Share News

టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా లోకేశ్‌ బాధ్యతల స్వీకారం

ABN , Publish Date - Apr 30 , 2026 | 04:02 AM

టీడీపీ జాతీయ, రాష్ట్ర కమిటీల ప్రమాణస్వీకార కార్యక్రమం పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం అట్టహాసంగా జరిగింది. టీడీపీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా లోకేశ్‌ బాధ్యతలు స్వీకరించారు.

టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా లోకేశ్‌ బాధ్యతల స్వీకారం

  • పార్టీ కేంద్ర కార్యాలయంలో అట్టహాసంగా జాతీయ, రాష్ట్ర కమిటీల ప్రమాణస్వీకారోత్సవం

  • మూడోతరంతోనూ కలసి పనిచేయనున్న గోరంట్ల, యనమల

  • తొలిసారిగా పొలిట్‌బ్యూరోలోకి మండల, క్లస్టర్‌ స్థాయి నేతలు

అమరావతి, ఏప్రిల్‌ 29(ఆంధ్రజ్యోతి): టీడీపీ జాతీయ, రాష్ట్ర కమిటీల ప్రమాణస్వీకార కార్యక్రమం పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం అట్టహాసంగా జరిగింది. టీడీపీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా లోకేశ్‌ బాధ్యతలు స్వీకరించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు చేతుల మీదుగా నూతన కార్యవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. పాత, కొత్త నేతల కలయికతో కమిటీలను టీడీపీ అధినాయకత్వం ఏర్పాటు చేసింది. పార్టీ చరిత్రలో తొలిసారిగా మండల, క్లస్టర్‌ స్థాయి నేతలకూ పొలిట్‌బ్యూరోలో చోటు కల్పించారు. లోకేశ్‌ ఇచ్చిన ‘కార్యకర్తే అధినేత’ నినాదాన్ని నిజం చేస్తూ పని చేసిన వారికే కమిటీల్లో పెద్ద పీట వేశారు. పార్టీ ఆవిర్భవించిన 44 సంవత్సరాలు గడిచిన నేపథ్యంలో పార్టీకి ప్రెష్‌ లుక్‌ వచ్చేలా కమిటీల నియామకం జరిగింది. సీనియర్ల సారథ్యం, జూనియర్ల దూకుడును సమపాళ్లలో కలుపుతూ కమిటీల నియామకం చేశామని చంద్రబాబు తెలిపారు. పొలిట్‌బ్యూరోలో చోటు దక్కించుకున్న మంగళగిరి క్లస్టర్‌ ఇన్‌చార్జి గుత్తికొండ ధనుంజయ్‌, గజపతినగరం మండల పార్టీ అధ్యక్షురాలు గంట్యాడ శ్రీదేవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గతంలో సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా పనిచేసిన వారికీ కమిటీల్లో చోటు కల్పించారు. ఎన్టీఆర్‌, చంద్రబాబు పార్టీ అధ్యక్షులుగా పనిచేసిన సమయంలోనూ పార్టీ కమిటీల్లో కీలకంగా వ్యవహరించిన యనమల రామకృష్ణుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రస్తుతం లోకేశ్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు తీసుకున్న కమిటీలోనూ కీలక బాధ్యతల్లో ఉండటం గమనార్హం. వీరిద్దరూ పొలిట్‌బ్యూరో సభ్యులుగా కొనసాగుతున్నారు.

లోకేశ్‌కు అభినందనల వెల్లువ

టీడీపీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన లోకేశ్‌కు పలువురు నేతలు అభినందనలు తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర నాయకులు ఆయనను కలసి అభినందనలు తెలిపారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు జన్మదినం కూడా కావడంతో లోకేశ్‌ తన చాంబర్‌లో ఎంపీతో కేక్‌ కట్‌ చేయించి, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

Updated Date - Apr 30 , 2026 | 04:02 AM