చంద్రబాబుపై నమ్మకంతోనే పరిశ్రమలు
ABN , Publish Date - Mar 25 , 2026 | 05:07 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనా దక్షత మీద నమ్మకంతోనే రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సతీమణి, ఎన్టీఆర్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు.
కుప్పం పర్యటనలో నారా భువనేశ్వరి
కుప్పం, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనా దక్షత మీద నమ్మకంతోనే రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సతీమణి, ఎన్టీఆర్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. తద్వారా 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా, తొలి రోజు మంగళవారం కుప్పం మండలంలో ఆమె పర్యటించారు. మంకలదొడ్డి, టి.సదుమూరు, సింగాపురం, మోట్లచేను, కూసూరు, పైపాళ్యం గ్రామాల్లో మహిళలతో ముఖాముఖి సమావేశమయ్యారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి.. విద్యార్థులతో మాట్లాడి, బాగా చదివి ప్రయోజకులు కావాలని ప్రోత్సహించారు. ఆయా కార్యక్రమాల్లో భువనేశ్వరి మాట్లాడుతూ.. ‘కూటమి ప్రభుత్వం అన్ని జిల్లాలనూ అభివృద్ధి చేస్తోంది. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం రెండు కళ్లుగా చంద్రబాబు పాలన సాగిస్తున్నారు. గత ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డారో అందరికీ తెలిసిందే. నేనూ, నా కుటుంబం కూడా బాధితులమే. చివరికి అరాచక పాలనను కూలదోసి, కూటమిపై నమ్మకంతో చంద్రబాబుకు పాలనా పగ్గాలు అప్పగించారు. మా కుటుంబం మీద ప్రజలు పెట్టుకున్న నమ్మకం అపారమైనది. వారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం’ అని అన్నారు. కుప్పం నియోజకవర్గంలో కూడా పలు పరిశ్రమల స్థాపన శరవేగంగా జరుగుతోందని, తద్వారా నిరుద్యోగ సమస్య పూర్తిగా తొలగి వేలాది ఉద్యోగాలు లభిస్తాయని భువనేశ్వరి పేర్కొన్నారు.