నేను టూల్ మాత్రమే.. రాజ్ ఆపరేటర్
ABN , Publish Date - Mar 19 , 2026 | 05:09 AM
‘నేను టూల్‌ను మాత్రమే.. ఆపరేటర్ రాజ్ కసిరెడ్డే. ఆయన చెప్పిందే చేశా. సొంతంగా నేను చేసిందేమీ లేదు’ అని లిక్కర్ స్కామ్ నిందితుడు ముప్పిడి అవినాశ్ రెడ్డి.....
లిక్కర్ స్కామ్‌లో అంతా కసిరెడ్డికే తెలుసు
సిట్ విచారణలో ముప్పిడి అవినాశ్
అమరావతి/విజయవాడ, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): ‘నేను టూల్‌ను మాత్రమే.. ఆపరేటర్ రాజ్ కసిరెడ్డే. ఆయన చెప్పిందే చేశా. సొంతంగా నేను చేసిందేమీ లేదు’ అని లిక్కర్ స్కామ్ నిందితుడు ముప్పిడి అవినాశ్ రెడ్డి(ఏ-7) సిట్ అధికారుల విచారణలో వెల్లడించినట్టు తెలిసింది. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంలో కీలకంగా వ్యవహరించిన అవినాశ్ రెడ్డిని సిట్ అధికారులు మూడు రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించారు. ఏపీఎస్బీసీఎల్‌కు మద్యం ఆర్డర్లు నిర్దేశించడం నుంచి ముడుపుల వసూళ్ల వరకూ పలు ప్రశ్నలు వేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు మూడో రోజు బుధవారం విచారణలో అవినాశ్ రెడ్డి ఏమి చెప్పారంటే.. ‘తెలంగాణలో మద్యం షాపులు మాత్రమే నా సొంతం. ఏపీలో మద్యం కుంభకోణంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆర్డర్లు ఎవరికి ఇవ్వాలి? ఏ బ్రాండ్లు తగ్గించి ఏవి పెంచాలి? అనేది నా నిర్ణయం కాదు. అంతా రాజ్ కసిరెడ్డి చెప్పినట్లే జరిగింది. రాజ్ నాకు బంధువు కావడం, ఆదాన్‌లో నేను భాగస్వామిగా ఉండటంతో ఆయన చెప్పిన పనులు కొన్ని చేశా. రాజ్ కసిరెడ్డి సూచన మేరకు ఎవరైనా డబ్బులిస్తే తీసుకుని మళ్లీ ఆయన చెప్పిన వారికి ఇచ్చేశా. ఏపీలో మద్యం వ్యవహారంలో ఏదో తేడా ఉందని తెలియగానే స్వచ్ఛందంగా తప్పుకొన్నా.’ అని చెప్పినట్లు తెలిసింది. నకిలీ ఇన్వాయి్‌సల గురించి సిట్ అధికారులు ప్రశ్నించగా.. అదంతా ఈశ్వర్ కిరణ్‌కుమార్ రెడ్డికి తెలుసని చెప్పినట్టు తెలిసింది. కాగా, ముప్పిడి అవినాశ్‌రెడ్డి సిట్‌కస్టడీ బుధవారంతో ముగిసింది. గుంటూరుజైలుకు ఆయనను తరలించారు.