నక్సలిజం కోరల్లో నా బాల్యం
ABN , Publish Date - Mar 31 , 2026 | 05:52 AM
‘2004లో అలిపిరిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై నక్సలైట్లు క్లైమోర్ మైన్స్‌తో దాడి చేశారు. ఆనాడు వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఆయన ప్రాణాలతో బయటపడ్డారు.
తుపాకీ శబ్దాలు, రక్తపాతం మధ్యే గడిపా
లోక్‌సభలో బైరెడ్డి శబరి భావోద్వేగ ప్రసంగం
అమితా షా, మోదీ కృషితోనే నేడు నక్సల్ ముక్త భారత్
చంద్రబాబుపై దాడి ఘటనను గుర్తుచేసుకున్న ఎంపీ
న్యూఢిల్లీ, మార్చి 30(ఆంధ్రజ్యోతి): ‘2004లో అలిపిరిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై నక్సలైట్లు క్లైమోర్ మైన్స్‌తో దాడి చేశారు. ఆనాడు వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. 17 క్లైమోర్ మైన్స్‌ను నక్సల్స్ పాతిపెట్టారు. సీఎం చంద్రబాబు నక్సలిజంపై జీరో టాలరెన్స్‌తో వ్యవహరిస్తున్నారు’ అని టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి పేర్కొన్నారు. సోమవారం లోక్‌సభలో నక్సలిజం నిర్మూలనపై జరిగిన చర్చలో టీడీపీ తరఫున ఆమె మాట్లాడారు. భావోద్వేగాలతో మాట్లాడిన ఆమె... మాజీ ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డిని పట్టపగలే దారుణంగా కాల్చి చంపిన ఘటనను గుర్తు చేస్తూ నక్సల్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నల్లమల అడవుల నడిబొడ్డున ఉన్న ముచుమర్రి మా గ్రామం. ఒకప్పుడు అది నక్సలిజానికి కేంద్ర బిందువుగా ఉండేది. నా చిన్నతనంలో ప్రతిరోజూ నాన్న క్షేమంగా ఇంటికి వస్తారో లేదో అని అమ్మ, అమ్మమ్మ కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూసేవారు. స్కూళ్లు మారుతూ, అభద్రతా భావం మధ్య పెరిగాను. అడవి బిడ్డగా పుట్టడమే మేం చేసిన నేరమా? గన్ సౌండ్లు, రక్తపాతం మధ్యే నా బాల్యం గడిచింది. నా కుటుంబం కూడా నక్సల్స్ హింసకు బలైంది. ఆ బాధ ఏంటో నాకు తెలుసు. కాంగ్రెస్ హయాంలో 2004-2014 మధ్య దేశంలో 17 వేలకు పైగా నక్సల్ దాడులు జరిగాయి. నాడు ‘ఎర్ర కారిడార్’గా పిలిచిన ప్రాంతాలు నేడు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా చొరవతో ‘అభివృద్ధి కారిడార్’లుగా మారుతున్నాయి. నాడు ‘లాల్ సలాం’ నినాదాలు వినిపించిన చోట.. నేడు ‘భారత మాతా కీ జై’ అనే నినాదాలు వినపడుతున్నాయి. వేలాది నక్సల్స్ ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలిశారు. నక్సల్ రహిత భారత్ దిశగా అడుగులు పడుతున్నాయి’’ అని శబరి అన్నారు.