Share News

సగర్వంగా ప్రభుత్వ బడి!

ABN , Publish Date - Aug 23 , 2026 | 04:24 AM

ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్‌ అన్నారు.

సగర్వంగా ప్రభుత్వ బడి!

  • కార్పొరేట్‌కు దీటుగా అభివృద్ధి చేస్తాం: మంత్రి లోకేశ్‌

విశాఖపట్నం/మధురవాడ, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్‌ అన్నారు. ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులను అన్ని విధాలా ప్రోత్సహిస్తామని తెలిపారు. భవిష్యత్తులో ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు విధానం అమలు చేస్తామన్నారు. శనివారం విశాఖపట్నం నగర పరిధిలోని చంద్రంపాలెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు మంత్రి లోకేశ్‌ వచ్చారు. ‘దివీస్‌ లాబొరేటరీస్‌’ రూ.6.48 కోట్లతో అభివృద్ధి చేసిన క్రీడా మైదానం, క్రీడా కోర్టులు, ఆర్వో ప్లాంటును ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి లోకేశ్‌ సరదాగా వాలీబాల్‌ ఆడారు. అనంతరం పాఠశాల ఆవరణలో విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. లోకేశ్‌ మాట్లాడుతూ.. గత విద్యా సంవత్సరం పదో తరగతిలో అత్యధిక మార్కులు వచ్చిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడం రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి అని పేర్కొన్నారు. ఈ విధానంతో సర్కారు బడులపై తల్లిదండ్రులకు నమ్మకం పెరిగిందని, ఈ ఏడాది పిల్లల చేరికలు పెరిగాయన్నారు. సమాజంలో మార్పు కోసం చదువుకున్న యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని.. అందుకు పెద్ద కలలు కని, వాటిని సాకారం చేసుకునేందుకు కష్టపడాలని లోకేశ్‌ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు వేపాడ చిరంజీవిరావు, గాదె శ్రీనివాసులనాయుడు, కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌, దివీస్‌ లాబొరేటరీస్‌ డైరెక్టర్‌ నీలిమ దివి తదితరులు పాల్గొన్నారు.


  • అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులు

ఎన్‌.ప్రణతి (విద్యార్థిని): లోకేశ్‌ అన్నా... ఇంతకుముందు మీరుచూసిన చంద్రంపాలెం స్కూలుకు, ఇప్పటికి తేడా ఏంటి?

మంత్రి లోకేశ్‌: ఈ పాఠశాలకు ఎప్పుడొచ్చినా వర్షం పడుతుంది. ఈ రోజూ వర్షం పడింది. మొదటిసారి ఆకస్మికంగా ఇక్కడకు వచ్చాను. మరోసారి ల్యాబ్‌ ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు భారీ వర్షానికి బురద కనిపించింది. స్కూలు మైదానాన్ని ఇప్పుడు సుందరంగా తీర్చిదిద్దారు. ఇలానే రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి, అత్యున్నత ప్రమాణాలతో కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యం.

  • పని పూర్తయే వరకూ చంద్రబాబు తోముడే!

ఎ.దీపిక (విద్యార్థిని): లోకేశ్‌ అన్నా...మీకు ఇష్టమైన క్రీడ ఏది?, ఇప్పటికీ ఆడుతున్నారా?

లోకేశ్‌: ప్రతి భారతీయుడిలానే నాకు కూడా క్రికెట్‌ అంటే ఇష్టం. మా ఇంట్లో రౌడీ (దేవాన్ష్‌) ఉన్నాడు. వాడితో ప్రతి ఆదివారం కనీసం రెండు గంటలపాటు క్రికెట్‌ ఆడతా. ఇంకా ఆడాలని ఉన్నా మా లీడర్‌ చంద్రబాబు మాకు సమయం ఇవ్వరు. ఒక టీచర్‌లా మాకు పనులు అప్పగించి అవి పూర్తయ్యే వరకు తోముతుంటారు.

  • క్రీడల్లో బాలికల ప్రోత్సాహానికి ‘షీ ప్లే’

ప్రణతి (విద్యార్థిని): క్రీడల్లో అమ్మాయిలకు తక్కువ అవకాశాలు ఉన్నాయి కదా..!

లోకేశ్‌: ఇది వాస్తవమే. మహిళలు క్రీడల్లోకి రావడానికి అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. ప్రతిభావంతులైన పిల్లలను ఆడ, మగ అనే తేడా లేకుండా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. బాలికలను క్రీడల్లో ప్రోత్సహించేందుకు ‘షీ ప్లే’ కార్యక్రమాన్ని అమలు చేస్తాం. ప్రాథమిక పాఠశాల నుంచి బాలికలకు క్రీడల్లో అవకాశాలు కల్పిస్తాం.


  • అప్పుడే నిర్ణయించుకున్నా..

జగదీశ్‌ (విద్యార్థి): రాజకీయాల్లోకి రాకుంటే ఏ వృత్తిలో స్థిరపడేవారు?

లోకేశ్‌: 2005లో హైదరాబాద్‌లో ఒక పెళ్లికి నాన్నతో కలిసి వెళ్లినప్పుడు.. అక్కడకు వచ్చిన వేలాది మంది లేచి నిలబడి ఆయనకు సమస్కారం చేయడం చూశాను. ఒక వ్యక్తికి ప్రజలు ఇచ్చే గౌరవాన్ని ప్రత్యక్షంగా చూసి, రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నా. స్టాన్‌ఫోర్డ్‌ వర్సిటీలో ప్రవేశ ఫారం ఇచ్చినప్పుడు రాజకీయాల్లోకి వెళతానని రాశా. చివరకు బ్రహ్మణికి కూడా ఇదే విషయం చెప్పా.

  • అమ్మ, నాన్న నుంచి క్రమశిక్షణ నేర్చుకున్నా

దీపిక (విద్యార్థిని): తల్లిదండ్రుల నుంచి ఏంనేర్చుకున్నారు?

లోకేశ్‌: అమ్మ, నాన్న నుంచి క్రమశిక్షణ నేర్చు కున్నా. చిన్నప్పటి నుంచి అమ్మ ప్రభావమే ఎక్కువ. తప్పుడు మార్గంలో వెళ్లకుండా అమ్మ క్రమశిక్షణతో పెంచింది. నేను ఈ స్థాయికి రావడానికి అమ్మే కారణం.

  • ఆ ‘ప్రకటన’ చరిత్రలోనే రికార్డు

ప్రణతి (విద్యార్థిని): ప్రభుత్వ బడుల్లో పదో తరగతిలో ఎక్కువ మార్కులు వచ్చిన పిల్లల ఫొటోలతో యాడ్‌ ఇవ్వాలనే ఆలోచన ఎలా వచ్చింది?

లోకేశ్‌: ప్రైవేటు పాఠశాలల మాదిరిగా ప్రభుత్వ బడుల్లో కష్టపడి చదివి, మంచిమార్కులు తెచ్చుకున్న విద్యార్థుల ఫొటోలతో పత్రికల్లో ప్రకటన ఇవ్వాలని అసెంబ్లీలో చెప్పాను. రాష్ట్ర చరిత్రలో ఇది రికార్డు.


  • ప్రతి ఒక్కరూ సాయం చేయాలి

రోషిక్‌ (విద్యార్థి): దేవుడిని నమ్ముతారా?

లోకేశ్‌: పేదరికం నుంచి సమాజం బయటపడాలంటే ప్రతి ఒక్కరూ తమకు చేతనైన సహాయం చేయాలి. సాయం చేసే గుణం ఉంటేనే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటాం. అప్పుడు మీలోనే దేవుడు కనబడతాడు.

  • స్నేహితులను మర్చిపోకూడదు

దీపిక (విద్యార్థిని): బాగా సంతోషించిన సమయం ఏది?

లోకేశ్‌: స్కూలులో చదువుకునే రోజుల్లో భారీ వర్షం వస్తే సెలవు ఇచ్చేవారు. ఆ రోజు ఎంతో సంతోషంగా ఉండేది. ఇప్పుడు వర్షం పడితే చంద్రంపాలెం స్కూలుకు సెలవు ఇచ్చే అవకాశం లేదుగా!(విద్యార్థులు నవ్వారు). స్కూలు, కాలేజీ రోజుల్లో ఎంతో మంది స్నేహితులు దొరుకుతారు. మనం ఏ స్థాయికి వెళ్లినా స్నేహితులను మర్చిపోకూడదు. మనకు కష్టమొచ్చినా, సంతోషం వచ్చినా.. చివరకు తప్పుచేసినా తొలుత చెప్పుకునేది స్నేహితుడికే..

Updated Date - Aug 23 , 2026 | 04:26 AM