ఒక్క విద్యార్థి.. నలుగురు లెక్చరర్లు..!
ABN , Publish Date - Feb 09 , 2026 | 05:03 AM
గత వైసీపీ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయంతో ఏర్పాటు చేసిన జూనియర్ కళాశాల(హైస్కూల్ ప్లస్) మౌలిక వసతులకు...
ముసునూరు జూనియర్ కళాశాల దుస్థితి
వసతుల్లేక ముందుకు రాని విద్యార్థులు
ముసునూరు, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయంతో ఏర్పాటు చేసిన జూనియర్ కళాశాల(హైస్కూల్ ప్లస్) మౌలిక వసతులకు దూరంగా... సమస్యల సుడిగుండానికి దగ్గరగా కునారిల్లుతోంది..! ముందు హడావుడిగా మంజూరు చేసి, అరకొర భవనాల్లో ఏర్పాటు చేసిన ఈ కళాశాల వసతుల లేమితో కొట్టుమిట్టాడుతోంది. 2023-24 విద్యా సంవత్సరంలో తొలి బ్యాచ్ అంటూ ఆర్భాటంగా ఏర్పాటు చేసిన ఈ కాలేజీలో చేరేందుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదు. ప్రస్తుతానికి ఒకే ఒక్క విద్యార్థి.. నలుగురు లెక్చరర్లతో నడుస్తోంది.
ప్రారంభం నుంచి ఇదే పరిస్థితి
ఏలూరు జిల్లా ముసునూరు జడ్పీ పాఠశాలలో గత వైసీపీ ప్రభుత్వం బైపీసీ గ్రూప్‌తో జూనియర్ కళాశాలను ఏర్పాటు చేసింది. ఇక్కడ నాలుగు సజ్జెక్టులకు నలుగురు లెక్చరర్లును నియమించారు. ప్రారంభంలో ఎనిమిది మంది విద్యార్థులు ఉండగా, ప్రస్తుతం ఒక్క విద్యార్థిని (మొదటి సంవత్సరం) మాత్రమే ఉన్నారు. నలుగురు లెక్చరర్లు ఉన్నారు. ప్రతినెలా నలుగురు లెక్చరర్లకు వేతనాల రూపంలో రూ.4లక్షల ప్రజాధనం దుర్వినియోగం అవుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, ముసునూరు జూనియర్ కళాశాలలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ దృష్టి సారించారు. నివేదికలు అందజేయాలని విద్యాశాఖ అధికారులకు ఉత్తర్వులు ఇచ్చినట్లు సమాచారం.