Share News

ముద్రగడకు తుది వీడ్కోలు

ABN , Publish Date - Jul 16 , 2026 | 04:19 AM

తీవ్ర అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన కాపు ఉద్యమ నాయకుడు, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి ఆనుకుని ఉన్న స్థలంలో..

ముద్రగడకు తుది వీడ్కోలు

  • అంత్యక్రియల వద్దా వైసీపీ రచ్చ

  • మృతదేహం వద్ద ‘జగన్‌ సీఎం’ నినాదాలు

  • క్యాడర్‌కు అక్కడే వైసీపీ అధినేత సెల్ఫీలు

  • కుమార్తె క్రాంతిని అడ్డుకున్న అనుచరులు

  • పోలీసుల సాయంతో తండ్రికి నివాళులు

  • అధికార లాంఛనాలకు వైసీపీ అడ్డంకులు

  • పోలీసులను నెట్టేసిన అంబటి.. కేసు నమోదు

కాకినాడ, జూలై 15(ఆంధ్రజ్యోతి): తీవ్ర అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన కాపు ఉద్యమ నాయకుడు, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి ఆనుకుని ఉన్న స్థలంలో ఆయన కోరిక మేరకు బుధవారం సాయంత్రం ఖననం చేశారు. గత నెల 16న తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్‌ ఆసుపత్రిలో చేరిన ముద్రగడ మూత్రపిండాల వ్యాధి, క్యాన్సర్‌తో పోరాడుతూ మంగళవారం సాయంత్రం ఆసుపత్రిలోనే కన్నుమూశారు. దీంతో బుధవారం తెల్లవారుజామున పార్ధివ దేహాన్ని కిర్లంపూడిలోని నివాసానికి తీసుకువచ్చారు. ముద్రగడను కడసారి చూసేందుకు స్థానికులు పెద్దసంఖ్యలో తరలి వచ్చారు. వైసీపీ మాజీమంత్రులు బొత్స సత్యనారాయణ, కన్నబాబు, దాడిశెట్టి రాజా, వేణుగోపాలకృష్ణ తదితరులు నివాళులు అర్పించారు. వైసీపీ అధినేత జగన్‌ కిర్లంపూడిలో ముద్రగడ నివాసానికి చేరుకుని నివాళులు అర్పించారు. అనంతరం అంత్యక్రియల సమయంలో కొద్దిసేపు పాడెను మోశారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. మరోపక్క తన తండ్రిని కడసారి చూసేందుకు ముద్రగడ కుమార్తె క్రాంతి కిర్లంపూడికి రాగా ముద్రగడ రెండో కుమారుడు, ప్రత్తిపాడు వైసీపీ ఇన్‌చార్జి గిరి అనుచరులు అడ్డుకున్నారు. క్రాంతి నివాళులు అర్పించడానికి వీల్లేదని నినాదాలు చేశారు. ఆమె ముద్రగడను మానసిక వేదనకు గురిచేశారని మండిపడ్డారు.


అయితే, తన తండ్రిని చూసేందుకు వస్తే అభ్యంతరం ఏంటని క్రాంతి నిలదీశారు. ఎంతమంది అడ్డుకున్నా వారిని విదిలించుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేయగా ఉద్రిక్తత నెలకొంది. ఈలోపు పోలీసులు వచ్చి భద్రత కల్పించడంతో ముద్రగడ భౌతికకాయానికి క్రాంతి నివాళులు అర్పించారు. ప్రభుత్వం తరఫున మంత్రులు వాసంశెట్టి సుభాష్‌, కందుల దుర్గేష్‌ కిర్లంపూడి వచ్చారు. ముద్రగడ పార్దివ దేహానికి నివాళులు అర్పించి కుటుంబానికి సంతాపం ప్రకటించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తదితరులు ముద్రగడ పార్ధివ దేహానికి నివాళులు అర్పించారు.


మృతదేహం వద్ద జగన్‌ బలప్రదర్శన

ముద్రగడ భౌతిక కాయానికి నివాళులు అర్పించేందుకు జగన్‌ మందీ మార్బలంతో తరలివచ్చారు. జగ్గంపేటలో హెలికాఫ్టర్‌లో దిగి అక్కడి నుంచి కిర్లంపూడికి రోడ్డుమార్గాన ‘షో’ చేసుకుంటూ వచ్చారు. దారిపొడవునా వైసీపీ కార్యకర్తలు జగన్‌కు అభివాదం చేశారు. ముద్రగడకు జగన్‌ నివాళులు అర్పించే సమయంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు సీఎం జగన్‌ అంటూ పదేపదే నినాదాలు చేశారు. వైసీపీ కేడర్‌ జగన్‌తో సెల్ఫీలకు పోటాపోటీగా ముందుకు రావడంతో ఆయన ఫొటోలకు ఫోజులిచ్చారు.

గార్డ్‌ ఆఫ్‌ హానర్‌పై చిందులు

అంత్యక్రియల సమయంలో ప్రభుత్వం నిర్వహించే అధికారిక లాంఛనాల ప్రక్రియను వైసీపీ రాజకీయం చేసింది. ముద్రగడ సేవలను గుర్తించిన ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ బుధవారం ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఆ తర్వాత అంత్యక్రియలపై ప్రభుత్వం ప్రకటించింది. సాయంత్రం 4 గంటల సమయంలో ముద్రగడ అంత్యక్రియల్లో భాగంగా పోలీసులు గార్డ్‌ ఆఫ్‌ హానర్‌ ప్రక్రియ ప్రారంభించారు. అయితే, వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఒక్కసారిగా రెచ్చిపోయారు. ముద్రగడ పార్ధివ దేహానికి సెల్యూట్‌ చేస్తున్న పోలీసులవైపు దూసుకెళ్లి అధికారిక లాంఛనాలు వద్దంటూ పెద్దపెద్ద కేకలతో రెచ్చిపోయారు. ముద్రగడకు ఆ గౌరవం వద్దని నినాదాలుచేశారు. పోలీసులను వెనక్కి నెట్టేశారు. వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, రాజానగరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఆయన సోదరుడు గణేష్‌ అనుచరులు రభససృష్టించారు. ముద్రగడ కుటుంబ సభ్యుల కోరిక మేరకు అధికారిక లాంఛనాలను అడ్డుకుంటున్నామంటూ హడావుడి చేశారు. పోలీసులు అంబటిని పక్కకు లాక్కెళ్లడంతో ముద్రగడ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. అంతకుముందు రాజా సైతం అధికారిక లాంఛనాలను అడ్డుకుంటామని ప్రకటించారు. వైసీపీ తీరుపై ఆ పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమైంది.


అంబటిపై కేసు నమోదు

ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సందర్భంగా గౌరవ వందనం సమర్పించేందుకు వచ్చిన పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కిర్లంపూడి పోలీసులు కేసు నమోదు చేశారు. గౌరవ వందనం సమర్పించే సమయంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని పేర్కొంటూ కాకినాడ రూరల్‌ ఇంద్రపాలేనికి చెందిన వెలుదూటి అప్పలరాజు ఫిర్యాదు చేశారు. దీనిపై కాకినాడ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అంబటి పోలీసులను అడ్డుకోవడంతోపాటు, ఇద్దరు కానిస్టేబుళ్లను బలవంతంగా నెట్టివేశారని, ఉన్నతాధికారులతో వాగ్వాదానికి దిగారని అప్పలరాజు ఫిర్యాదులో పేర్కొన్నారు.

Updated Date - Jul 16 , 2026 | 04:21 AM