కదులుతున్న డొంక!
ABN , Publish Date - May 04 , 2026 | 01:24 AM
బాటసారులు, విద్యార్థుల అన్నదానం కోసం ‘విజయవాడ అన్నదాన సమాజం ట్రస్టు’కు ఆరు దశాబ్దాల కిందట దాతలు ఇచ్చిన భూములు ఎవరివన్నది వెలుగులోకి వచ్చింది.. ట్రస్టుకు సంబంధించి కైకలూరు నియోజకవర్గంలో అన్యాక్రాంతమైన 146.68 ఎకరాల భూములు నూజివీడు జమీందారు రాజా వెంకటాద్రి అప్పారావు బహదూర్ దానం చేసినట్టు తెలుస్తోంది. రెవెన్యూ రీసెటిల్‌మెంట్ రిజిస్టర్ (ఆర్‌ఎస్‌ఆర్)లో కైకలూరు భూములకు సంబంధించి ఇదే పేరు కనిపిస్తోంది. ట్రస్టుకు రాజా వెంకటాద్రి అప్పారావు ఇచ్చిన భూములు ఎలా అన్యాక్రాంత మయ్యాయన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది.
- అన్నదానం సమాజం భూములు నూజివీడు జమీందారువే..
- 146.68 ఎకరాలు రాజా వెంక టాద్రి అప్పారావు బహదూర్ దానం ఇచ్చినవే!
- దేవదాయశాఖ కమిషనర్‌కు ప్రాథమిక వివరాలు అందించిన ఏసీ
- మరో వారంలో రంగంలోకి రాష్ట్ర విజిలెన్స్ బృందం
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
బాటసారులు, విద్యార్థుల అన్నదానం కోసం ‘విజయవాడ అన్నదాన సమాజం ట్రస్టు’కు ఆరు దశాబ్దాల కిందట దాతలు ఇచ్చిన భూములు ఎవరివన్నది వెలుగులోకి వచ్చింది.. ట్రస్టుకు సంబంధించి కైకలూరు నియోజకవర్గంలో అన్యాక్రాంతమైన 146.68 ఎకరాల భూములు నూజివీడు జమీందారు రాజా వెంకటాద్రి అప్పారావు బహదూర్ దానం చేసినట్టు తెలుస్తోంది. రెవెన్యూ రీసెటిల్‌మెంట్ రిజిస్టర్ (ఆర్‌ఎస్‌ఆర్)లో కైకలూరు భూములకు సంబంధించి ఇదే పేరు కనిపిస్తోంది. ట్రస్టుకు రాజా వెంకటాద్రి అప్పారావు ఇచ్చిన భూములు ఎలా అన్యాక్రాంత మయ్యాయన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది.
రంగంలో దిగనున్న విజిలెన్స్ విభాగం
‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన విజయవాడ అన్నదానం సమాజం ట్రస్టు భూముల అన్యాక్రాంతంపై రాష్ట్ర ప్రభుత్వ విప్, సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్ర విజిలెన్స్ డీజీకి లేఖ రాయటంతో.. ఈ భూముల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. విజిలెన్స్ విభాగం ఈ వ్యవహారంపై దృష్టి సారించింది. మరోవైపు దేవదాయశాఖ కమిషనర్ కూడా అంతర్గత విచారణ జరుపుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా దేవదాయశాఖ అధికారి షణ్ముగం దీనిపై దేవదాయ శాఖ కమిషనర్‌కు ప్రాథమిక నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ నివేదిక ప్రకారం .. విజయవాడ అన్నదానం ట్రస్టు చాలా కాలంగా దేవదాయశాఖకు లెక్కలు చెప్పటం లేదని సమాచారం. ట్రస్టుకు ఈవోను నియమించాల్సిందిగా ఆయన ప్రతిపాదించినట్టు సమాచారం. ఇంత వరకు బాగానే ఉన్నా.. భూముల లెక్కలు తీసే పనిలో మాత్రం జాప్యం జరుగుతోంది. దేవదాయశాఖ కమిషనర్ తక్షణం ఈ వ్యవహారంపై జోక్యం చేసుకుని భూముల లెక్కలు తీయాల్సి ఉంది. దేవదాయశాఖ రికార్డుల ప్రకారం చూసినా.. ట్రస్టు రికార్డుల ప్రకారం చూసినా ఈ భూములు ఎలా దానంగా వచ్చాయో స్పష్టమైన రికార్డులు ఉన్నాయి. కాబట్టి రెవెన్యూ రికార్డులను కూడా మరోసారి పరిశీలించటం ద్వారా ఈ భూములు ఎవరు ఇచ్చారన్నది తెలుసుకోవచ్చు.
మండవల్లి మండలం పెరికిగూడెంలో భూములు
విజయవాడ అన్నదానం ట్రస్టుకు ఇచ్చిన 146.68 ఎకరాల భూములు కైకలూరు నియోజకవర్గం మండవల్లి మండలంలోని పెరికిగూడెం గ్రామంలో ఉన్నాయి. ఈ భూములు 445, 448, 621, 626, 627, 628, 630, 631, 633, 636, 639, 640, 641, 643, 644, 645, 646, 647, 648, 649, 650, 651, 652, 658, 659 సర్వే నెంబర్లలో ఉన్నాయి. సర్వే నెంబర్లు అన్నింటికీ కూడా ఆర్‌ఎస్‌ఆర్‌లో రాజా వెంకటాద్రి అప్పారావు బహదూర్ పేరుతోనే ఉండటం గమనార్హం. రాజా వెంకటాద్రి అప్పారావు ఇచ్చిన భూములు ఎలా చేతులు మారాయి ? ఎవరి ద్వారా చేతులు మారాయి ? ఎంతమంది చేతులు మారాయి ? అన్నది సబ్‌రిజిస్ర్టేషన్ అధికారుల నుంచి డేటా తీసుకోవచ్చు. నిర్దేశిత సర్వే నెంబర్లకు సంబంధించిన ఈసీలను తీసుకున్నా కూడా స్వల్ప సమయంలోనే ఆక్రమణదారుల డేటా వస్తుంది. ఈ భూములను కొనుగోలు చేసిన వారెవరో తెలుస్తుంది. భూములను కొనుగోలు చేసిన వారు అమాయకులైతే.. వీటిని అన్యాక్రాంతం చేసిన వారెవరో తెలుసుకోవటానికి అవకాశం ఉంటుంది. మరో వారం రోజుల్లో ఈ భూముల అన్యాక్రాంతం వ్యవహారంపై విచారించడానికి రాష్ట్ర విజిలెన్స్ బృందం కూడా రంగంలోకి దిగబోతోంది. ట్రస్టు సభ్యుల పాత్ర ఉందా ? దేవదాయ శాఖ అధికారుల పాత్ర ఉందా ? రాజకీయ శక్తుల పాత్ర ఉందా అన్నది నిగ్గు తేలనుంది. దేవదాయశాఖ కమిషనర్ తక్షణం ఈ భూముల లావాదేవీల వివరాలను రిజిస్ర్టేషన్ శాఖ నుంచి పొందగలిగితే.. పని సులువు అవుతుంది.