Share News

కేసు గెలిచినా... పీఠం దక్కలేదు

ABN , Publish Date - Apr 14 , 2026 | 06:49 AM

అధికారుల నిర్లక్ష్యం కారణంగా పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయిన ఆ అభ్యర్థి, న్యాయపోరాటం చేసి విజయం సాధించాడు. అయితే సర్పంచ్‌ల పదవీకాలం ఈ నెల రెండో తేదీతో ముగియడంతో..

కేసు గెలిచినా... పీఠం దక్కలేదు

  • సర్పంచ్‌ పదవీకాలం ముగియడమే కారణం

ముమ్మిడివరం, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): అధికారుల నిర్లక్ష్యం కారణంగా పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయిన ఆ అభ్యర్థి, న్యాయపోరాటం చేసి విజయం సాధించాడు. అయితే సర్పంచ్‌ల పదవీకాలం ఈ నెల రెండో తేదీతో ముగియడంతో.. ఆయన విజయం కాగితాలకే పరిమితం అయింది. గత వైసీపీ ప్రభుత్వం ఎలా ఎన్నికల ప్రక్రియను అపహాస్యంగా మార్చివేసిందనేందుకు ఈ ఉదంతమే నిదర్శనం. ఆ వివరాల్లోకి వెళితే.. 2001 పంచాయతీ ఎన్నికల్లో అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం గాడిలంకలో సర్పంచ్‌ పదవికి టీడీపీ నుంచి పెద్దిరెడ్డి వెంకట కృష్ణారావు, వైసీపీ నుంచి పెద్దిరెడ్డి నాగమునీంద్రరావు పోటీపడ్డారు. ఓట్ల లెక్కింపులో పెద్దిరెడ్డి నాగమునీంద్రరావు 10 ఓట్ల మెజార్టీతో విజయం సాధించినట్టు అధికారులు ప్రకటించారు. నాగ మునీంద్రరావుకు 472ఓట్లు, పెద్దిరెడ్డి వెంకట కృష్ణారావుకు 462 ఓట్లు వచ్చాయని, చెల్లనవి 19, నోటాకు 29 ఓట్లు పడ్డాయని వెల్లడించారు. దీనిపై వెంకటకృష్ణారావు ముమ్మిడివరం కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన కోర్టు.. ఓట్ల లెక్కింపునకు ఎంపీడీవో కార్యాలయంలో భద్రపరిచిన బ్యాలెట్‌ బాక్స్‌లను కోర్టు కమిషన్‌కు అప్పగించాలని ఆదేశించింది. జూనియర్‌ సివిల్‌ జడ్జి మహమ్మద్‌ రహమతుల్లా సమక్షంలో శుక్రవారం ఓట్లు లెక్కింపు జరపగా, వెంకట కృష్ణారావుకు 462 ఓట్లు పడినట్టు తేలింది. నాగ మునీంద్రరావుకు గతంలో లభించిన 472 ఓట్లలో 24 ఓట్లు చెల్లనివిగా గుర్తించడంతో 448 ఓట్లు మిగిలాయి. దీంతో 14 ఓట్ల మెజార్టీతో వెంకటకృష్ణారావు విజయం సాధించినట్లు జూనియర్‌ సివిల్‌ జడ్జి మహామ్మద్‌ రహమతుల్లా సోమవారం తీర్పు ఇచ్చారు.


చర్య తీసుకోవాలి

‘‘ఓట్ల లెక్కింపులో ఆనాడు అక్రమాలు జరిగాయి. నేను రీకౌంటింగ్‌ కోరినా అంగీకరించలేదు. వైసీపీ హయాం అక్రమాలు నేడు వెలుగులోకి వచ్చాయి. నాటి అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి.’’

- పెద్దిరెడ్డి వెంకటకృష్ణారావు

Updated Date - Apr 14 , 2026 | 06:50 AM