Share News

మేనేజ్‌మెంట్‌ కమిటీలకు పాఠశాలల పనులు

ABN , Publish Date - Apr 17 , 2026 | 04:50 AM

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల పనులను స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ(ఎస్ఎంసీ)లకు అప్పగించాలని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి లోకేశ్‌ అధికారులకు స్పష్టంచేశారు.

మేనేజ్‌మెంట్‌ కమిటీలకు పాఠశాలల పనులు

  • తాగునీరు, టాయిలెట్లు తదితర పనులు త్వరగా పూర్తిచేయాలి

  • అడ్మిషన్లు పెంచేందుకు ఇంటింటి ప్రచారం

  • ఇందులో ప్రజాప్రతినిధులూ భాగస్వామ్యం

  • ప్రైవేట్‌కు పోటీగా ప్రభుత్వ కాలేజీల్లో ఇంటర్‌ ఫలితాలు

  • వీటిపై విస్తృతంగా ప్రచారం చేయాలి

  • మంచి మార్కులు సాధించిన విద్యార్థులను సత్కరించాలి

  • విద్యాశాఖపై సమీక్షలో మంత్రి లోకేశ్‌

అమరావతి, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల పనులను స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ(ఎస్ఎంసీ)లకు అప్పగించాలని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి లోకేశ్‌ అధికారులకు స్పష్టంచేశారు. గురువారం విద్యాశాఖ అధికారులతో ఉండవల్లిలోని నివాసంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో త్రీ స్టార్‌ మౌలిక సదుపాయాలు ఉండాలన్నారు. వెయ్యి మందికి పైగా విద్యార్థులున్న 60 పాఠశాలల్లో ఫైవ్‌ స్టార్‌ సదుపాయాలు కల్పించాలన్నారు. లీక్‌ ప్రూఫ్‌ భవనాలు, తాగునీరు, టాయిలెట్లు, బల్లలు, రంగుల పనులను ఎస్‌ఎంసీలకు అప్పగించి త్వరగా వాటిని పూర్తిచేయాలన్నారు. మోడల్‌ ప్రైమరీ స్కూళ్లలో అదనపు తరగతి గదుల నిర్మాణం పనులను మౌలిక సదుపాయాల సంస్థ ద్వారా చేపట్టాలన్నారు. ఏజెన్సీల్లోనూ, మారుమూల ప్రాంతాల్లోనూ సొంత భవనాలు లేని పాఠశాలలను గుర్తించి భవన నిర్మాణ పనులు చేపట్టాలని ఆదేశించారు. మంగళగిరి నియోజకవర్గంలో కొత్తగా నిర్మించిన ప్రాథమికోన్నత పాఠశాలలో సీట్ల కోసం పోటీ పడటం మంచి పరిణామం అని మంత్రి అన్నారు. అడ్మిషన్లపై అధికారులు దృష్టిసారించి, ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలన్నారు. ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులను కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తామని చెప్పారు.


క్రీడలను ప్రోత్సహించాలి

ఆసక్తి కలిగిన విద్యార్థులను గుర్తించి బ్యాడ్మింటన్‌, ఖోఖో, ఆర్చరీ లాంటి క్రీడల్లో ప్రోత్సహించాలన్నారు. ఇందుకోసం శాప్‌ అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. కాలేజీ స్థాయిలో లీగ్స్‌ నిర్వహించే అంశాన్ని పరిశీలించాలన్నారు. ఇంటర్‌లో ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల విద్యార్థులు మార్కులు సాధించారని, దీనిపై విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. ఉత్తమ మార్కులు సాధించినవారిని షైనింగ్‌ స్టార్స్‌గా గుర్తించి సత్కరించాలని చెప్పారు. ఉన్నత విద్యా సంస్థల్లో ముఖ ఆధారిత హాజరుపై పకడ్బందీగా చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు.

Updated Date - Apr 17 , 2026 | 04:51 AM