ఎక్సైజ్ కస్టడీకి రాజేశ్, అన్బురసు
ABN , Publish Date - Jan 29 , 2026 | 03:55 AM
అన్న మయ్య జిల్లా ములకలచెరువులోని నకిలీ మద్యం కేసులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న రాజేశ్(ఏ5), అన్బురసు అలియాస్ బాబు(ఏ19)ను ఎక్సైజ్ కస్టడీకి అప్పగిస్తూ తంబళ్లపల్లె జూనియర్ సివిల్ కోర్టు.....
ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కోర్టు ఉత్తర్వులు
‘ఇబ్రహీంపట్నం’ కేసులో ఐదుగురికి బెయిల్
ములకలచెరువు/విజయవాడ, జనవరి 28(ఆంధ్రజ్యోతి): అన్న మయ్య జిల్లా ములకలచెరువులోని నకిలీ మద్యం కేసులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న రాజేశ్(ఏ5), అన్బురసు అలియాస్ బాబు(ఏ19)ను ఎక్సైజ్ కస్టడీకి అప్పగిస్తూ తంబళ్లపల్లె జూనియర్ సివిల్ కోర్టు బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. మదనపల్లె సబ్‌జైలులో ఉన్న ఆ ఇద్దరినీ ఎక్సైజ్ పోలీసులు గురువారం ఉదయం కస్టడీలోకి తీసుకోనున్నారు. గురు, శుక్రవారాలు వీరిని మదనపల్లె ఎక్సైజ్ స్టేషన్‌లో విచారించనున్నారు. తంబళ్లపల్లె టీడీపీ ఇన్‌చార్జిగా ఉంటూ సస్పెండైన దాసరిపల్లి జయచంద్రారెడ్డి పీఏగా పనిచేసిన రాజేశ్‌ను గతనెల 9న, జయచంద్రారెడ్డి ఇంట్లో పనిచేసిన అన్బురసును గత నెల 10న అరెస్టు చేశారు. వీరిద్దరినీ విచారించి కీలక విషయాలు రాబట్టేందుకు కస్టడీకి ఇవ్వాలని ఎక్సైజ్ పోలీసులు పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు అనుమతించింది. కాగా, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో నమోదైన నకిలీ మద్యం తయారీ కేసులో సయ్యద్ హాజి, కట్టారాజు, అంతా దాస్, మిథున్ దాస్, అల్లా బక్షులకు బెజవాడ కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. ఈ ఐదుగురూ నెల్లూరులోని కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. బెయిల్ కోసం విజయవాడలోని ఆరో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో వీరు దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు ముగియడంతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే, ములకలచెరువులో నమోదైన కేసులోనూ ఈ ఐదుగురు నిందితులుగా ఉన్నారు. ఆ కేసులో బెయిల్ రాకపోవడంతో వీరు జైల్లోనే ఉండనున్నారు.