ఇది జగన్ పాలన కాదు.. తమాషాలా?
ABN , Publish Date - Jun 11 , 2026 | 04:29 AM
ఆయన ఓ మంత్రి. నిప్పులు చెరుగుతున్న ఎండలో రోడ్డుపక్కన ఓ నాపరాయిపై 3 గంటలకుపైగా కూర్చునే ఉన్నారు. ఏసీ హాలులో జరపతలపెట్టిన అధికారుల రివ్యూ మీటింగ్‌ను సైతం రోడ్డుపక్కనున్న బడ్డీకొట్టు ముందు పెట్టారు.
వైసీపీ హయాంలో పట్టిన జాడ్యం పూర్తిగా వదిలిస్తా
చెట్ల కొమ్మలు, చెత్తకుప్పలు ఎత్తేవరకు కదిలేదిలేదు
పని చేయలేమంటే ఇంటికే
అధికారులపై నాదెండ్ల ఫైర్
3 గంటలకుపైగా ఎండలోనే
తెనాలి, జూన్ 10(ఆంధ్రజ్యోతి): ఆయన ఓ మంత్రి. నిప్పులు చెరుగుతున్న ఎండలో రోడ్డుపక్కన ఓ నాపరాయిపై 3 గంటలకుపైగా కూర్చునే ఉన్నారు. ఏసీ హాలులో జరపతలపెట్టిన అధికారుల రివ్యూ మీటింగ్‌ను సైతం రోడ్డుపక్కనున్న బడ్డీకొట్టు ముందు పెట్టారు. ఇంతకీ మంత్రికి అంత కష్టం ఎందుకొచ్చిందంటే... అధికారుల పనితీరే కార ణం. మంత్రి నాదెండ్ల మనోహర్ సొంత నియోజకవర్గం తెనాలిలో ఇటీవల పెనుగాలులకు విరిగిపడిన చెట్ల కొమ్మలు, ఇరిగేషన్ కాల్వలో తీసి ఒడ్డున వేసిన చెత్త కుప్పలను సిబ్బంది తొలగించలేదు. ఈ విషయంలో ఆయన ఆదేశించినా అధికారులు నిర్లక్ష్యంగా వహించారు. ఆదేశాలిచ్చి 48 గంటలైనా ఒక్క చెట్టు కొమ్మకూడా తొలగించకపోవటంతో అఽధికారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘‘గత వైసీపీ ప్రభు త్వ పాలనలో మిమ్మల్ని వారి పనుల కోసమే ఉపయోగించుకున్నారు. ఆ ఐదేళ్లు జనం కోసం పనిచెయ్యాలన్న విషయాన్నే మర్చిపోయారు. కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లయింది. అనేకసార్లు పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించా. అయినా మీలో మా ర్పు లేదు. అప్పుడు పట్టిన జాడ్యాన్ని పూర్తిగా వదిలిస్తా.’’ అని హెచ్చరించారు. ప్రజల కోసం పనిచేయలేకుంటే ఉద్యోగాలు మానేసి ఇంటికి వెళ్లిపోవాలని అన్నారు. బుధవారం ఉదయం 11 గంటల సమయంలో మంత్రి తెనాలికి వచ్చారు. విజయవాడ ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న వీఎ్‌సఆర్ కళాశాల రోడ్డు వెంట ఇటీవల కురిసిన వర్షాల కారణంగా చెట్లు విరిగిపడ్డాయి.
వీటితోపాటు విద్యుత్ లైన్లకు తగులుతున్న కొమ్మలను ఆ శాఖ సిబ్బంది నరికి రోడ్డుపక్కన వేశారు. రెండు రోజుల క్రితం ఆ ప్రాంతంలో మంత్రి పర్యటించినప్పుడు స్థానికులు ఫిర్యాదు చేశారు. అప్పుడే ఆయన మున్సిపల్ అధికారులను పిలిచి వాటిని వెంటనే తొలగించాలని ఆదేశించారు. అయితే.. బుధవారం ఉదయం ఆయన పట్టణంలోకి వస్తున్న సమయంలో రోడ్డుపక్కన చెట్ల కొమ్మలు కనిపించడంతో అక్కడికి వెళ్లారు. వీటిని ఎందుకు తొలగించలేదని మున్సిపల్, ఇరిగేషన్ అధికారులను ప్రశ్నించారు. వారు పొంతనలేకుండా సమాధానం చెప్పటం, రేపటిలోగా తొలగిస్తామని దాటవేయడంతో మంత్రి మనోహర్‌కు ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
ఇప్పుడే తొలగించాలి!
మంత్రి చెప్పినా మీలో చలనంలేదంటే మీకు పట్టిన జాడ్యం మాములుగా లేదని, దానిని తొలగించే వరకు ఇక్కడే కూర్చుంటానని, ఇప్పుడే ఎక్సకవేటర్లు, ట్రాక్టర్‌లు, సిబ్బంది మొత్తం రావాలని ఆదేశించారు. రోడ్డుపక్కనే ఉన్న ఓ నాపరాయిపై కూర్చున్నారు. దీంతో సిబ్బంది యుద్ధప్రాతిపదికన యంత్రాలను తీసుకొచ్చి చెత్త, కొమ్మలను తొలగించే పని చేపట్టారు. పనులు మొదలుపెట్టారు కనుక ఎండలో ఎందుకు.. కార్యాలయానికి వెళ్లాలని అధికారులు కోరినా మంత్రి వినలేదు. వాటి తొలగింపు పూర్తయ్యే వరకు రోడ్డుపక్కనే కూర్చున్నారు.
బడ్డీ కొట్టే కార్యాలయం
చెట్ల కొమ్మలు, చెత్త కుప్పలు తొలగించే వరకు ఇక్కడి నుంచి కదలనని రోడ్డు పక్కనే భీష్మించిన మంత్రి మనోహర్ బుధవారం షెడ్యూల్ ప్రకారం అన్ని శాఖల అధికారులతో స్థానిక కళాక్షేత్రంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించాల్సి ఉంది. కానీ, మంత్రి రోడ్డు పక్కనే ఉండిపోయారు. ఆయన సి బ్బంది సమీక్షా సమావేశం విషయం ఆయన చెవిన వేశారు. దీంతో వారిని కూడా ఇక్కడికే రావాలని కో రారు. అదే రోడ్డు పక్కనున్న ఓ బడ్డీ కొట్టు ముందు న్న చిన్నపాటి స్థలంలో కుర్చీలు వేయించి సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడు తూ.. ఒక్క తెనాలిలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని శాఖల అధికారుల్లో వైసీపీ పాలనాకాలం నాటి నిర్లిప్తత, నిర్లక్ష్యం పోలేదని తెలిపారు.
