బీసీల రిజర్వేషన్ల తర్వాతే పుర ఎన్నికలు
ABN , Publish Date - Jul 05 , 2026 | 05:01 AM
రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాతే మున్సిపాల్టీ, కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహణ ఉంటుందని పురపాలకశాఖ మంత్రి నారాయణ వెల్లడించారు.
ఏలూరు, జూలై 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాతే మున్సిపాల్టీ, కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహణ ఉంటుందని పురపాలకశాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. ఏలూరు జిల్లా కేంద్రమైన ఏలూరులో ఆయన శనివారం పర్యటించారు. తృప్తి క్యాంటీన్ పనితీరును పరిశీలించారు. ఇడా నిధుల వినియోగంపై కమిషనర్లతో సమీక్షించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నో ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ మున్సిపాల్టీల్లో మౌలిక వసతులకు ప్రభుత్వం పెద్దపీట వేసిందని, 123 పురపాలక సంఘాల్లో రూ.18 వేల కోట్లతో అర్బన్ ఛాలెంజింగ్ ఫండ్, అమృత్ కింద వివిధ పనులు మంజూరు చేశామని తెలిపారు. రాబోయే రెండేళ్ల కాలంలో 123 మున్సిపాల్టీల్లో ప్రతి ఇంటికీ మంచినీటి కొళాయి కనెక్షన్లు అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. లెగసీ వ్యర్థాలను అన్ని మున్సిపాల్టీల్లో రాబోయే అక్టోబరు నాటికి పూర్తిగా క్లియర్ చేయాలని ఆదేశాలిచ్చామని ‘ఆంధ్రజ్యోతి’ అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పురపాలక ఆస్తులకు జియో ట్యాగింగ్ కూడా సర్ కార్యక్రమం ముగిశాక పారదర్శకంగా చేయాలని ఆదేశించినట్లు తెలిపారు.