నంద్యాలకు 16వ స్థానం
ABN , Publish Date - Jan 12 , 2026 | 11:31 PM
గడిచిన రెండు నెలల(డిసెంబరు, జనవరి ఇప్పటి వరకు) వ్యవధిలో పలు శాఖలకు సంబందించిన సేవలపై ప్రజా అభిప్రాయ సేకరణ పరంగా.. సమగ్ర నివేదికను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది.
ప్రభుత్వ సేవలపై ప్రజలు సంతృప్తి
తాజాగా ప్రభుత్వ నివేదిక విడుదల
నంద్యాల, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): గడిచిన రెండు నెలల(డిసెంబరు, జనవరి ఇప్పటి వరకు) వ్యవధిలో పలు శాఖలకు సంబందించిన సేవలపై ప్రజా అభిప్రాయ సేకరణ పరంగా.. సమగ్ర నివేదికను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. ఇందులో ఆయా అంశాల వారీగా రాష్ట్ర స్థాయిలో 67.17శాతం, జిల్లా స్థాయిలో 76.1 శాతం ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ లెక్కన జిల్లాకు రాష్ట్ర స్థాయిలో 16వ స్థానం దక్కింది. జిల్లాలోని శ్రీశైల మలన్న ఆలయంలో అందించే సేవలపరంగా ప్రజా అభిప్రాయ సేకరణలో భాగంగా 70.8శాతం సానుకూలంగా స్పందించారు. మిగిలిన 29.2 శాతం మంది మెరుగ్గా ఉండాలని తెలియజేశారు. దీంతో రాష్ట్ర స్థాయిలో శ్రీశైలానికి మూడో స్థానం దక్కింది. మొదటి స్థానంలో శ్రీకాళహస్తి ఉండగా.. రెండో స్థానంలో ద్వారక తిరుమల ఉంది. నిషేదిత గంజాయి, డ్రగ్స్ కట్టడి పరంగా.. 73 శాతం మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. రెవెన్యూ సమస్యల సరంగా ప్రజా అభిప్రాయ సేకరణలో 45.5శాతం సంతృప్తి వ్యక్తం చేయగా.. 54.5 శాతం మంది మరింత మెరుగుపడాలని కోరారు. రవాణాశాఖలోని డ్రైవింగ్ లైసెన్సులు మంజూరులో ఏమైనా అధిక వసూళ్లకు పాల్పడుతున్నారా..? అని ప్రభుత్వం సేకరించిన ప్రజా అభిప్రాయ సేకరణలో 61.8శాతం సేవలు బాగున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. వాహన రిజిసే్ట్రషన పరంగా.. 53.4శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లపై 62.8శాతం సంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా మైనార్టీ వేల్ఫేర్ పరంగా.. 35.1 శాతం మాత్రమే సంతృప్తి వ్యక్తం చేశారు. మున్సిపల్, తదితర పట్టణ ప్రాంతాల్లోని వీధి లైట్ల పనితీరు పరంగా జిల్లాలో 69.0 శాతం సంతృప్తి చెందారు. ఆయితే నంద్యాల జిల్లా మాత్రం చివరి స్థానంలో నిలిచింది. టూరిజం ప్రాంతాల్లో అందించే సేవల పరంగా.. 45.6శాతం సంతృప్తి వ్యక్తం చేశారు. మిగిలిన 54.4శాతం మరింత మెరుగు పడాలని వ్యక్తం చేశారు.