గల్లా జయదేవ్‌కు ఆంధ్రప్రదేశ్ క్షమాపణలు చెపుతోంది: మంత్రి లోకేశ్
ABN , Publish Date - Jul 17 , 2026 | 04:31 AM
‘గల్లా జయదేవ్... గత ప్రభుత్వ హయాంలో మీ సంస్థ అమర రాజా గ్రూప్ ఎదుర్కొన్న వేధింపులకు ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణలు చెపుతోంది’ అని మంత్రి లోకేశ్ అన్నారు.
అమరావతి, జూలై 16(ఆంధ్రజ్యోతి): ‘గల్లా జయదేవ్... గత ప్రభుత్వ హయాంలో మీ సంస్థ అమర రాజా గ్రూప్ ఎదుర్కొన్న వేధింపులకు ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణలు చెపుతోంది’ అని మంత్రి లోకేశ్ అన్నారు. తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లి గిగా కారిడార్‌లో అమరరాజా ‘కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్’ను ప్రారంభించింది. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా మంత్రి స్పందించారు. ‘గత ప్రభుత్వ హయాంలో మీ కంపెనీ ఎదుర్కొన్న వేధింపులు జరిగి ఉండాల్సింది కాదు. ఆంధ్రప్రదేశ్‌లో అంకురించిన ఒక సంస్థ తన తదుపరి వృద్ధి కోసం మన సరిహద్దులు దాటి బయట వెతుక్కోవాల్సి రావడం నన్ను ఎంతగానో కలచివేస్తోంది. ఆంధ్రప్రదేశ్ మరోసారి మీ పరిశ్రమలకు, పెట్టుబడులకు సిద్ధంగా ఉంది. భవిష్యత్తులో అమరరాజా సాధించే అతిపెద్ద విజయాలన్నీ ఆ సంస్థ సొంత గడ్డపైనే సాగుతాయని ఆశిస్తున్నా’ అని పేర్కొన్నారు.