Share News

కన్నతల్లి ప్రేమ ముందు కొండలైనా తలవంచాల్సిందే!

ABN , Publish Date - Nov 02 , 2026 | 04:28 AM

కన్నతల్లి ప్రేమ ముందు కొండలు సైతం తలవంచాయి! గ్రామానికి అంబులెన్సు కూడా రాలేని పరిస్థితి ఎదురవ్వడంతో.. రానూపోను.. 14 కిలోమీటర్ల దూరం.. కొండకోనల్లో కూతురిని ఆ తల్లి తన భుజంపై మోస్తూ ఆస్పత్రికి తీసుకెళ్లొచ్చిన తీరు చూపరుల హృదయాలను కదిలించేసింది

కన్నతల్లి ప్రేమ ముందు   కొండలైనా తలవంచాల్సిందే!
photo

  • అనారోగ్యం బారిన పడిన కుమార్తె

  • వైద్యం కోసం 14 కిలోమీటర్లు భుజాన మోసిన తల్లికన్నతల్లి ప్రేమ ముందు

  • రహదారి దెబ్బతినడంతో గిరిజనుల అవస్థలు

ఎస్‌.కోట రూరల్‌, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): కన్నతల్లి ప్రేమ ముందు కొండలు సైతం తలవంచాయి! గ్రామానికి అంబులెన్సు కూడా రాలేని పరిస్థితి ఎదురవ్వడంతో.. రానూపోను.. 14 కిలోమీటర్ల దూరం.. కొండకోనల్లో కూతురిని ఆ తల్లి తన భుజంపై మోస్తూ ఆస్పత్రికి తీసుకెళ్లొచ్చిన తీరు చూపరుల హృదయాలను కదిలించేసింది. విజయనగరం జిల్లా ఎస్‌.కోట మండలంలోని గిరిశిఖర పంచాయతీ దారపర్తి శివారు గ్రామమైన పల్లపుదుంగాడలో ఈ ఘటన ఆదివారం వెలుగుచూసింది. జన్ని సుకురమ్మ కుమార్తె సంపూర్ణ కొద్దిరోజులుగా అస్వస్థతతో బాధపడుతోంది. భర్త కన్నయ్య అందుబాటులో లేడు. అర్నబ్‌ తుఫాన్‌ ధాటికి గతంలో వేసిన కొద్దిపాటి గ్రావెల్‌ రోడ్డు కొట్టుకుపోవడంతో అప్పుడప్పుడు తిరిగే ఆటోలు కూడా పూర్తిగా ఆగిపోయాయి. గత్యంతరం లేక ఆ కన్నతల్లి తన 12 ఏళ్ల కుమార్తెను రక్షించుకునేందుకు భుజానికి ఎత్తుకొని గ్రామం నుంచి మైదాన ప్రాంతమైన దబ్బగుంట వరకు ఏడు కిలోమీటర్లు నడిచింది. అక్కడి నుంచి ఆటోలో ఎస్‌.కోట ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించింది. మళ్లీ దబ్బగుంట నుంచి భుజానకెత్తుకుని ఏడు కిలోమీటర్లు నడిచి గ్రామానికి చేరుకుంది. దబ్బగుంటతోపాటు చుట్టుపక్కల మరికొన్ని చిన్న గ్రామాలకు ఈ దారే దిక్కని, ప్రభుత్వం స్పందించి వాహనాల రాకపోకలకు వీలుగా రోడ్డును పునరుద్ధరించాలని గిరిజనులు వేడుకుంటున్నారు.

Updated Date - Nov 02 , 2026 | 04:54 AM