‘నల్లమలసాగర్’తో ఎగువ రాష్ట్రాలకు నష్టమే లేదు
ABN , Publish Date - Apr 14 , 2026 | 04:41 AM
గోదావరి వరద జలాలను సద్వినియోగం చేసుకునేందుకు తాము తలపెట్టిన పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టుతో ఎగువ రాష్ట్రాలకు వచ్చే నష్టమేమీ లేదని సీఎం చంద్రబాబు గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఎంఆర్‌బీ) చైర్మన్ పి.దోర్జే గ్యాంబాకు స్పష్టంచేశారు.
జీఆర్‌ఎంబీ చైర్మన్‌కు స్పష్టంచేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు
గోదావరి ప్రాజెక్టులపై అవగాహన వచ్చాక నిర్ణయం తీసుకుంటాం: గ్యాంబా
వృథాగా కడలిపాలవుతున్న 3200 టీఎంసీల్లో 200 టీఎంసీలను మాత్రమే తీసుకుంటామని వెల్లడి
అమరావతి, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి): గోదావరి వరద జలాలను సద్వినియోగం చేసుకునేందుకు తాము తలపెట్టిన పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టుతో ఎగువ రాష్ట్రాలకు వచ్చే నష్టమేమీ లేదని సీఎం చంద్రబాబు గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఎంఆర్‌బీ) చైర్మన్ పి.దోర్జే గ్యాంబాకు స్పష్టంచేశారు. చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన గ్యాంబా ఆదివారం విజయవాడ వచ్చారు. ఆదివారం రాత్రి ముఖ్యమంత్రిని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా పోలవరం-నల్లమలసాగర్ అనుసంధాన పథకం చర్చకు వచ్చింది. గోదావరి నుంచి ఏటా దాదాపు 3200 టీఎంసీలు సముద్రంలో వృఽథాగా కలుస్తున్నాయని సీఎం గుర్తుచేశారు. ఇందులో 200 టీఎంసీలను.. వరద సమయంలో రోజుకు రెండు టీఎంసీల చొప్పున వంద రోజుల పాటు తీసుకునేందుకు ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశామని తెలిపారు. దీనిని ఆమోదిస్తే గోదావరి జలాలను రాయలసీమ వరకు తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుందన్నారు. ఎగువ రాష్ట్రాలకు ఇబ్బందే లేని ఈ పథకానికి ఆమోదం తెలపాలని కోరారు. గోదావరి ప్రాజెక్టులపై తాను అవగాహన పెంచుకోవలసి ఉందని.. త్వరలోనే నల్లమలసాగర్ ప్రాజెక్టు ప్రతిపాదనలను పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామని గ్యాంబా తెలిపారు. నదీ పరీవాహక ప్రాంతాల్లో ఉన్న నీటినిల్వలు, వాటిని సాగుకు వినియోగించడంపై ప్రపంచబ్యాంకు సహకారంతో ఒక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించామని ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి సాగునీరందున్న ప్రాంతం.. నీరందక ఎండిపోతున్న పొలాలను గుర్తించవచ్చన్నారు.
దీనిని ఆంధ్రప్రదేశ్‌కు అందించేందుకు సంసిద్ధత వ్యక్తంచేశారు. సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ముందుంటుందని.. ఈ సాఫ్ట్‌వేర్‌ను కూడా రాష్ట్రంలో వాడుకుంటామని సీఎం చెప్పారు. దీనిపై జలవనరుల శాఖ బాధ్యతలు కూడా చూస్తున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌తో చర్చించాలని సూచించారు. దరిమిలా గ్యాంబా సోమవారం వెలగపూడి సచివాలయంలో సాయిప్రసాద్‌ను కలిశారు. ప్రతిపాదిత సాఫ్ట్‌వేర్ గురించి చెప్పారు. దీనిని సద్వినియోగం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని సాయిప్రసాద్ అన్నారు. అనంతరం గ్యాంబా సాయంత్రం రాజమహేంద్రవరం చేరుకున్నారు. మంగళవారం పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తారు. తెలంగాణ భూభాగంలో ఉన్న పెద్దవాగును బుధవారం పరిశీలిస్తారు. దీనిని జీఆర్‌ఎంబీ నియంత్రణలోకి తీసుకోనున్నట్లు గ్యాంబా సీఎంకు చెప్పారు.