రక్తమోడిన రహదారులు
ABN , Publish Date - Jun 23 , 2026 | 05:04 AM
రాష్ట్రంలో రహదారులు రక్తమోడాయి. ప్రకాశం, తిరుప తి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 9 మంది మృతి చెందగా, 27 మంది తీవ్రంగా గాయపడ్డారు.
9 మంది మృతి...27 మందికి గాయాలు
ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం, తిరుపతి జిల్లాల్లో ప్రమాదాలు
సంతమాగులూరు(అద్దంకి)/శావల్యాపురం, పుల్లంపేట/వజ్రపుకొత్తూరు/విజయనగరం, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రహదారులు రక్తమోడాయి. ప్రకాశం, తిరుప తి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 9 మంది మృతి చెందగా, 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామానికి చెందిన 10 మంది ఆటోలో సోమవారం నాదెండ్ల మండలంలో ఓ కార్యక్రమానికి బయలుదేరారు. ఆటో కర్నూలు-గుంటూరు రహదారిపై కామేపల్లి సమీపంలో లారీని వేగంగా ఢీకొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు మర ణించగా, గాయపడిన ఏడుగురిని ఆస్పత్రికి తరలించారు. ఆదివారం అర్ధరాత్రి తిరుపతి నుంచి కడప వెళ్తున్న నాన్‌స్టాప్ బస్సును పుల్లంపేట వద్ద రాంగ్ రూట్‌లో వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. నెల్లూరుకు చెందిన 10 నెలల బాలుడు అక్కడికక్కడే మృతిచెందగా, గాయపడ్డ శ్రీకాళహస్తికి చెందిన యశ్వితశ్రీ(16)ను కడపకు తరలిస్తుండగా మృతి చెందింది. మరో 16 మంది గాయపడ్డారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం చినతామాడవానిపేట వద్ద ఆదివారం అర్ధరాత్రి స్కూటీ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో కోదండరావు(28), మణికంఠ(23) మృతిచెందారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద హైవేపై సోమవారం కారు అదుపు తప్పి లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో సూరిబాబు (60), ఏడాదిన్నర వయస్సు ఉన్న మనవడు సాత్విక్ అక్కడికక్కడే మృతి చెందారు.