‘ఫార్చ్యూన్ ఇండియా’ జాబితాలో బ్రాహ్మణికి చోటు
ABN , Publish Date - Jul 12 , 2026 | 04:51 AM
హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణికి జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. ఫార్చ్యూన్ ఇండియా ప్రకటించిన..
దేశంలో శక్తివంతమైన మహిళల్లో ఒకరిగా గుర్తింపు
సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ అభినందనలు
న్యూఢిల్లీ/అమరావతి, జూలై 11(ఆంధ్రజ్యోతి): హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణికి జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. ఫార్చ్యూన్ ఇండియా ప్రకటించిన ‘మోస్ట్ పవర్‌పుల్ ఉమెన్-2026’ జాబితాలో ఆమె చోటు దక్కించుకున్నారు. దేశంలోని 100 మంది శక్తివంతమైన మహిళల జాబితాలో బ్రాహ్మణి 92వ స్థానంలో నిలిచారు. శుక్రవారం రాత్రి నిర్వహించిన ఓ కార్యక్రమంలో నారా బ్రాహ్మణికి కేంద్ర ఆరోగ్య, కుటుంబ, శిశు సంక్షేమ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ ఈ అవార్డును అందజేశారు. ‘మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్’ జాబితాలో చోటు దక్కడం గౌరవంగా భావిస్తున్నట్లు బ్రాహ్మణి తెలిపారు. ఈ గుర్తింపు హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ కుటుంబానికి, ముఖ్యంగా రైతులకు దక్కుతుందని అన్నారు. ఈ గౌరవాన్ని కల్పించినందుకు ఫార్చ్యూన్ ఇండియాకు ధన్యవాదాలు తెలిపారు.
ఆడపడుచులకు స్ఫూర్తి: సీఎం చంద్రబాబు
దేశంలోని అత్యంత శక్తివంతమైన మహిళల్లో ఒకరిగా గుర్తింపు పొందడంపై నారా బ్రాహ్మణికి సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు శనివారం ‘ఎక్స్’ వేదికగా ఓ పోస్టు చేశారు. ఈ ప్రతిష్ఠాత్మక గుర్తింపు ఆమె నాయకత్వం, అంకితభావం, నిబద్ధతను ప్రతిబింబిస్తోందన్నారు. ఆమె ఓవైపు దేశంలోని అనేక మంది యువతులకు ప్రధానంగా మన తెలుగింటి ఆడపడుచులకు స్ఫూర్తిగా నిలుస్తూనే.. మరోవైపు తమ కుటుంబం గర్వపడేలా చేస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. బ్రాహ్మణి భవిష్యత్తులో మరెన్నో మైలురాళ్లు చేరుకోవాలని, వేసే ప్రతి అడుగులో విజయం సాధించాలని ఆకాంక్షించారు.
చాలా గర్వంగా ఉంది: మంత్రి లోకేశ్
తన సతీమణి బ్రాహ్మణి శక్తివంతమైన మహిళల జాబితాలో చోటు దక్కించుకోవడంపై మంత్రి లోకేశ్ శనివారం ‘ఎక్స్’ వేదికగా సంతోషం వ్యక్తం చేశారు. చాలా గర్వంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. ఇలాగే అత్యుత్తమ ప్రతిభను చాటుతూ, నాయకత్వం వహిస్తూ, అడ్డంకులను అధిగమిస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. బ్రాహ్మణికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అభినందనలు తెలిపారు. వ్యాపార రంగంలో ఆమె ప్రదర్శిస్తున్న సమర్థవంతమైన నాయకత్వం, దూరదృష్టి, నిబద్ధతకు ఈ గుర్తింపు నిదర్శనమన్నారు.