Share News

MPs Assets: పదేళ్లలో ఎంపీల ఆస్తులు డబుల్‌

ABN , Publish Date - Jan 08 , 2026 | 06:28 AM

రాజకీయమంటే సేవ కాదు.. అదో లాభసాటి వ్యాపారమని మరోసారి రుజువైంది! పదేళ్లలో సామాన్య ప్రజల ఆస్తులు ఎంత పెరుగుతాయో తెలియదు కానీ లోక్‌సభకు వరుసగా ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీల ఆస్తులు...

MPs Assets: పదేళ్లలో ఎంపీల ఆస్తులు డబుల్‌

  • 110శాతం పెరిగిన 102 మంది ఎంపీల ఆస్తులు

  • 124 కోట్ల సంపాదనతో టాప్‌ 3లో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి

  • కేంద్ర మంత్రి సీఆర్‌ పాటిల్‌ ఆస్తులు తగ్గుదల

  • ఏడీఆర్‌ నివేదికలో వెల్లడి

  • గత మూడు సార్లు గెలిచిన ఎంపీల ఆస్తుల విశ్లేషణ

న్యూఢిల్లీ, జనవరి 7(ఆంధ్రజ్యోతి): రాజకీయమంటే సేవ కాదు.. అదో లాభసాటి వ్యాపారమని మరోసారి రుజువైంది! పదేళ్లలో సామాన్య ప్రజల ఆస్తులు ఎంత పెరుగుతాయో తెలియదు కానీ లోక్‌సభకు వరుసగా ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీల ఆస్తులు మాత్రం రాకెట్‌ వేగంతో పైకి దూసుకెళ్తున్నాయి. 2014, 2019, 2024 లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా గెలిచిన 102 మంది ఎంపీల ఆస్తులు గత పదేళ్లలో సగటున 110 శాతం పెరిగాయి. గత మూడు పర్యాయాలు లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన ఎంపీలు సమర్పించిన అఫిడవిట్లను పరిశీలించి అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌(ఏడీఆర్‌) రూపొందించిన నివేదికలో ఈ మేరకు వివరాలు వెల్లడించింది. 2014లో ఈ ఎంపీల సగటు ఆస్తులు రూ.15.76 కోట్లు కాగా, 2019 నాటికి రూ.24.21 కోట్లకు, 2024లో రూ.33.13 కోట్లకు పెరిగాయి. పదేళ్లలో ఈ 102 మంది ఎంపీల సగటు ఆస్తుల విలువ 17.36 కోట్లు పెరగడం గమనార్హం. విచిత్రమేమిటంటే ఈ ఎంపీల జాబితాలో చివరన ఉన్న కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ ఆస్తులు ఇదే కాలంలో దాదాపు సగానికి పడిపోయాయి. 2014లో పాటిల్‌ ఆస్తులు రూ.74 కోట్లు కాగా, 2024 నాటికి రూ.39 కోట్లకు తగ్గాయి. పదేళ్లలో కేంద్ర మంత్రి పాటిల్‌ రూ.35 కోట్లు నష్టపోయారు. 102 మందిలో బీజేపీ సతార ఎంపీ ప్రతాప్‌ బోంస్లే అత్యధికంగా రూ.162 కోట్లు సంపాదించి మొదటి స్థానంలో ఉన్నారు.


2014లో ఆయన ఆస్తులు రూ.60 కోట్లు కాగా, 2024 నాటికి రూ.223 కోట్లకు చేరాయి. ఆ తర్వాత రెండో స్థానంలో ఉన్న జామ్‌నగర్‌ ఎంపీ పూనంబెన్‌ రూ.130 కోట్లు సంపాదించారు. ఆమె ఆస్తులు రూ.17 కోట్ల నుంచి రూ.147 కోట్లకు పెరిగాయి. వైసీపీ ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి రూ.124 కోట్ల సంపాదనతో మూడో స్థానం, బాలీవుడ్‌ నటి హేమమాలిని రూ.100 కోట్లతో నాలుగో స్థానం, బాలీవుడ్‌ నటుడు శత్రుఘ్నసిన్హా రూ.78 కోట్లతో ఏడో స్థానం, సుప్రియా సూలే రూ.52 కోట్ల సంపాదనతో 10 స్థానంలో ఉన్నారు. 38వ స్థానంలో ఉన్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆస్తులు రూ.11 కోట్లు పెరిగాయి. 2014లో రాహుల్‌ ఆస్తులు రూ.9 కోట్లు కాగా, 2024 నాటికి రూ.20 కోట్లకు పెరిగాయి. ప్రధాని నరేంద్రమోదీ ఆస్తులు 2014లో రూ.1.65 కోట్లు కాగా, 2019లో 2.51 కోట్లు, 2024 నాటికి 3.02 కోట్లకు చేరాయి. 94వ స్థానంలో ఉన్న మోదీ ఆస్తులు పదేళ్లలో రూ.1.36 కోట్లు పెరిగాయి.


మిథున్‌రెడ్డి ఆస్తి రూ.22 కోట్ల నుంచి.. రూ.124 కోట్లకు..

వైసీపీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయి. 2014లో ఆయన ఆస్తులు రూ.22 కోట్లు కాగా, 2024 నాటికి రూ.146 కోట్లకు చేరాయి. 2019-24 మధ్యకాలంలో మిథున్‌రెడ్డి ఏకంగా 80 కోట్ల ఆస్తులు సంపాదించారు. మొత్తంగా పదేళ్లలో మిథున్‌రెడ్డి రూ.124 కోట్లు సంపాదించి.. 102 మంది ఎంపీలలో మూడో స్థానంలో నిలిచారు. వైసీపీ మరో ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి ఆస్తులు రూ.7 కోట్ల నుంచి రూ.40 కోట్లకు పెరిగాయి. 2019-24 మధ్య అవినాశ్‌రెడ్డి ఆస్తి రూ.22 కోట్లు పెరిగింది. రూ.78 కోట్లతో వైసీపీ అత్యధికంగా సగటు ఆస్తులు కలిగిన పార్టీల జాబితాలో రెండో స్థానంలో ఉంది. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడి ఆస్తులు పదేళ్లలో రూ.8 కోట్ల నుంచి రూ.23 కోట్లకు, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ ఆస్తులు రూ.4 కోట్ల నుంచి రూ.23 కోట్లకు పెరిగాయి.

Updated Date - Jan 08 , 2026 | 06:28 AM