పెళ్లయిన దగ్గర నుంచీ అనుమానమే..
ABN , Publish Date - Jun 18 , 2026 | 03:19 AM
‘అమ్మా... నేను ఇక ఆయనతో కాపురం చేయలేను. అన్నింటికీ అనుమానిస్తున్నారు. వేధిస్తున్నారు. నాన్న పుట్టినరోజుకు విశాఖ వస్తే మరింక ఢిల్లీ వెళ్లను’ అని చెప్పిన ఆ అమ్మాయి ఇక్కడికి రాకుండానే ప్రాణాలు కోల్పోయింది.
ఇంట్లో సీక్రెట్‌గా సీసీ కెమెరా.. బ్యాగులో ట్రాకర్
ఆయనతో కాపురం చేయలేను..
భర్త వేధింపుల గురించి తల్లికి చెప్పిన టెకీ
విశాఖకు రాకముందే ముస్సోరిలో మృతి
గాయత్రిని భర్తే చంపాడని ఆరోపణలు
విశాఖపట్నం, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): ‘అమ్మా... నేను ఇక ఆయనతో కాపురం చేయలేను. అన్నింటికీ అనుమానిస్తున్నారు. వేధిస్తున్నారు. నాన్న పుట్టినరోజుకు విశాఖ వస్తే మరింక ఢిల్లీ వెళ్లను’ అని చెప్పిన ఆ అమ్మాయి ఇక్కడికి రాకుండానే ప్రాణాలు కోల్పోయింది. ఉత్తరాఖండ్‌లో ముస్సోరీలోని హోమ్‌స్టేలో అనుమానాస్పదంగా మృతిచెందిన టెకీ రాధాగాయత్రిని ఆమె భర్త శ్రీచరణే చంపేశాడని బంధువులు ఆరోపిస్తున్నారు. రాధాగాయత్రి తండ్రి పేరు సుధాకర్. ఆర్మీలో పనిచేసి రిటైరయ్యారు. సుధాకర్ దంపతులకు రాధా గాయత్రి (27) ఒక్కరే సంతానం. గత నవంబరులో ఆమెకు విశాఖపట్నానికి చెందిన శ్రీచరణ్‌తో వివాహమైంది. శ్రీచరణ్‌కు పుణెలో ఉద్యోగం. భర్త సూచనతో రాధాగాయత్రి గుర్గావ్‌లో ఉద్యోగం చూసుకుని ఫిబ్రవరిలో ఢిల్లీకి పయనమైంది. అక్కడ భర్త, అత్తమామలు, మరదలుతో కలిసి ఉంటోంది.
అనుమానాలు అనేకం
శ్రీచరణ్ పెళ్లయిన నాటి నుంచి తనను అనుమానిస్తున్నాడని పలు సందర్భాల్లో గాయత్రి తల్లికి చెప్పుకొని బాధపడింది. హైదరాబాద్ వచ్చినప్పుడు తనకు తెలియకుండా ఇంట్లో సీసీ కెమెరా పెట్టాడని, విశాఖ నుంచి బాబాయ్ వస్తే... ఆయన ఫొటో మొబైల్‌లో పంపించి.. ‘వీడు ఎవడు..? ఎందుకు వచ్చాడు..?’ అంటూ నిలదీశాడని వాపోయింది. తన బ్యాగులో ట్రాకర్ పెట్టి తన కదలికలు తెలుసుకునే వాడని బాబాయి కుమార్తెకు చెప్పి బాధపడింది. ఈ నెల 19న రాధాగాయత్రి తండ్రి సుధాకర్ పుట్టినరోజు. కొత్త ఇంట్లో దిగిన తర్వాత సత్యనారాయణస్వామి వ్రతం చేయలేదని, ఈ నెల 21న వ్రతం చేస్తున్నామని, పుట్టినరోజుకు పాపని, అల్లుడిని పంపాలని ఆయన ఢిల్లీలోని వియ్యకుండిని కోరారు. అలాగే విశాఖలో బంధుమిత్రులను కూడా ఆహ్వానించారు. ఈ క్రమంలో రాధాగాయత్రి తల్లికి ఫోన్ చేసి.. నాన్న పుట్టినరోజుకు వచ్చి, విశాఖపట్నంలోనే ఉండిపోతానని, ఢిల్లీ వెళ్లనని చెప్పింది. అయితే శ్రీచరణ్ ఆమెకు ఏం చెప్పి ముస్సోరి తీసుకెళ్లాడో అర్థం కావడం లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. మృతదేహాన్ని బుధవారం విశాఖకు రప్పించారు. అనంతరం మామిడిపల్లికి తరలించి దహన సంస్కారాలు పూర్తి చేశారు. ఆ కార్యక్రమానికి బంధువులతో సహా వచ్చిన శ్రీచరణ్‌ను చూసిన రాధాగాయత్రి సోదరి చొక్కా పట్టుకొని, ‘నువ్వే మా అక్కని చంపేశావు’ అంటూ ఏడ్చేసింది. ఆమె తల్లిదండ్రులు గురువారం విశాఖపట్నం పోలీసులకు ఫిర్యాదు చేయాలని భావిస్తున్నారు.