ప్రతి వారం చంద్రబాబు లేక తాను కేంద్ర కార్యాలయంలో క్యాడర్‌కు అందుబాటులో ఉంటామన్నారు. ‘‘ప్రస్తుతం దేశంలో రూ.4 వేలు పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదే. తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు, ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి పథకాలను అమలు చేస్తున్న రాష్ట్రం కూడా ఇదే. ఓ వైపు సంక్షేమాన్ని అమలు చేస్తూనే పోలవరం వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును పూర్తి చేసుకుంటున్నాం. అమరావతి పనులను, రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధిని పరుగులెత్తిస్తున్నాం. అందువల్ల నెగిటివ్ ఆలోచనలు వద్దు. తమిళనాడు ఎన్నికల్లో ఒక్క ఓటుతో గెలిచిన ఎమ్మెల్యే కూడా ఉన్నారు. 2027లోగా రాష్ట్రం లో అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తా. చంద్రబాబు, నేను పర్యటనలకు మా సొంత వాహనాలనే వినియోగిస్తున్నాం అని లోకేశ్ పేర్కొన్నారు.
‘మై టీడీపీ’ యాప్ కీలకం
‘‘దీర్ఘకాలం అధికారంలో కొనసాగేందుకు బీజేపీ అమలు చేస్తున్న విధానాలను అధ్యయనం చేస్తున్నాం. మన పార్టీలో ‘మై టీడీపీ’ యాప్ ఉన్నట్టే, బీజేపీకి సరళ్ యాప్ ఉంది. కేంద్రమంత్రి నుంచి సామాన్య కార్యకర్త వరకు వారు చేసే రోజువారీ పనిని ఆ యాప్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ‘మై టీడీపీ’ యాప్‌లో టాప్ 10 మంది కార్యకర్తలను ప్రతి మూడు నెలలకోసారి కలు స్తాం. ప్రతి నాయకుడి పనితీరును చంద్రబాబు ప్రతి 3 నెలలకోసారి సమీక్షిస్తారు. పనిచేసే వారిని గుర్తించి సముచిత స్థానం కల్పి స్తాం.’’ అని లోకేశ్ భరోసా ఇచ్చారు.