Share News

రైతులకు మరిన్ని సౌకర్యాలు

ABN , Publish Date - Oct 13 , 2026 | 11:46 PM

మార్కెట్‌ యార్డుకు వచ్చే రైతులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్‌ పార్థసారథి పేర్కొన్నారు.

రైతులకు మరిన్ని సౌకర్యాలు
మార్కెట్‌ యార్డ్‌ పాలకవర్గ సభ్యుల శిలాఫలకాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్‌ పార్థసారథి

నిధుల కోసం మార్కెటింగ్‌

శాఖకు ప్రతిపాదనలు

రహదారుల నిర్మాణానికి

రూ.9.36 కోట్లు మంజూరు

ఎమ్మెల్యే పార్థసారథి

ఆదోని అగ్రికల్చర్‌, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి) : మార్కెట్‌ యార్డుకు వచ్చే రైతులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్‌ పార్థసారథి పేర్కొన్నారు. మంగళవారం వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌ పాలకవర్గ సమావేశం చైర్‌పర్సన జిందే శారద అధ్యక్షతన నిర్వహించారు. ముందుగా పాలకవర్గ సభ్యుల పేర్లు ఉన్న శిలాఫలకాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు నిధులు కేటాయించాలని మార్కెటింగ్‌ శాఖ ప్రతిపాదనలు పంపుతామన్నారు. ఎల్‌నినో ప్రభావంతో జిల్లా అంతా కరువు పరిస్థితులు నెలకొన్నాయన్నారు. కరువు, వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు పండక తీవ్రంగా నష్టపోయి రైతులు పంటకు పెట్టిన పెట్టుబడులు కూడా రాక అప్పులు పాలయ్యారని తెలిపారు. కరువు మండలాల జాబితాలో ఆదోని-1 మండలం మాత్రమే ప్రభుత్వం ప్రకటించిందని, ఆదోని-2 మండలాన్ని ప్రకటించకపోవడం పట్ల రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. దీనిపై కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఆదోని-2 మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు లేఖ రాశానని తెలిపారు. పాలకవర్గ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపుతున్నామన్నారు. ఆదోని నియోజకవర్గంలోని రహదారుల నిర్మాణానికి పంచాయతీ నిధుల కింద రూ. 9.36కోట్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు. హనవాళ్లు గ్రామం నుంచి పెద్ద హరివాణం వరకు రూ. 3.51 కోట్లు, ఆదోని- ఇస్వి రోడ్డుకు రూ. 2.46 కోట్లు, పెద్దహరివాణం రోడ్డుకు రూ. 1.50 కోట్లు, గనేకల్లు రోడ్డుకు రూ. 43 లక్షలు, నారాయణపురం గ్రామ అప్రోచ రోడ్డు నిర్మాణానికి రూ. 38 లక్షలు, పెద్దతుమ్మడం నుంచి కోసిగి వరకు రూ. 1.08 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. త్వరలోనే పనులను ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌ యార్డ్‌ ఎంపిక శ్రేణి కార్యదర్శి సీతారామయ్య, వైస్‌ చైర్మన ఆదూరి విజయ్‌ కృష్ణ, పాలక వర్గ సభ్యులు పల్లవి వెంకటేష్‌, కాశన్న, రత్నాబాయి, పార్వతీ, మహేశ్వరి, ఖాదర్‌భాషా, ఉరుకుంద రెడ్డి, రమాకాంత పాల్గొన్నారు.

Updated Date - Oct 13 , 2026 | 11:46 PM