ఇది టైగర్స్ టైం..!
ABN , Publish Date - Jul 01 , 2026 | 04:12 AM
ప్రపంచవ్యాప్తంగా పెద్దపులులకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. పర్యావరణ సూచికలో అగ్రభాగాన నిలిచే వీటిని సంరక్షించేందుకు అన్ని దేశాలూ కసరత్తు చేస్తున్నాయి.
నేటి నుంచి ఎన్‌ఎ్‌సటీఆర్‌లోకి నోఎంట్రీ
3 నెలల పాటు పర్యాటక కేంద్రాల మూత
నల్లమలలో జంగిల్ సఫారీలకూ బ్రేక్
ఇష్టకామేశ్వరి, రుద్రకోడూరు, గుండ్లబ్రహ్మేశ్వరం క్షేత్రాలకూ రాకపోకలు నిలిపివేత
ఆత్మకూరు, జూన్ 30(ఆంధ్రజ్యోతి): ప్రపంచవ్యాప్తంగా పెద్దపులులకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. పర్యావరణ సూచికలో అగ్రభాగాన నిలిచే వీటిని సంరక్షించేందుకు అన్ని దేశాలూ కసరత్తు చేస్తున్నాయి. ఎక్కడైతే పులుల సంచారం అధికంగా ఉంటుందో ఆ ప్రాంతంలో పర్యావరణం సమతుల్యతతో, సజావుగా ఉంటుంది. అందుకే వీటి సంరక్షణకు సంబంధించిన ప్రతి అంశాన్నీ చాలా సునిశిత దృష్టితో అటవీ అధికారులు పరిశీలిస్తారు. పులుల సంతానోత్పత్తి ప్రక్రియకు వర్షాకాలం అత్యంత అనుకూలం. దీంతో జూలై 1 నుంచి సెప్టెంబరు 30 వరకు... మూడు నెలల పాటు నాగార్జునసాగర్ - శ్రీశైలం పెద్దపులుల అభయారణ్యం(ఎన్‌ఎ్‌సటీఆర్) పరిధిలో జనసంచారాన్ని పూర్తిగా నిషేధించనున్నారు.
సంపర్కం... వైవిధ్యం...
పెద్దపులులు జతకలిసే విధానం వైవిఽధ్యంగా ఉంటుంది. ఆడ, మగ పులుల మూత్రం వాసనలు భిన్నంగా ఉంటాయి. జత కలవాలని కోరుకునే ఆడపులి మూత్ర విసర్జనతో మగ పులికి సంకేతాలు పంపిస్తుంది. అంతే ఆసక్తిని కలిగిన మగ పులి ఆ సంకేతాలను గమనించి దగ్గరకు చేరుతుంది. జత కలసిన ఆ రెండూ, మూడు నుంచి ఐదు రోజలపాటు వేటను మరచి, రాసక్రీడలో మునిగితేలుతాయి. పెద్దపులులు జత కట్టేందుకు వీలైనంత వరకు నీటి వనరులున్న ప్రాంతాలనే ఎంచుకుంటాయి. ఉద్రేకం, ఉద్వేగంతో జత కలసిన మగపులి శరీరం బాగా వేడెక్కుతుంది. సంపర్కానంతరం తన శరీరాన్ని చల్లబరుచుకునేందుకు అవి నీటిలోకి వెళ్లి సేదతీరుతాయి. ఇలా జత కట్టిన ఆడపులి కొన్ని నెలల పాటు ఇతర మగ పులులతో సంపర్కం చెందేందుకు ఇష్టపడదు.
మూడు నెలల పాటు ఎన్‌ఎస్‌టీఆర్‌లోకి నో ఎంట్రీ
పులుల ప్రత్యుత్పత్తిని మెరుగుపర్చేందుకు జూలై 1 నుంచి సెప్టెంబరు 30 వరకు ఎన్‌ఎ్‌సటీఆర్ కోర్ ఏరియాలో ఉన్న ప్రముఖ పుణ్య క్షేత్రాలు, పర్యాటక కేంద్రాలకు ప్రజలను అనుమతించరు. ప్రత్యేకించి మార్కాపురం అటవీ డివిజన్‌లోని నెక్కంటి రేంజ్ పరిధిలోని ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయం, వెలుగోడు రేంజ్‌లోని రుద్రకోడూరు క్షేత్రం, గుండ్లబ్రహ్మేశ్వర్యం అభయారణ్యం పరిధిలోని గుండ్లబ్రహ్మేశ్వరం వంటి క్షేత్రాలకు వెళ్లడాన్ని నిషేధించారు. ఆత్మకూరు డివిజన్‌లోని బైర్లూటి, నంద్యాల డివిజన్‌లోని పచ్చర్ల, మార్కాపురం డివిజన్‌లోని తుమ్మలబయలు ఏకోటూరిజం కేంద్రాలు కొనసాగనున్నప్పటికీ కోర్ ఏరియాలోని జంగిల్ సఫారీలకూ బ్రేక్ వేశారు. శ్రీశైలానికి అటవీమార్గంలో పాదయాత్రగా వెళ్లే కర్ణాటక భక్తులకు సైతం ఈ కాలంలో ప్రవేశం నిషిద్ధం.
3,727.82 చ.కి.మీ. విస్తరించిన ఎన్‌ఎస్‌టీఆర్
నాగార్జునసాగర్ - శ్రీశైలం పెద్దపులుల అభయారణ్యం దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వు ఫారెస్టుగా పేరుగాంచింది. ఇది నంద్యాల, ప్రకాశం, పల్నాడు జిల్లాల పరిధిలో 3,727.82 చ.కి.మీల మేర విస్తరించింది. ఇందులో 2,444 చ.కి.మీలు కోర్ ఏరియా ఉండగా, 1,283.82 కి.మీ.లను బఫర్ ఏరియాగా గుర్తించారు. ఎన్‌ఎ్‌సటీఆర్‌లో 2023లో పెద్దపులుల గణనను నిర్వహించారు. నాటి లెక్కల ప్రకారం 75 ఉండగా... ప్రస్తుతం పులికూనలతో కలిపి ఆ సంఖ్య 87కు చేరినట్లు అటవీ అధికారుల అంచనా వేశారు.
జతకట్టే సమయం ఆసన్నం
పులి మిగిలిన జంతువులకు భిన్నంగా ఓ ప్రత్యేకమైన జీవన విధానాన్ని అలవర్చుకుని సంతాన ప్రక్రియను సాగిస్తుంది. జూన్ నుంచి సెప్టెంబరు వరకు... వర్షాకాలంలో మాత్రమే పెద్దపులులు జత కలిసేందుకు ఇష్టపడతాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని నేషనల్ టైగర్స్ కన్జర్వేషన్ అథారిటీ(ఎన్‌టీసీఏ) సూచన మేరకు ఆ సమయంలో జన సంచారాన్ని పూర్తిగా నిషేధిస్తారు. జతకట్టే వేళ ఉగ్రంగా ఉండే పులులు మనుషులు కనిపిస్తే దాడి చేసే అవకాశాలు చాలా ఎక్కువ.
పులుల ప్రత్యుత్పత్తిలో ఇవే కీలకరోజులు
పర్యావరణ సమతుల్యతకు, జీవ వైవిధ్య రక్షణలో అత్యంత కీలకపాత్ర పోషించే పెద్దపులుల సంఖ్యను ఏటా పెంచడానికి తీవ్ర కసరత్తు జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పులుల సంఖ్యలో 75 శాతం పులులు మనదేశంలోనే ఉన్నాయి. 2023 పులుల లెక్కింపు ప్రకారం భారత్‌లో 3,167 ఉన్నట్లు అంచనా వేశారు. వాస్తవానికి జూలై నుంచి సెప్టెంబరు వరకు ఆడపులులు గర్భం దాల్చేందుకు అనువైన రోజులుగా పరిగణిస్తారు. వీటి గర్భాధారణ సమయం 16 వారాలు. ఒక ఈతలో సుమారు ఒక కిలో బరువుండే 2 నుంచి 4 కూనలకు ఆడపులి జన్మనిస్తుంది. దట్టమైన ప్రాంతాలు, రాతిపగుళ్లలో కూనలను ఉంచి ఆడపులులు ఆహార సేకరణకు వెళ్తాయి. పులికూనల సంరక్షణ బాధ్యత పూర్తిగా వాటిదే. కొన్ని సందర్భాల్లో మగపులులు, ఆడపులులతో జత కలిసేందుకు కూనలను చంపేస్తాయి. కూనలు చనిపోతే.. ఆడపులి 5వ నెలలోపే తరువాతి ఈతకు సిద్ధమవుతుంది. కారణాలేమైనా పులుల్లో మరణాల రేటు చాలా అధికం. సగం కంటే ఎక్కువ పులులు రెండు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం బతకవని అంచనా.
ఎన్‌టీసీఏ ఆదేశాల మేరకే...
‘నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఆదేశాల మేరకు నాగార్జునసాగర్ - శ్రీశైలం పెద్దపులుల అభయారణ్యం పరిధిలో జన సంచారాన్ని పూర్తిగా నిషేధించాం. జూలై 1 నుంచి సెప్టెంబరు 30 వరకు ఎన్‌ఎ్‌సటీఆర్‌లో ఈ నిషేధ ఉత్తర్వులు అమలులో ఉంటాయి. ఆలయాలకు, పర్యాటక ప్రదేశాలకూ అనుమతి లేదు. పులుల సంరక్షణ, వాటి సంఖ్య వృద్ధిలో భాగంగా ప్రతిఏటా దేశవ్యాప్తంగా పెద్దపులులు ఉండే అభయారణ్యాల పరిధిలో ఈ నిబంధనను అమలు చేస్తున్నాం.
- విఘ్నేశ్ అప్పావ్, డిప్యూటీ డైరెక్టర్,
ఆత్మకూరు టైగర్ ప్రాజెక్ట్