Share News

MP Mithun Reddy: మద్యం స్కాం గురించి తెలీదు!

ABN , Publish Date - Jan 24 , 2026 | 04:15 AM

‘మద్యం కుంభకోణం గురించి నాకేమీ తెలియదు. దాంతో నాకు ఎలాంటి సంబంధమూ లేదు’ అని వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డి స్పష్టం చేసినట్లు తెలిసింది.

MP Mithun Reddy: మద్యం స్కాం గురించి తెలీదు!

  • దానితో నాకు సంబంధంలేదు

  • అదాన్‌ డిస్టిలరీలో భాగస్వామ్యమా!?

  • అది మా ఆడిటర్‌ చూసుకుంటారు

  • డిస్టిలరీల నుంచి పీఎల్‌ఆర్‌లోకి

  • వచ్చిన డబ్బులు వెనక్కి ఇచ్చేశాం

  • ఈడీ విచారణలో ఎంపీ మిథున్‌ రెడ్డి

అమరావతి, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): ‘మద్యం కుంభకోణం గురించి నాకేమీ తెలియదు. దాంతో నాకు ఎలాంటి సంబంధమూ లేదు’ అని వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డి స్పష్టం చేసినట్లు తెలిసింది. రాజకీయ కక్షతోనే ప్రభుత్వం తనపై కేసులు పెట్టిందని ఆరోపించినట్లు సమాచారం. జగన్‌ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో మిథున్‌ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలున్నాయి. ఏ1 రాజ్‌ కసిరెడ్డితోపాటు మిథున్‌ రెడ్డి, సజ్జల శ్రీధర్‌ రెడ్డికి అరబిందో నుంచి రూ.వంద కోట్లు అప్పుగా ఇప్పించినట్లు వైసీపీ మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సాయిరెడ్డిని ప్రశ్నించిన మరుసటి రోజే... హైదరాబాద్‌లో మిథున్‌ రెడ్డి ఈడీ ముందు హాజరయ్యారు. ఆయనను ఈడీ అధికారులు శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు.. ఏడు గంటలపాటు ప్రశ్నించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం... మద్యం పాలసీ రూపకల్పన, ముడుపుల పర్సెంటేజీ ఖరారు, మద్యం ఆర్డర్లలో ఆటోమేటిక్‌ విధానాన్ని మాన్యువల్‌గా మార్పించిన వైనం, ఎక్సైజ్‌ అధికారులతో కలిసి మద్యం దోపిడీకి మార్గం వేసిన తీరు, ఆర్థిక అవకతవకలు, మనీ లాండరింగ్‌ వంటి అంశాలపై ఈడీ అధికారులు ప్రశ్నలు సంధించారు. మిథున్‌ రెడ్డి దేనికీ సూటిగా, స్పష్టంగా సమాధానం చెప్పలేదని తెలిసింది.


సరైన జవాబులు చెప్పకపోగా... ‘‘నాకు సంబంధంలేదు. నాకేమీ తెలీదు. రాజకీయ దురుద్దేశంతోనే కూటమి పెద్దలు నన్ను ఈ కేసులో ఇరికించారు’’ అని చెప్పినట్లు సమాచారం. అదాన్‌ డిస్టిలరీ్‌సతో ఆయన వ్యాపార భాగస్వామ్యానికి సంబంధించిన ఆధారాలు చూపించినప్పుడు... మిథున్‌ రెడ్డి కొంత కంగారు పడినట్లు తెలిసింది. ఆ తర్వాత... ‘అవన్నీ మా ఆడిటర్‌ చూసుకుంటారు’ అని బదులిచ్చినట్లు తెలిసింది. తమ కుటుంబానికి చెందిన పీఎల్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలోకి డిస్టిలరీస్‌ ఖాతాల నుంచి జమ అయిన రూ.5 కోట్లు ముడుపుల సొమ్ము కాదని, ఆ సొమ్ము అప్పుడే వెనక్కి ఇచ్చేశామని బదులిచ్చినట్లు సమాచారం. ఒక్కో మద్యం కేసు(బాక్స్‌)కు రూ.450 నుంచి రూ.600గా ముడుపులు ఎవరి ఆదేశాలతో నిర్ణయించారని అడగ్గా... అలాంటి పని చేయలేదని బదులిచ్చారు. ‘‘మీ పార్టీ మాజీ రాజ్యసభ సభ్యుడి (విజయసాయి రెడ్డి) ఇంట్లో లిక్కర్‌ పాలసీ రూపకల్పనపై నిర్వహించిన సమావేశాల్లో మీరు చర్చించిన అంశాలపై ఆధారాలున్నాయి’’ అని ఈడీ అధికారులు చెప్పినప్పుడు... ‘‘ఒకే పార్టీలో ఎంపీలుగా ఉన్నప్పుడు ఒకరింటికి మరొకరు వెళ్లి కలవడం అత్యంత సాధారణ విషయం. అలానే నేను కూడా మా పార్టీ ఎంపీలను కలుస్తాను’’ అని మిథున్‌ పేర్కొన్నారు. వైసీపీ అధికారంలోకి రాక ముందు ఉన్న మద్యం ఆర్డర్ల ఆటోమెటిక్‌ విధానాన్ని మాన్యువల్‌గా మార్చే ఆలోచన ఎవరిదన్న ప్రశ్నకు ఎలాంటి సమాధానం చెప్పకుండా మౌనం వహించారు. 2019 ఎన్నికల నాటి అఫిడవిట్‌తో పోల్చితే 2024 నాటికి ఆస్తులు బాగా పెరిగాయని ఈడీ అధికారులు గుర్తు చేశారు. అదంతా ఎలా వచ్చింది? ఆదాయపు పన్ను శాఖకు లెక్కలు చెప్పారా.? అని అడగ్గా... ‘ఔను’ అని సమాధానం ఇచ్చారు. లిక్కర్‌ స్కామ్‌లో కీలక నిందితులు రాజ్‌ కసిరెడ్డి, విజయసాయు రెడ్డి, వాసుదేవ రెడ్డి గురించి ఈడీ అధికారులు ప్రశ్నించినప్పుడు... వారితో తనకు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవని చెప్పినట్లు తెలిసింది. అయితే, తాను మనీలాండరింగ్‌ జోలికి ఎప్పుడూ వెళ్లలేదని, తమ కుటుంబానికి కన్స్‌స్ట్రక్షన్‌తో పాటు ఇతర వ్యాపారాలు ఉన్నాయని చెప్పారు. మిథున్‌ రెడ్డి చెప్పిన విషయాలు నమోదు చేసుకున్న ఈడీ అధికారులు... అవసరమైతే మరోమారు పిలుస్తామని, అందుబాటులో ఉండాలని చెప్పి పంపించారు.

Updated Date - Jan 24 , 2026 | 04:17 AM