Heritage Foods: భువనేశ్వరికి ఔట్ స్టాండింగ్ డెయిరీ ప్రొఫెషనల్ అవార్డు
ABN , Publish Date - Jan 11 , 2026 | 03:43 AM
డెయిరీ రంగ అభివృద్ధికి విశేష సేవలు అందించినందుకుగాను హెరిటేజ్ ఫుడ్స్ వైస్ చైర్‌పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరికి ప్రతిష్ఠాత్మక అవార్డు లభించింది.
పాడి రైతుల సాధికారత, డెయిరీ ఎకో సిస్టం అభివృద్ధిపై కృషికి గుర్తింపు
రైతుల సహకారం, హెరిటేజ్ బృందం కృషితోనే అవార్డు: భువనేశ్వరి
అమరావతి, జనవరి 10(ఆంధ్రజ్యోతి): డెయిరీ రంగ అభివృద్ధికి విశేష సేవలు అందించినందుకుగాను హెరిటేజ్ ఫుడ్స్ వైస్ చైర్‌పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరికి ప్రతిష్ఠాత్మక అవార్డు లభించింది. ఔట్‌స్టాండింగ్ డెయిరీ ప్రొఫెషనల్ అవార్డు - 2025ను భువనేవ్వరికి ఇండియన్ డెయిరీ అసోసియేషన్ ప్రదానం చేసింది. డెయిరీ పరిశ్రమ అభివృద్ధిలో ఆమె చూపిన చొరవ, దూరదృష్టి గల నాయకత్వం, రైతుల సాధికారతకు చేసిన విశేష కృషి, డెయిరీ ఎకోసిస్టంపై ఆమె కలిగించిన సానుకూల ప్రభావాన్ని గుర్తిస్తూ ఈ అవార్డు అందజేశారు. కేరళలోని కోజికోడ్‌లో కాలికట్ ట్రేడ్ సెంటర్, డాక్టర్ వర్గీస్ కురియన్ నగర్‌లో నిర్వహించిన సదరన్ డెయిరీ, ఫుడ్ కాన్‌క్లేవ్ - 2026 ప్రారంభ సమావేశంలో కేరళ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి జే.చించు రాణి చేతుల మీదుగా భువనేశ్వరి తరఫున హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ సీఈవో కేశవన్ ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ.. ‘అవార్డు తీసుకోవడం సంతోషంగా ఉంది. ఇది హెరిటేజ్ ఫుడ్స్ బృందం చేసిన నిరంతర కృషికి, రైతులు, ఇతర భాగస్వాములతో ఉన్న బలమైన సంబంధాలకు లభించిన గుర్తింపు’ అని పేర్కొన్నారు.
నిన్ను చూస్తే గర్వంగా ఉంది: సీఎం
తన సతీమణి భువనేశ్వరికి ఔట్ స్టాండింగ్ డెయిరీ ప్రొఫెషనల్ అవార్డు రావడంపై సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా స్పందించారు. భువనేశ్వరిని చూస్తే గర్వంగా ఉందన్నారు. ఈ గౌరవం వెనుక ఏపీకి చెందిన వేలాది మంది పాడి రైతుల కృషి ఉదని, వారి అభ్యున్నతికి భువనేశ్వరి చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. మహిళా సాధికారతకు ఆమె ఆదర్శమన్నారు. మంత్రి లోకేశ్ స్పందిస్తూ... ‘శుభాకాంక్షలు అమ్మా. జీవితమంతా పాడి రైతుల అభ్యున్నతికి, దేశ డైరీ ఎకోసిస్టమ్‌ని బలోపేతం చేయడానికి మీరు చేస్తున్న కృషిని చూసి నేను నిత్యం ప్రేరణ పొందుతూనే ఉన్నా. ఆ అవార్డుకు మీరు నిజమైన అర్హులు. కొడుకుగా గర్విస్తున్నా’ అని పేర్కొన్నారు.