Share News

ముద్రగడ కన్నుమూత

ABN , Publish Date - Jul 15 , 2026 | 04:39 AM

కాపు ఉద్యమ నాయకుడు, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం (73) కన్నుమూశారు. కిడ్నీ, క్యాన్సర్‌ వ్యాధులతో బాధపడుతూ కొన్ని రోజులుగా హైదరాబాద్‌ ఆస్పత్రిలో..

ముద్రగడ కన్నుమూత

  • కాపు ఉద్యమ నాయకుడు, వైసీపీ నేత పద్మనాభం మృతి

  • కొంతకాలంగా క్యాన్సర్‌, కిడ్నీ వ్యాధులతో పోరాటం

  • హైదరాబాద్‌ ఆస్పత్రిలో తుది శ్వాస

  • నేడు కిర్లంపూడిలో అంత్యక్రియలు

  • 1978లో జనతాతో రాజకీయ ప్రస్థానం

  • తర్వాత టీడీపీ, కాంగ్రెస్‌, వైసీపీలోకి

  • 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఎన్నిక

  • ముద్రగడ మృతికి చంద్రబాబు, రేవంత్‌, పవన్‌, లోకేశ్‌ సంతాపం

కాకినాడ, జూలై 14 (ఆంధ్రజ్యోతి): కాపు ఉద్యమ నాయకుడు, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం (73) కన్నుమూశారు. కిడ్నీ, క్యాన్సర్‌ వ్యాధులతో బాధపడుతూ కొన్ని రోజులుగా హైదరాబాద్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం మరింత విషమించి మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు తుదిశ్వాస విడిచారు. గత ఏడాది జూలైలో తీవ్ర కిడ్నీ సమస్యతో కాకినాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. మరింత మెరుగైన వైద్యం కోసం ఆయన్ను హైదరాబాద్‌ తీసుకెళ్లారు. ఆరోగ్యం మెరుగుపడడంతో స్వస్థలమైన కాకినాడ జిల్లా కిర్లంపూడికి తీసుకొచ్చారు. కొంతకాలానికే ఆరోగ్యం మళ్లీ క్షీణించడంతో గత నెల 16న హైదరాబాద్‌ తరలించారు. అక్కడి సింధు ఆస్పత్రిలో చేర్చారు. పరిస్థితి విషమించి మరణించారు. ఆయన మృతదేహాన్ని రాత్రి ప్రత్యేక అంబులెన్స్‌లో కిర్లంపూడికి తరలించారు. బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.


1978లో రాజకీయ ప్రస్థానం ప్రారంభం..

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో 1953 జనవరి 22న ముద్రగడ జన్మించారు. ఈయన తండ్రి వీరరాఘవరావు 1962, 67ల్లో ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా పనిచేశారు. 1977లో ఆయన హఠాన్మరణంతో ముద్రగడ రాజకీయాల్లో వచ్చారు. జనతా పార్టీలో చేరి.. ప్రత్తిపాడు నుంచి 1978లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 1982లో తెలుగుదేశం పార్టీలో చేరి.. అక్కడే 1983, 85ల్లో ఆ పార్టీ తరఫున గెలిచారు. ఎన్టీఆర్‌ క్యాబినెట్‌లో ఎక్సైజ్‌, రవాణా శాఖల మంత్రిగా పనిచేశారు. అయితే మంత్రి పదవికి రాజీనామా చేసి ప్రజారక్షణ సమితి పార్టీ స్థాపించారు. తదనంతరం కేఈ కృష్ణమూర్తి, కె.జానారెడ్డి తదితరులతో కలిసి తెలుగునాడు పార్టీని స్థాపించారు. తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. 1989లో ప్రత్తిపాడు నుంచే నాలుగోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో ఆయనకు చోటు దక్కింది. 1994లో ముద్రగడ తొలిసారి ఓడిపోయారు. అనంతరం ఆయన కాపునాడుతోను, బీజేపీతోను అనుబంధం సాగించారు. 1999 ఎన్నికల ముందు తిరిగి టీడీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో కాకినాడ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. తర్వాత రాజకీయాలకు కొన్నాళ్లు దూరంగా ఉండి 2008లో మరోసారి కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. 2009 వరకే ఆపార్టీలో ఉన్నారు. అనంతరం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండిపోయిన ముద్రగడ.. 2024 అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు వైసీపీలో చేరారు. పిఠాపురంలో వైసీపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.


కాపు ఉద్యమ నేతగా గుర్తింపు..

ముద్రగడ రాష్ట్రంలో కాపు ఉద్యమ నేతగా గుర్తింపు పొందారు. కాపు రిజర్వేషన్ల కోసం పోరాడారు. 1994లో నిరాహార దీక్ష చేపట్టారు. 2005లో పోలవరం నిర్వాసితుల కోసం తన ఇంట్లో ఆమరణ దీక్ష చేపట్టారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ గెలిచాక 2016 జనవరిలో ముద్రగడ కాపు రిజర్వేషన్ల కోసం మరోసారి ఉద్యమం చేశారు. తునిలో 2016 జనవరి 31న వి.కొత్తురులోని ఓ మైదానంలో సభ ఏర్పాటుచేశారు. ఆ సమయంలో రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు ఆందోళనకారులు నిప్పంటించారు. 2019-24 మధ్య కాపు రిజర్వేషన్ల కోసం ఆయన ఏనాడూ పోరాడలేదు.

చంద్రబాబు, రేవంత్‌, పవన్‌, లోకేశ్‌ సంతాపం

అమరావతి, పిఠాపురం, హైదరాబాద్‌, జూలై 14(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతికి పలువురు ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు ఎక్స్‌లో స్పందించారు. ‘పద్మనాభం కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నా’ అని పేర్కొన్నారు. ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ స్పందిస్తూ... ‘మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తుదిశ్వాస విడిచారని తెలిసి చింతిస్తున్నా. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నా’ అని పేర్కొన్నారు. మరో ప్రకటనలో మంత్రి లోకేశ్‌ కూడా ముద్రగడ మృతికి సంతాపం తెలిపారు. టీ-సీఎం రేవంత్‌ విచారం వ్యక్తం చేస్తూ.. ముద్రగడ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

సవాల్‌ విసిరి.. పేరు మార్చుకుని..

2024 ఎన్నికలకు ముందు జగన్‌ సమక్షంలో ముద్రగడ వైసీపీలో చేరారు. తన కుమారుడికి అసెంబ్లీ టికెట్‌ ఇస్తారని ఆశించారు. కానీ ఇవ్వలేదు. అయితే జగన్‌ ఆదేశాలతో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ తరఫున ఎన్నికల ప్రచారం చేపట్టారు. అక్కడ పవన్‌ కల్యాణ్‌ను ఓడిస్తానని బహిరంగంగా సవాల్‌ విసిరారు. ఓడించకపోతే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని శపథం చేశారు. పవన్‌ ఘనవిజయంతో ఆయన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు.

Updated Date - Jul 15 , 2026 | 04:44 AM