Share News

గ్రేటర్‌లోకి మరిన్ని గ్రామాలు!

ABN , Publish Date - Apr 06 , 2026 | 12:46 AM

గ్రేటర్‌ విజయవాడ విలీన ప్రాంతాల జాబితాలో తమ ప్రాంతాలను కలపాలన్న డిమాండ్లు మరిన్ని గ్రామాల నుంచి వస్తున్నాయి. విజయవాడలో 75 గ్రామాల విలీనానికి ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. కొత్తగా వస్తున్న డిమాండ్‌ మేరకు దాదాపుగా ఐదు నుంచి పది వరకు విలీన జాబితాలోకి గ్రామాలు పెరిగే అవకాశం కనిపిస్తోంది.

గ్రేటర్‌లోకి మరిన్ని గ్రామాలు!

- గన్నవరం మండలం నుంచి మరో ఏడు గ్రామాల ఆసక్తి!

- తెంపల్లి, మెట్లపల్లి, సగ్గూరు ఆమని, మర్లపాలెం, గోపవరపుగూడెం, గొల్లనపల్లి, చిక్కవరం నుంచి డిమాండ్‌

- జి.కొండూరు మండలంలో వెలగలేరు గ్రామం నుంచి ఆసక్తి

- నేడు కలెక్టర్‌, కమిషనర్‌తో ఎంపీ కేశినేని చిన్ని సమావేశం

- గ్రేటర్‌ స్వరూపం, మరిన్ని ప్రాంతాల విలీనం, డివిజన్ల పెంపు వంటి అంశాలపై చర్చ

(ఆంధ్రజ్యోతి, విజయవాడ):

గ్రేటర్‌ విజయవాడ విలీన ప్రాంతాల జాబితాలో తమ ప్రాంతాలను కలపాలన్న డిమాండ్లు మరిన్ని గ్రామాల నుంచి వస్తున్నాయి. విజయవాడలో 75 గ్రామాల విలీనానికి ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. కొత్తగా వస్తున్న డిమాండ్‌ మేరకు దాదాపుగా ఐదు నుంచి పది వరకు విలీన జాబితాలోకి గ్రామాలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. గ్రేటర్‌ విజయవాడలో గన్నవరం మండలంలోని గ్రామాలన్నీ దాదాపుగా కలుస్తున్నాయి. కొన్ని గ్రామాలు మిగిలిపోయి ఉన్నాయి. తాజాగా మిగిలినవి కూడా తమను విలీన జాబితాలో చేర్చాలన్న డిమాండ్లు చేస్తున్నాయి. గన్నవరం మండలంలోని తెంపల్లి, మెట్లపల్లి, సగ్గూరు ఆమని, మర్లపాలెం, గోపవరపుగూడెం, గొల్లనపల్లి, చిక్కవరం గ్రామాల నుంచి గ్రేటర్‌లో కలపాలని కోరుతున్నాయి. దీనికి ప్రధాన కారణం .. ఈ ప్రాంతాలు విజయవాడ వెస్ట్‌ బైపాస్‌, అవుటర్‌ రింగ్‌ రోడ్ల అలైన్‌మెంట్‌ మధ్యలో ఉండటమే. గ్రేటర్‌ విజయవాడలో లేకపోతే తమ ప్రాంతాల అభివృద్ధి కుంటుపడుతుందేమోనన్న అభిప్రాయం గ్రామస్థుల్లో ఉంది. సర్పంచ్‌లుగా ఎవరున్నప్పటికీ రాజకీయాలకు అతీతంగా మొన్నటి వరకు ఈ డిమాండ్‌ ఉంది. ప్రస్తుతం స్పెషల్‌ ఆఫీసర్ల పాలన నడుస్తున్న నేపథ్యంలో గ్రామ ప్రజల నుంచి డిమాండ్‌ పెరుగుతోంది. ఒక్క గన్నవరం మండలంలోనే ఏడు గ్రామాల నుంచి విలీన జాబితాలో చేర్చాలన్న డిమాండ్‌ వస్తోంది. గ్రేటర్‌ విజయవాడ పరిధిలో కృష్ణాజిల్లాలో పెనమలూరు, ఎన్టీఆర్‌ జిల్లాలో మైలవరం నియోజకవర్గ ప్రాంతాలు కూడా ఉన్నాయి. మైలవరం నియోజకవర్గం నుంచి చూస్తే జి.కొండూరు మండలం వెలగలేరు గ్రామం నుంచి కూడా ప్రజలు తమను విలీన జాబితాలో చేర్చాల్సిందిగా కోరుతున్నారు. విజయవాడ అర్బన్‌ ప్రాంతానికి దగ్గరగా ఉండటం వల్ల తమ ప్రాంతాన్ని కూడా గ్రేటర్‌ పరిధిలోకి తీసుకు రావాలని గట్టిగా పట్టుబడుతున్నారు. విజయవాడ రూరల్‌ మండలం పరిధిలోని కొత్తూరు తాడేపల్లికి దగ్గరగా ఉండటం వల్ల వెలగలేరు గ్రామ ప్రజలు విజయవాడలో విలీనం చేయాలని పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు. జి.కొండూరు మండలంలో పినపాక, కవులూరు గ్రామాలు ఇప్పటికే విలీన ప్రతిపాదిత జాబితాలో ఉన్నాయి. పినపాక గ్రామానికి హామ్లెట్‌గా కడియం పోతవరం ఉంది. ఇక్కడ ప్రజలు ఎవ్వరూ నివశించరు కానీ.. కొండ ప్రాంతాలు ఉన్నాయి. విజయవాడకు భవిష్యత్తులో ఆదాయం రావాలంటే క్వారీలు నిర్వహించటానికి కొండలు అవసరం కాబట్టి పినపాక హామ్లెట్‌గా ఉన్న కడియం పోతవరం గ్రామాన్ని కూడా వ్యూహాత్మకంగా గ్రేటర్‌ పరిధిలోకి తీసుకురావటం జరిగింది. పెనమలూరు నియోజకవర్గం పరిధిలో అదనంగా ఎలాంటి గ్రామాల నుంచి ప్రస్తుతానికి ప్రతిపాదనలు రాలేదు. ఒకవేళ ప్రజాప్రతినిధుల దృష్టికి ఏమైనా వచ్చాయేమో వెలుగుచూడాల్సి ఉంది.

- నేడు గ్రేటర్‌పై సమావేశం :

గ్రేటర్‌ విజయవాడ అంశంపై సోమవారం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని) కలెక్టర్‌ లక్ష్మీశ, వీఎంసీ కమిషనర్‌ ధ్యానచంద్రలతో సమావేశం అవుతున్నారు. కార్పొరేషన్‌, గ్రామపంచాయతీల పరిధిలో స్పెషల్‌ పాలన నడుస్తున్న నేపథ్యంలో మరోమారు విలీన ప్రతిపాదిత ప్రాంతాలపై సమగ్రంగా చర్చించబోతున్నారు. కొత్తగా వస్తున్న ప్రతిపాదనలపైనా కూలం కషంగా చర్చించనున్నారు. ముందుగా డివిజన్ల పెంపునకు సంబంధించి కార్పొరేషన్‌ జరుపుతున్న కసరత్తుపై చర్చించనున్నారు. మొత్తం 86 డివిజన్లుగా చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియను ఏవిధంగా చేపడుతున్నారన్న విషయం తెలుసుకున్న తర్వాత.. గ్రేటర్‌ అంశంపై ప్రభుత్వంతో ముడిపడి ఉన్న అన్ని అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు. కార్పొరేషన్‌కు ఎన్నికలంటూ నిర్వహించాల్సి వస్తే.. విలీన ప్రతిపాదిత ప్రాంతాలతో కలిపి నిర్వహించేలా ఉండాలన్నది ఎంపీ కేశినేని చిన్ని భావన. ఇదే విషయాన్ని సీఎంవో కార్యదర్శి ప్రద్యుమ్నకు కూడా ఎంపీ తేల్చిచెప్పినట్టు తెలుస్తోంది. గ్రేటర్‌ పరిధిలోకి వచ్చే గ్రామాలకు సంబంధించి కూడా ముందస్తుగా డివిజన్ల ఏర్పాటు అంశాన్ని కూడా సమాంతరంగా ప్రారంభించేలా చర్యలు తీసుకోమని కలెక్టర్‌, కమిషనర్‌లకు ఎంపీ సూచించే అవకాశం ఉంద ని తెలుస్తోంది.

మంత్రి నారాయణతో కూడా భేటీ

గ్రేటర్‌ విజయవాడ అంశంపై మంత్రి నారాయణతో కూడా విజయవాడ ఎంపీ, కలెక్టర్‌, కమిషనర్‌లు భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. మునిసిపల్‌ చట్టం ప్రకారం ఏ విధంగా ముందుకు వెళ్లాలన్నది మంత్రి నారాయణ, మునిసిపల్‌ అధికారులతో వీరు చర్చించనున్నారు. పురపాలక పట్టణాభివృద్ధి సంస్థ (ఎంఏయూడీ) నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం గ్రామపంచాయతీల తీర్మానాలను తీసుకునే ప్రక్రియపైనా చర్చించనున్నారు.

Updated Date - Apr 06 , 2026 | 12:46 AM