వైఎస్ విగ్రహ ధ్వంసంపై హైడ్రామా!
ABN , Publish Date - Jun 01 , 2026 | 04:23 AM
నంద్యాలలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని పట్టపగలే ధ్వంసం చేసిన ఘటన కలకలం రేపింది. ఆదివారం ఉదయం 6.29 గంటల సమయంలో..
రాయితో పగలగొట్టి తల తీసుకెళ్లిన వైసీపీ కార్యకర్త
నంద్యాలలో ఘటన.. సీసీ ఫుటేజీలో బట్టబయలు
నిందితుడు జంబులయ్య 2018 నుంచి వైసీపీలోనే
నేరం కూటమిపైకి నెట్టేందుకు ఆ పార్టీ నేతల పాట్లు
నంద్యాల, మే 31(ఆంధ్రజ్యోతి): నంద్యాలలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని పట్టపగలే ధ్వంసం చేసిన ఘటన కలకలం రేపింది. ఆదివారం ఉదయం 6.29 గంటల సమయంలో స్థానిక శ్రీనివాసనగర్‌లోని వైఎస్సార్ విగ్రహంపై వైసీపీ కార్యకర్త జంబులయ్య రాయితో దాడి చేశారు. విగ్రహాన్ని పగలకొట్టి, తలను వెంట తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పలు కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేసినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, జంబులయ్య కుటుంబం 2018 నుంచి వైసీపీలోనే ఉంది. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవికిశోర్‌రెడ్డి, వైసీపీ నేత పున్నా శేషయ్యకు జంబులయ్య ప్రధాన అనుచరుడు. సుదీర్ఘకాలంపాటు పార్టీలో క్రియాశీలకంగా పనిచేశాడు. 2022లో వైసీపీ నేతల సిఫారసుతో తన భార్య బాలమ్మకు సీఆర్పీ(కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్)గా ఉద్యోగం ఇప్పించుకున్నారు. 2021లో తన తండ్రి చనిపోవడంతో తనకు ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని గత వైసీపీ ప్రభుత్వంలో నేతల చుట్టూ తిరిగినా ఫలితం దక్కలేదు. కాగా, వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసింది తమ పార్టీ కార్యకర్తేనని తెలిసినా.. రాజకీయంగా లబ్ధి పొందాలన్న ఉద్దేశంతో వైసీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, ఇతర పార్టీ నాయకులు పట్టణంలో నిరసనలకు దిగారు. సీసీ ఫుటేజీలతో వైసీపీ డ్రామా బట్టబయలైనా కూటమిపై బురదజల్లడం విమర్శలకు తావిస్తోంది.
చిల్లర రాజకీయాలు ఆపరా?: లోకేశ్
ఈ ఘటనపై మంత్రి లోకేశ్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. జగన్ ఎన్నిసార్లు దొరికిపోయినా చిల్లర రాజకీయాలు ఆపరా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు వైసీపీ కార్యకర్తలను రంగంలోకి దింపారని మండిపడ్డారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన జంబులయ్య వైసీపీ కార్యకర్తే అని లోకేశ్ పేర్కొన్నారు. విగ్రహాన్ని జంబులయ్య ధ్వంసం చేస్తున్న వీడియోను ట్యాగ్ చేశారు. వైఎస్సార్ విగ్రహం ధ్వంసం ఘటనపై మంత్రులు బీసీ జనార్దన్‌రెడ్డి, ఎన్‌ఎండీ ఫరూక్ స్పందించారు. రానున్న స్థానిక ఎన్నికల్లో లబ్ధి కోసమే వైసీపీ డ్రామాలాడుతోందని విమర్శించారు. నిందితుడు జంబులయ్య ముమ్మాటికీ వైసీపీ అభిమానే అని స్పష్టం చేశారు.