Share News

కూతుర్ని ఇక కాపాడలేను... నా భర్తను కటకటాల్లో వేయండి!

ABN , Publish Date - Jul 19 , 2026 | 03:54 AM

మానసిక వికలాంగురాలైన కుమార్తెను జాగ్రత్తగా చూసుకోవలసిన తండ్రే ఆమె పాలిట రాక్షసుడయ్యాడు. కామంతో కళ్లు మూసుకుపోయి కూతురిపై పలుమార్లు అత్యాచారానికి తెగబడ్డాడు.

కూతుర్ని ఇక కాపాడలేను... నా భర్తను కటకటాల్లో వేయండి!

  • మానసిక దివ్యాంగురాలిపై తండ్రి అఘాయిత్యం

  • హెచ్చరించినా కనికరించని కామాంధుడు

  • సహనం నశించి భర్తపై పోలీసులకు ఫిర్యాదు

  • మల్కాపురంలో దారుణం

విశాఖపట్నం/మల్కాపురం, జూలై 18 (ఆంధ్రజ్యోతి): మానసిక వికలాంగురాలైన కుమార్తెను జాగ్రత్తగా చూసుకోవలసిన తండ్రే ఆమె పాలిట రాక్షసుడయ్యాడు. కామంతో కళ్లు మూసుకుపోయి కూతురిపై పలుమార్లు అత్యాచారానికి తెగబడ్డాడు. అతడి బారి నుంచి బిడ్డను కాపాడుకోలేక, తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసి, భర్తను కటకటాల వెనక్కి నెట్టింది. విశాఖపట్నం మల్కాపురంలోని ప్రకాశరావు నగర్‌లో ఓ కుటుంబం నివసిస్తోంది. 46 ఏళ్ల వయస్సు కలిగిన తండ్రి రాడ్‌ బెండింగ్‌ పనులు చేస్తూ భార్య, 22 ఏళ్ల వయస్సు కలిగిన మానసిక వికలాంగురాలైన కుమార్తె, 17 ఏళ్ల కుమారుడు, అత్తను పోషిస్తున్నాడు. కుమార్తెను ఆరో తరగతి వరకు చదివించి, తర్వాత మాన్పించేశారు. పెదవాల్తేరులోని ప్రభుత్వ మానసిక చికిత్సాలయంలో ఆమెకు వైద్యం చేయిస్తున్నారు. ఆ యువతి ప్రతిరోజు నాయనమ్మతో పాటు ఆమె గదిలో నిద్రించేది. ఆరు నెలల కిందట కుమార్తెను అర్ధరాత్రి సమయంలో నిద్రలేపి, తన గదిలోకి తీసుకువెళ్లి తండ్రి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలు కేకలు పెట్టడంతో తల్లి నిద్రలేచి కుమార్తెను బయటకు తీసుకువచ్చింది. దీనిపై అప్పుడు బంధువులు, స్థానిక పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టగా...మరోసారి అలాంటి తప్పు చేయవద్దని, చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తండ్రిని హెచ్చరించారు. పోలీస్‌ స్టేషన్‌కు వెళితే పరువుపోవడంతోపాటు జీవనాధారం లేక కుటుంబం రోడ్డున పడిపోతుందని తల్లికి సర్ది చెప్పి పంపించేశారు. అయితే ఐదు రోజుల కిందట తండ్రి మరోసారి కుమార్తెను అర్ధరాత్రి సమయంలో తన గదికి తీసుకువెళ్లి దారుణానికి ఒడిగట్టాడు. ఆ సమయంలో తల్లికి మెలకువ రావడంతో లేచి, ఆగ్రహంతో భర్తకు దేహశుద్ధి చేసి కేకలు పెట్టింది.


దీనిపై ఇంకా కుటుంబంలో గొడవ జరుగుతుండగానే శుక్రవారం రాత్రి మరోసారి కుమార్తెపై అఘాయిత్యం చేసే ప్రయత్నం చేశాడు. దీంతో విరక్తి చెందిన ఆమె భర్తపై మల్కాపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. శుక్రవారం అర్ధరాత్రే మల్కాపురం పోలీసులు తండ్రిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి బాధితురాలిని వైద్యపరీక్షలకు పంపించారు. మల్కాపురం సీఐ నరసింహారావు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో వారి సూచనల మేరకు మహిళా పోలీస్‌ స్టేషన్‌ ఏసీపీ అంబేడ్కర్‌కు కేసు దర్యాప్తు బాధ్యతలను బదిలీ చేశారు. క్లూస్‌టీమ్‌, రెవెన్యూశాఖ అధికారులతో కలిసి ఘటనా స్థలంలో పలు ఆధారాలను సేకరించారు.

Updated Date - Jul 19 , 2026 | 03:56 AM