పరిశ్రమలకు సేవాపేక్ష ఉండాలి
ABN , Publish Date - Jun 26 , 2026 | 05:23 AM
పరిశ్రమలకు లాభాపేక్షతోపాటు సేవాపేక్ష ఉండాలని హెరిటేజ్ సంస్థ వైస్ చైర్‌పర్సన్, ఎండీ నారా భువనేశ్వరి అన్నారు. శ్రీసత్యసాయి జిల్లా లేపాక్షి మండలం కుర్లపల్లి ప్రభుత్వ పాఠశాల ఆవరణలో..
విద్యార్థులు కష్టపడి చదివి, పరిశ్రమలు పెట్టే స్థాయికి ఎదగాలి
కుర్లపల్లి పాఠశాల అదనపు గదుల ప్రారంభంలో భువనేశ్వరి
హిందూపురం, జూన్ 25(ఆంధ్రజ్యోతి): పరిశ్రమలకు లాభాపేక్షతోపాటు సేవాపేక్ష ఉండాలని హెరిటేజ్ సంస్థ వైస్ చైర్‌పర్సన్, ఎండీ నారా భువనేశ్వరి అన్నారు. శ్రీసత్యసాయి జిల్లా లేపాక్షి మండలం కుర్లపల్లి ప్రభుత్వ పాఠశాల ఆవరణలో హెరిటేజ్ సంస్థ నిర్మించిన అదనపు గదులను గురువారం ఆమె ప్రారంభించారు. గ్రామంలో పాఠశాల శిథిలావస్థకు చేరుకోవడంతో హెరిటేజ్ సంస్థ రూ.24 లక్షలు సీఎస్ఆర్ ఫండ్స్ వెచ్చించి అదనపు గదులు, ప్రహరీని నిర్మించింది. వీటిని ప్రారంభించిన భువనేశ్వరి, విలేకరులతో మాట్లాడారు. ‘పరిశ్రమలు ఏర్పాటయ్యాక ఆ ప్రాంత ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలి. స్థానికులకు సహాయ సహకారాలు అందించాలి. హెరిటేజ్ సంస్థ ఈ ప్రాంతంలో ఓ పరిశ్రమను ఏర్పాటు చేసింది. సంస్థ నిధులతో పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాం. ప్రతి పరిశ్రమ ప్రభుత్వానికి సీఎస్ఆర్ నిధులను అందించాలి’ అని భువనేశ్వరి విజ్ఞప్తి చేశారు. అనంతరం విద్యార్థులను ఆప్యాయంగా పలకరించారు. వారికి పుస్తకాలను పంపిణీ చేశారు. కష్టపడి చదివి పరిశ్రమలు ఏర్పాటు చేసే స్థాయికి ఎదగాలని, వాటిద్వారా సమాజానికి ఉపయోగపడాలని ఆకాంక్షించారు. ఆంగ్ల భాషపై పట్టు సాధించాలని, అనర్గళంగా మాట్లాడాలని సూచించారు.