జాతీయ జెండా సాక్షిగా ఏపీని నంబర్ 1 చేస్తాం
ABN , Publish Date - Aug 16 , 2026 | 05:37 AM
జాతీయ జెండా సాక్షిగా కుల, మత, ప్రాంతాల కు అతీతంగా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే నంబర్ వన్‌గా నిలబెడతామని మంత్రి లోకేశ్ అన్నారు.
త్వరలో 10 వేల పోస్టులతో జాబ్ క్యాలెండర్: లోకేశ్
విజయవాడ, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): జాతీయ జెండా సాక్షిగా కుల, మత, ప్రాంతాల కు అతీతంగా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే నంబర్ వన్‌గా నిలబెడతామని మంత్రి లోకేశ్ అన్నారు. 2047 నాటికి రాష్ట్రాన్ని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. శనివారం విజయవాడలో నిర్వహించిన స్వాతం త్య్ర దినోత్సవంలో పాల్గొన్నారు. జాతీయ పతాకావిష్కరణ చేసిన అనంతరం సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం భారత్‌మాతాకీ జై అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘‘దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో ప్రైవేటు స్కూళ్ల నుంచి 1.10 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. సీఎం, మంత్రిగా నా ఫొటో పుస్తకాలపై ముద్రించలేదు. పదో తరగతిలో ఉత్తమ ర్యాంకులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఫొటోలను దేశంలో తొలిసారిగా పత్రికల మొదటి పేజీల్లో ప్రచురించాం. స్వామి వివేకానంద స్ఫూర్తితో నేను పనిచేస్తున్నాను. నాలుగేళ్లు ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్న యువకులకు ఉద్యోగాలు రావడం లేదు. 4 నెలలు కోచింగ్ కేంద్రంలో శిక్షణ తీసుకున్న వారికి ఉద్యోగాలు వస్తున్నాయి. దీనికి కారణం స్కిల్ గ్యాప్. అందుకోసమే ఇండస్ట్రీ, కాలేజీ కనెక్ట్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. ఆర్థిక ఇబ్బందులున్నా ప్రతి హామీని అమలు చేయడం బాధ్యతగా భావిస్తున్నాం. త్వరలో 10 వేల పోస్టుల భర్తీకి జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేస్తాం’’ అని అన్నారు.