పారిపోతున్నారు!
ABN , Publish Date - Apr 29 , 2026 | 05:30 AM
జైలు సిబ్బంది డేగ కళ్లు.. సీసీ కెమెరాల నీడ.. చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడ.. పైన ఇనుప తీగలు, వాటికి విద్యుత్ సరఫరా.. ఇలాంటి ప్రదేశం నుంచి ఖైదీలు పారిపోవడం సాధ్యమా.?
జైళ్ల నుంచి వరుసగా ఖైదీలు మాయం.. ఆరు నెలలైనా లభించని బత్తుల ప్రభాకర్ ఆచూకీ
ప్రొద్దుటూరులో గోడదూకి గజదొంగ రఫీ ఎస్కేప్
సత్యవేడు జైలులో అంతర్రాష్ట్ర దొంగ పరార్
రేపల్లె జైలు ఖైదీ భీముడు ఆస్పత్రి నుంచి జంప్
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
జైలు సిబ్బంది డేగ కళ్లు.. సీసీ కెమెరాల నీడ.. చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడ.. పైన ఇనుప తీగలు, వాటికి విద్యుత్ సరఫరా.. ఇలాంటి ప్రదేశం నుంచి ఖైదీలు పారిపోవడం సాధ్యమా.? ఎట్టిపరిస్థితుల్లోనూ వీలు కాదు. కానీ మన రాష్ట్రంలో ఇప్పుడిది మామూలు వ్యవహారంలా మారిపోయింది. రాష్ట్రంలోని జైళ్ల నుంచి ఖైదీలు పరారవుతున్న వరుస ఘటనలు జైలు శాఖలోని లోటుపాట్లను ఎత్తి చూపుతున్నాయి. రేపల్లె జైలు ఖైదీ భీముడు అజిత్‌కుమార్ ఆస్పత్రి నుంచి పరార్ కావడం మొత్తంగా జైళ్ల పరిస్థితినే ప్రశ్నార్థకంగా మార్చింది. జైలు అధికారి నుంచి.. సిబ్బంది వరకు అతని పరారీకి సహకరించడం చూస్తే.. మూలాల నుంచే జైళ్ల ప్రక్షాళన ప్రారంభించాల్సిన అవసరం ఉన్నదనిపిస్తోందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జైళ్ల సిబ్బంది పనితీరుతోపాటు అధికారుల పర్యవేక్షణ లోపాన్ని, ఉన్నతాధికారుల స్వార్థపూరిత నిర్ణయాల్లోని లోటుపాట్లకు వరుస ఘటనలు వెల్లడిస్తున్నాయని అంటున్నారు.
జైళ్లంటే అంత అలుసా?!
గత ఆరు నెలల కాలంలో ఏడుగురు ఖైదీలు రాష్ట్రంలోని వివిధ జైళ్ల నుంచి తప్పించుకున్నారు. వీరిలో ముగ్గురి ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. వారిలో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలు. మన రాష్ట్రంలో కడప, నెల్లూరు, రాజమహేంద్రవరం, విశాఖపట్నంలో సెంట్రల్ జైళ్లు ఉండగా, ప్రతి జిల్లా కేంద్రంలో ఒక జిల్లా జైలు, సుమారు 90వరకూ ఇతర జైళ్లు ఉన్నాయి. సుమారు ఎనిమిది వేల మంది వరకూ శిక్షపడ్డ ఖైదీలు, రిమాండ్ ఖైదీలు ఉంటారు. ఖైదీలను జైళ్లలో సంస్కరించి బయటికి వెళ్లాక సక్రమ మార్గంలో జీవించేలా చేయడం అధికారుల విధి. అయితే, అధికారుల మధ్య గ్రూపు తగాదాలు, సిబ్బంది కొరత, ఉన్న సిబ్బందిలో నైరాశ్యం తదితర కారణాలతో సంస్కరణలకు జైళ్లు పూర్తిగా దూరమయ్యాయి. కనీసం ఖైదీలు పారిపోకుండా చూస్తున్నారా.? అంటే అదీ లేదు. చిత్తూరు జిల్లా సత్యవేడులో గది శుభ్రం చేసేందుకని తలుపు తీయగానే శ్రీనివాసన్ అనే దొంగ టక్కున బయటికి వచ్చి కనీస ఎత్తులేని గోడదూకి పారిపోయాడు. పోలీసులు వెంటనే అప్రమత్తమై గాలించి ఆ దొంగను పట్టుకోగలిగారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడే అంతర్రాష్ట్ర దొంగ మహమ్మద్ రఫీ ఎత్తయిన గోడ దూకి పారిపోయాడు. చిన్న వయసు నుంచి దొంగతనాలు చేస్తూ బాలనేరస్థుల స్కూల్ జీవితాన్ని అనుభవించిన రఫీపై పలు రాష్ట్రాల్లోని కేసులన్నీ కలిపితే సుమారు 135వరకూ ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు. పారిపోయిన రఫీ కోసం ఓ వైపు జైలు సిబ్బంది మరో వైపు పోలీసులు వెతుకుతున్నా ఆచూకీ చిక్కలేదు. పెన్షన్ నిధుల దుర్వినియోగం కేసులో పంచాయతీ సెక్రటరీ నక్కా రవి కుమార్, గజ దొంగ బెజవాడ రాము విశాఖపట్నం జిల్లా చోడవరం జైలుకు వచ్చారు. వీరిద్దరు గత ఏడాది సెప్టెంబరు మొదటి వారంలో కాపలా గార్డుపై సుత్తితో దాడి చేసి అక్కడున్న తాళం చెవి లాక్కుని చాకచక్యంగా పారిపోయారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడంతో ఆ ఇద్దరూ దొరికారు.,
పోలీసులకు ప్రభాకర్ చాలెంజ్..
చిత్తూరు జిల్లాకు చెందిన బత్తుల ప్రభాకర్ నాలుగైదు రాష్ట్రాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్ దొంగ. యాభైకి పైగా దొంగతనం కేసుల్లో నిందితుడు. కొన్ని దొంగతనాల కేసుల్లో అరెస్టు చేసి రాజమండ్రి జైలులో ఉంచారు. గత అక్టోబరులో విజయవాడ కోర్టుకు తీసుకొచ్చి వాయిదా అయిపోయాక తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తుండగా దేవరాపల్లి దగ్గర సెక్యూరిటీ సిబ్బంది కళ్లు గప్పి పరారయ్యాడు. వేషాలు మార్చి ఒంటరిగా నేరాలు చేసే ప్రభాకర్ అంత సులభంగా, తొందరగా దొరకడం కష్టమని పోలీసులే చెబుతున్నారు. విద్యా సంస్థలే లక్ష్యంగా దొంగతనాలు చేస్తూ అమ్మాయిలతో జల్సాలు చేస్తూ విలాసవంతమైన జీవితాన్ని ప్రభాకర్ గడుపుతుంటాడు. 100 మంది యువతులు, రూ.300 కోట్ల సంపాదన తన లక్ష్యంగా ఇతడు బహిరంగంగా ప్రకటించడం విశేషం.
వర్చువల్‌గా ఎందుకు ప్రవేశపెట్టరు?
ఖైదీలను వాయిదాకు తీసుకు వచ్చే సమయంలో సెక్యూరిటీ ఇవ్వడం కష్టంగా మారడం, తప్పి పోతున్న ఘటనలతో దేశంలోని అన్ని హైకోర్టులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రిమాండ్ ఖైదీలను ప్రవేశ పెట్టేందుకు ఆదేశాలిచ్చాయి. అందుకు అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐసీజేఎస్ పథకం కింద కోర్టులతో జైళ్లను అనుసంధానిస్తూ వీడియో కాన్ఫరెన్స్‌కు ఏర్పాట్లు చేశాయి. దీంతో వర్చువల్‌గా ఖైదీలను వాయిదా రోజు కోర్టులో న్యాయాధికారి ముందు చూపించొచ్చు. ఎందుకో గానీ ఆ విషయాన్నే పూర్తిగా పోలీసులు, జైలు అధికారులు మర్చిపోయారు. విజయవాడ జైలులో ఐఏఎస్, ఐపీఎస్, రాజకీయ ఖైదీలు మద్యం స్కామ్‌లో అరెస్టయిన బిగ్ షాట్లు కూడా ఇటీవలి వరకూ ఉన్నారు. వారిని జైలుకు రెండు కిలో మీటర్ల దూరంలో ఉండే కోర్టుకు తీసుకొచ్చినప్పుడు అక్కడ గందరగోళం ఏర్పడేది. విజయవాడ జైలులో వీడియో కాన్ఫరెన్స్‌కు అవకాశం ఉన్నా బయటికి ఎందుకు తెస్తున్నారనే ప్రశ్నకు ‘బయటికి చెప్పలేనివి చాలా ఉంటాయి’ అని ఖాకీలు సమాధానం ఇస్తున్నారు.
మా గోడు వినరు.. పైగా వేధిస్తారు
వాపోతున్న వార్డర్లు
‘పోలీసు శాఖలో కానిస్టేబుల్‌ను జిల్లా పరిధి దాటి బయటికి పంపరు. శ్రీకాకుళం జిల్లా గార్డును హిందూపురం బదిలీ చేస్తే మా జీతాలెంత? మేం బతికేది ఎలా? కనీసం సెలవులు ఇవ్వమన్నా ఇవ్వరు. మా సంక్షేమం కోసమని పెట్రోలు బంకులు పెట్టారు. నెలకు 90లక్షల నుంచి కోటి రూపాయల వరకూ ఆదాయం వస్తోంది. ఆ సొమ్ముతో ఉన్నతాధికారులు విచ్చలవిడిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఒక్కొక్కరు నాలుగైదు ఐ ఫోన్లు లక్షలు పెట్టి కొంటున్నారు. కానీ, మాకు మాత్రం ప్రతి చిన్న విషయానికీ వేధింపులే. డ్యూటీలో లేని వార్డర్‌కు అర్ధరాత్రి రెండు గంటలకు మెసేజ్ పంపుతారు. వెంటనే బదులివ్వనందుకు మెమోలు ఇస్తున్నారు. బదిలీల్లో నిబంధనలు పాటించరు. సిబ్బంది 40శాతం కొరత ఉంది. ఇంకెలా ఉద్యోగం చేయగలం? డ్యూటీ అంటేనే వైరాగ్యం వచ్చేసింది. భార్య పిల్లల్ని పోషించుకోవాలి గనుక, ఈ వృత్తిలో ఉన్నాం.’ అంటూ పలువురు వార్డర్లు వాపోతున్నారు.