Share News

సాయం చేస్తూ. . అనంతలోకాలకు

ABN , Publish Date - Mar 26 , 2026 | 03:44 AM

కర్నూలు నగరంలో హైదరాబాద్‌- బెంగళూరు జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి లారీ ఢీకొని ఓ వ్యక్తి మరణించగా, సహాయక చర్యల్లో పాల్గొన్న వారిపైకి మరో లారీ దూసుకు రావడంతో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు.

సాయం చేస్తూ. . అనంతలోకాలకు

  • గుర్తు తెలియని లారీ ఢీకొని మోటార్‌సైక్లిస్ట్‌ మృతి

  • సహాయక చర్యలో పాల్గొన్న వారిపైకి దూసుకొచ్చిన మరో లారీ

  • ఈ ఘటనలో మరో ఇద్దరు దుర్మరణం.. ఐదుగురికి గాయాలు

  • కర్నూలు జిల్లాలో విషాదం

కర్నూలు క్రైం, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): కర్నూలు నగరంలో హైదరాబాద్‌- బెంగళూరు జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి లారీ ఢీకొని ఓ వ్యక్తి మరణించగా, సహాయక చర్యల్లో పాల్గొన్న వారిపైకి మరో లారీ దూసుకు రావడంతో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. పోలీసుల కథనం మేరకు.. కర్నూలు జిల్లా సి.బెళగల్‌ మండలం బ్రాహ్మణదొడ్డి గ్రామానికి చెందిన కుమ్మరి శేఖర్‌ (28) కర్నూలు నగరంలోని శివప్పనగర్‌లో నివాసం ఉంటున్నాడు. మంగళవారం అర్ధరాత్రి తలనొప్పిగా ఉందని ట్యాబ్లెట్ల కోసం మోటారు సైకిల్‌పై కృష్ణానగర్‌ వైపు బయలుదేరాడు. కృష్ణానగర్‌ సమీపంలో హంద్రీ ఫ్లైఓవర్‌పై గుర్తు తెలియని లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సహాయక చర్యల్లో ట్రాఫిక్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ రఫీక్‌ అహ్మద్‌, కానిస్టేబుల్‌ సందీప్‌కు చాకలి అజిత్‌ కుమార్‌, బండారి కన్నాతో పాటు మరికొందరు యువకులు సహకరిస్తున్నారు. రోడ్డుపై ఉన్న శేఖర్‌ మృతదేహాన్ని, బైక్‌ను తొలగిస్తుండగా హైదరాబాదు వైపు నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న ఓ గ్రానైట్‌ లారీ అతివేగంగా వచ్చి అజిత్‌ కుమార్‌, కన్నా, రఫీక్‌ అహ్మద్‌, ఇంతియాజ్‌, చంద్రశేఖర్‌ను ఢీకొట్టింది. ఆసుపత్రికి తరలించేసరికి చెరుకులపాడుకు చెందిన చాకలి అజిత్‌ కుమార్‌ (26), కర్నూలు నగరంలోని శరీన్‌నగర్‌కు చెందిన బండారి కన్నా (23) మృతి చెందారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. నాలుగో పట్టణ పోలీసులు, ట్రాఫిక్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. ఏడు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి.

Updated Date - Mar 26 , 2026 | 03:44 AM