Share News

టాపర్లే బ్రాండ్‌ అంబాసిడర్లు!

ABN , Publish Date - Jun 30 , 2026 | 05:11 AM

‘ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కాలేజీల్లో చదివి టాపర్లుగా నిలిచిన మీరంతా మా ప్రభుత్వ బ్రాండ్‌ అంబాసిడర్లు’ అని విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్‌ విద్యార్థులతో అన్నారు.

టాపర్లే బ్రాండ్‌ అంబాసిడర్లు!

  • మీరు పరీక్షలు రాసేటప్పుడు నేనూ టెన్షన్‌ పడ్డా

  • మీకు మార్కులు తక్కువొస్తే నా పదవి పీకేసేవారు

  • విద్యార్థులూ రాజకీయాల్లోకి రావాలి

  • పాఠశాలల్లో ఒక్కో విద్యార్థిపై రూ.లక్ష ఖర్చు

  • ప్రతి నియోజకవర్గంలో ఒక లీప్‌ స్కూల్‌

  • ఏఐ విప్లవంతో భారీగా ఉద్యోగాలొస్తాయ్‌

  • అందుకు అందరూ సన్నద్ధంగా ఉండాలి

  • ‘షైనింగ్‌ స్టార్స్‌’ కార్యక్రమంలో లోకేశ్‌ పిలుపు

  • 55 మంది టెన్త్‌ టాపర్లకు రూ.30 వేలు,మెడల్‌, సర్టిఫికెట్‌ ప్రదానం

  • 61 మంది ఇంటర్‌ టాపర్లకు ల్యాప్‌టాప్‌, మెడల్‌

అమరావతి, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): ‘ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కాలేజీల్లో చదివి టాపర్లుగా నిలిచిన మీరంతా మా ప్రభుత్వ బ్రాండ్‌ అంబాసిడర్లు’ అని విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్‌ విద్యార్థులతో అన్నారు. వారికి తక్కువ మార్కులు వచ్చి ఉంటే మంత్రి పదవి నుంచి తనను సీఎం పీకేసేవారని సరదాగా చెప్పారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివి టాపర్లుగా నిలిచిన 116 మంది టెన్త్‌, ఇంటర్‌ విద్యార్థులను ‘షైనింగ్‌ స్టార్స్‌’గా గుర్తించి సోమవారం తాడేపల్లిలో సత్కరించారు. కార్యక్రమంలో లోకేశ్‌ మాట్లాడారు. ‘మీరు పరీక్షలు రాస్తున్నప్పుడు మీలాగే నేను కూడా చాలా టెన్షన్‌ పడ్డాను. ప్రతిరోజూ పరీక్షల నిర్వహణ గురించి ఆరా తీశాను. ఫలితాల అనంతరం మీ ఫొటోలతో పేపర్‌ ప్రకటనలు చూసి గర్వపడ్డాను. మీ వల్ల నాకు, ప్రభుత్వానికి, టీచర్లకు గౌరవం పెరిగింది. చిన్నచూపు చూసే ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం తీసుకొచ్చారు’ అని ప్రశంసించారు. విద్యార్థులు ఐఏఎస్‌, ఐపీఎస్‌, డాక్టర్‌, ఇంజనీర్‌ కావాలని కోరుకుంటున్నట్లుగానే.. రాజకీయాల్లోకి కూడా రావాలని ఆకాంక్షించారు. ‘మీలో ఒక్కరైనా రాజకీయాల్లోకి వస్తామని రాస్తారేమోనని చూశాను. ఒక్కరు కూడా వాటిని భవిష్యత్‌గా ఎంచుకోలేదు. రాజకీయ రంగం ద్వారా సమాజంలో మార్పులు సాధించవచ్చు’ అని వారినుద్దేశించి వ్యాఖ్యానించారు. విద్యాశాఖ అంటే వ్యవసాయం లాంటిదని.. విత్తనం నాటిన వెంటనే ఫలితం రాదని చెప్పారు. విద్యాశాఖలో మనం ఇప్పుడు సంస్కరణలు తీసుకొస్తే వాటి ఫలితాలు భవిష్యత్‌లో కనిపిస్తాయన్నారు.


‘ఇప్పుడిప్పుడే మనం చేసిన పనుల ఫలితాలు వస్తున్నాయి. మిమ్మల్ని చూస్తుంటే రైతన్నలాగే నాకు కూడా ఆనందంగా ఉంది. ఈ విద్యా సంవత్సరంలో 1.06 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు నుంచి ప్రభుత్వ పాఠశాలలకు వచ్చారు. ఒక రోజు వస్తుంది.. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల కోసం సిఫారసులు చేయించుకునే పరిస్థితి వస్తుందని గతంలో చెప్పాను. అన్నట్టుగానే నా నియోజకవర్గంలో నిడమర్రు లీప్‌ స్కూల్‌ కోసం భారీగా సిఫారసులు వచ్చాయి. మా పిల్లలకు ఎందుకు సీటు ఇవ్వరని ఇటీవల ఓ తల్లి నన్ను గట్టిగా అడిగింది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇలాంటి పరిస్థితి రావాలి’ అని పిలుపిచ్చారు. తాను క్రమశిక్షణగా ఉండటానికి టీచర్లే కారణమన్నారు. వారిని జీవితాంతం గుర్తుపెట్టుకోవాలని చెప్పారు.


హార్డ్‌వేర్‌.. సాఫ్ట్‌వేర్‌

కేవలం భవనాలతో మాత్రమే ఫలితాలు రావని.. పాఠశాలలకు హార్డ్‌వేర్‌ లాంటి భవనాలతో పాటు సాఫ్ట్‌వేర్‌లాంటి విద్యార్థులు, టీచర్లు, చదువు కూడా ముఖ్యమని లోకేశ్‌ తెలిపారు. ‘మా ప్రభుత్వంలో విద్యా రంగంలో రాజకీయ జోక్యం లేకుండా చేశాం. పాఠ్యపుస్తకాల్లో మా ముందుమాటలు తొలగించాం. నాణ్యమైన బియ్యంతో మధ్యాహ్న భోజన పథకం అమలుచేస్తున్నాం. విద్యతో పాటు సమాజంలో నైతిక విలువలు చాలా అవసరం. అందుకే ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ద్వారా నైతిక విలువల విద్యను అందిస్తున్నాం. మహిళలను గౌరవించే పాఠ్యాంశాలు బోధిస్తున్నాం. మహిళలను తక్కువ చేసి మాట్లాడితే తగిన బుద్ధి చెప్పాలి. జీవితంలో కొన్ని వైఫల్యాలుంటాయి. నేను మంగళగిరిలో మొదటిసారి ఓడిపోయాను. దానిని తొలి అనుభవంగా భావించి కష్టపడడం వల్ల 91వేల మెజారిటితో అదే నియోజకవర్గం నుంచి గెలిచాను. అలాగే విద్యార్థులు కూడా చిన్న చిన్న ఫెయిల్యూర్లకు జీవితాలను త్యాగం చేయాలనుకోకూడదు. ఒక్కో పాఠశాల విద్యార్థిపై ప్రభుత్వం రూ.లక్ష ఖర్చు చేస్తోంది. విద్యార్థులు అది గుర్తుంచుకుని బాధ్యతగా ఉండాలి. చదివిన పాఠశాలలను ఎప్పుడూ మర్చిపోకూడదు. భవిష్యత్‌లో అవకాశం వచ్చినప్పుడు ఆయా పాఠశాలలకు ఎంతో కొంత సాయం చేయాలి’ అని సూచించారు. 55 మంది టెన్త్‌ టాపర్లకు రూ.30వేల నగదు, మెడల్‌, సర్టిఫికెట్‌.. 61 మంది ఇంటర్‌ టాపర్లకు ల్యాప్‌టాప్‌, మెడల్‌ అందజేశారు.


కర్నూలు జిల్లాలో వలసలు నివారిస్తాం..

లోకేశ్‌ విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. కర్నూలు జిల్లాకు ఎక్కువ పరిశ్రమలు వస్తున్నాయని, అక్కడ వలసలు నివారిస్తామని ఓ విద్యార్థితో అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రంథాలయాలను బలోపేతం చేస్తామన్నారు. తాను తన కుమారుడికి చదువు విషయంలో గైడ్‌ చేయనని, ఖాళీ దొరికితే తనతో క్రికెట్‌ ఆడుకోవాలని ఉంటుందని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక లీప్‌ స్కూల్‌ ఏర్పాటుచేస్తామన్నారు. పారిశ్రామిక విప్లవం తరహాలోనే ఏఐ విప్లవంతో భారీగా ఉద్యోగాలొస్తాయని, అందుకు అందరూ సన్నద్ధంగా ఉండాలని అన్నారు. అంగన్‌వాడీ నుంచి ఉన్నత విద్య వరకు ప్రతి విద్యార్థిని ట్రాకింగ్‌ చేసే వ్యవస్థ రూపొందిస్తున్నామని చెప్పారు. ఏ దశలో విద్యార్థి చదువు ఆపేసినా పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. తాను భారతీయ విద్యా వ్యవస్థలో కంటే అమెరికాలోని క్రిటికల్‌ అనలిటికల్‌ థింకింగ్‌లో విజయవంతం అయ్యాయని ఓ ప్రశ్నకు సమాధానంగా లోకేశ్‌ చెప్పారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో కెరీర్‌ కౌన్సెలింగ్‌పై దృష్టిసారిస్తామన్నారు. కొందరు విద్యార్థులు నీట్‌, జేఈఈ, సీఏ కోర్సుల కోసం లాంగ్‌ టర్మ్‌ కోచింగ్‌ ఇప్పించాలని, ఉన్నత విద్యకు సహకరించాలని విజ్ఞప్తి చేయగా.. అందరికీ అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఉన్నతాధికారులు తమీమ్‌ అన్సారియా, రంజిత్‌ బాషా, శ్రీనివాసులురెడ్డి, విక్టర్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 30 , 2026 | 05:13 AM