Share News

రుతుపవనాల్లో కదలిక

ABN , Publish Date - Jun 23 , 2026 | 05:15 AM

నైరుతి రుతుపవనాల్లో వారం తర్వాత మళ్లీ కదలిక వచ్చింది. ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో సోమవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.

రుతుపవనాల్లో కదలిక

  • నేడు రాష్ట్రంలో వర్షాలు

  • ఎల్లుండి నుంచి పెరగనున్న వానలు

విశాఖపట్నం, అమరావతి, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): నైరుతి రుతుపవనాల్లో వారం తర్వాత మళ్లీ కదలిక వచ్చింది. ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో సోమవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇంకా తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌ వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. దీనికితోడు అరేబియా సముద్రంలో వాతావరణం అనుకూలంగా ఉంది. దీంతో సోమవారం రుతుపవనాలు అరేబియా సముద్రం, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, ఝార్ఖండ్‌, బిహార్‌లో పలు ప్రాంతాలకు విస్తరించాయి. మరోవైపు వాతావరణ అనిశ్చితితో రాష్ట్రంలో పలుచోట్ల సోమవారం ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. నెల్లూరు, పల్నాడు, గుంటూరు, శ్రీసత్యసాయి, అనంతపురం, కృష్ణా జిల్లాల్లో పిడుగులతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. మంగళ, బుధవారాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని, 25వ తేదీ నుంచి 27 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కువచోట్ల వర్షాలు, అక్కడక్కడ భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం ఉత్తరాంధ్ర, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో పిడుగులతో తేలికపాటి వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.


రాష్ట్రంపై ఎల్‌నినో ప్రభావం

ఎల్‌నినో ప్రభావం ఏపీపై ఎక్కువగా ఉంటుందని వాతావరణ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రాయలసీమ, కోస్తాల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షాభావంతో కరవు పరిస్థితులు నెలకొంటాయని పేర్కొంటున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ఈనెల 15వ తేదీకల్లా రుతుపవనాలు విస్తరించినప్పటికీ ఇంకా వేసవి తీవ్రత, ఉక్కపోత, వేడిగాలుల ప్రభావం కొనసాగుతోంది. కొన్నిచోట్ల వర్షాభావం కారణంగా ఖరీఫ్‌ పనులు ముందుకు సాగడంలేదు. 4 నెలల కాలంలో ఏపీలో 52.16 సెం.మీ. వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా, ఎల్‌నినో ప్రభావంతో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేస్తున్నారు. కోస్తాంధ్రలో 60.14 సెం.మీ. వర్షపాతం కురవాల్సి ఉండగా, 54.74 సెం.మీ. నమోదయ్యే అవకాశం ఉందని పలు మోడళ్లు అంచనా వేస్తున్నాయి. సీమలో 40.86 సెం.మీ. వర్షపాతం కురవాల్సి ఉండగా 35.80 సెం.మీ. నమోదవుతుందని అంచనావేస్తున్నారు. నైరుతి రుతుపవనాల సీజన్‌లో ఎల్‌నినో ప్రభావాన్ని తగ్గించడంలో ఇండియన్‌ ఓషన్‌ డైపోల్‌ దోహదపడుతుంటుంది. ప్రస్తుతం తటస్థంగా ఉన్న ఐవోడీ నైరుతి రుతుపవనాల సీజన్‌ ముగిశాక పాజిటివ్‌కు మారుతుందని అంతర్జాతీయ మోడళ్లు చెబుతుండగా జపాన్‌కు చెందిన కొందరు నిపుణులు మాత్రం ఆగస్టు తొలి వారానికి ఐవోడీ పాజిటివ్‌ దశకు చేరుకుంటుందని చెబుతున్నారు. రాష్ట్రంలో పలుచోట్ల ఎక్కువ వర్షాలు కురుస్తుండడంతో తొలకరి పనులు ప్రారంభమయ్యాయి. వచ్చే 2నెలలు ఖరీఫ్‌ పంటలకు ఎంతో కీలకమని, బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు ఏర్పడితే రుతుపవనాలు చురుగ్గా మారి వర్షాలు కురుస్తాయని, లేనిపక్షంలో భూగర్భ జలాలపై తీవ్ర ఒత్తిడి ఉంటుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.

Updated Date - Jun 23 , 2026 | 05:16 AM