‘పరాభవం’లో విజయం!
ABN , Publish Date - Mar 20 , 2026 | 04:32 AM
శ్రీ పరాభవ నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వానికి విజయం సిద్ధిస్తుందని బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణిశర్మ తెలిపారు. ఈ సంవత్సరం శుభాలకే ఎక్కువ అవకాశం ఉందని...
ఈ సంవత్సరం అన్నీ శుభాలే
ప్రభుత్వం తలపెట్టిన ప్రతి కార్యం ఫలిస్తుంది: నాగఫణిశర్మ
అమరావతి, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): శ్రీ పరాభవ నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వానికి విజయం సిద్ధిస్తుందని బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణిశర్మ తెలిపారు. ఈ సంవత్సరం శుభాలకే ఎక్కువ అవకాశం ఉందని, రాష్ట్ర ప్రగతి చాలా విశేషంగా ఉంటుందని చెప్పారు. ప్రభుత్వం సంకల్పించిన ప్రతి కార్యం ఫలిస్తుందన్నారు. అమరావతి విశ్వనగరిగా ఎదుగుతుందని, రాష్ట్రానికి, ప్రభుత్వానికి ఆర్థిక ప్రగతి ఉంటుందని వెల్లడించారు. గురువారం విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రం నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆయన పంచాంగ పఠనం చేశారు. ఉగాది విశిష్టతను, ఉగాది పచ్చడి ప్రసాదం ప్రత్యేకతను వివరించారు. ఈ ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరమ సఖ్యంతో, స్నేహభావంతో ప్రజాహితం దిశగా అడుగులు ముందుకు వేస్తాయని తెలిపారు. వర్షపాతం చాలా విస్తృతంగా ఉంటుంని. పాడిపంటలు సమృద్ధిగా ఉంటాయన్నారు. ‘ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనా సరళిలో దైవభావం సంపూర్ణంగా ఆవిష్కృతమవుతోంది. ప్రస్తుత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు ఆధ్యాత్మిక ఇంటెలిజెన్స్ కూడా చాలా అవసరం. ఏ వృత్తిలో ఉన్నా ఎవరూ మాట తూలకూడదు. శాస్త్రాన్ని తేలిగ్గా మాట్లాడకూడదు. చంద్రబాబు ఎప్పుడూ మాట జారరు. లగ్నాల ప్రకారం ఈ ఏడాది వర్షపాతం బాగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ అధినేతలు, ఈ సంవత్సరంలో చేసే సంకల్పాలు కొన్ని వందల ఏళ్లు, కొన్ని తరాల పాటు నిలిచే యోగం ఉంది. అయితే శ్రమకు తెలివి తోడు కావాలి. ముఖ్యమంత్రి సంకల్పం కూడా అదే. ఇలాంటి నేత దొరకడం ఆంధప్రదేశ్ ప్రజలతోపాటు తెలుగువారందరూ చేసుకున్న అదృష్టం’ అని నాగఫణిశర్మ వివరించారు. ఆ తర్వాత సీఎం ఆయన్ను సత్కరించి నూతన వస్త్రాలు బహూకరించారు. హైదరాబాద్‌లో ఆయన పీఠం స్థాపనకు భూమి ఇచ్చానని సీఎం గుర్త్తుచేశారు.