Share News

ఎంపీడీఓల పర్యవేక్షణలో గ్రామీణ అన్న క్యాంటీన్లు

ABN , Publish Date - May 22 , 2026 | 05:09 AM

రాష్ట్రంలోని గ్రామీణ అన్న క్యాంటీన్ల నిర్వహణ, పర్యవేక్షణ, ఆహార నాణ్యత నియంత్రణ కోసం ప్రభుత్వం ప్రామాణిక విధానాలు(ఎస్ఓపీ) ఆమోదించింది.

ఎంపీడీఓల పర్యవేక్షణలో గ్రామీణ అన్న క్యాంటీన్లు

అమరావతి, మే 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని గ్రామీణ అన్న క్యాంటీన్ల నిర్వహణ, పర్యవేక్షణ, ఆహార నాణ్యత నియంత్రణ కోసం ప్రభుత్వం ప్రామాణిక విధానాలు(ఎస్ఓపీ) ఆమోదించింది. ఈమేరకు మున్సిపల్‌, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్‌కుమార్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామీణ అన్న క్యాంటీన్ల నిర్వహణలో ఎంపీడీఓలు కీలకపాత్ర పోషించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఎస్‌ఓపీ ప్రకారం క్యాంటీన్లలో వంట శాలలు ఎఫ్‌ఎస్ఎస్ఏఐ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. ఆహారం పరిశుభ్రంగా వండటంతోపాటు రెండు గంటల్లోపు క్యాంటీన్లకు తరలించి వేడిగా వడ్డించాలి. టోకెన్ల జారీ, లబ్ధిదారుల వివరాల నమోదు, భోజన నాణ్యత తనిఖీ వంటి అంశాలపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుంది. ఒక్కో క్యాంటీన్‌లో సెషన్‌కు కనీసం 350 మందికి భోజనం అందించే సామర్థ్యం ఉండాలి. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో సామర్థ్యాన్ని పెంచడం లేదా తగ్గిస్తారు. ప్రస్తుతం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం మాత్రమే అందిస్తున్నారు. భవిష్యత్తులో రాత్రి భోజనం అందించే అంశాన్ని పరిశీలిస్తారు. క్యాంటీన్లలో సీసీ కెమెరాలు, వెబ్‌క్యామ్‌లు, ఉష్ణోగ్రత సెన్సర్లు, ఐఓటీ ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేయాలి. పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ, సిబ్బంది హాజరు, ఆహార నాణ్యతపై ఎంపీడీఓలు తరచూ తనిఖీలు నిర్వహించాలి. గ్రామ సచివాలయాల ద్వారా అన్న క్యాంటీన్లపై విస్తృత ప్రచారం చేయాలని ప్రభుత్వం సూచించింది. నీరు, విద్యుత్‌, పారిశుధ్యం, డ్రైనేజీ వంటి సౌకర్యాలను పంచాయతీ, మండల నిధులతో కల్పించాలని ఆదేశించింది. కాగా, గ్రామీణ అన్న క్యాంటీన్లకు తాత్కాలిక సలహా కమిటీలను ఏర్పాటు చేస్తూ మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ మరో ఉత్తర్వు ఇచ్చింది. పంచాయతీ కార్యదర్శి చైర్మన్‌గా, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌, వెల్ఫేర్‌ అసిస్టెంట్‌, మహిళా పోలీసు సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేస్తూ ఆదేశాలిచ్చారు.

Updated Date - May 22 , 2026 | 05:10 AM