రాష్ట్రమంతా రుతుపవనాల విస్తరణ
ABN , Publish Date - Jun 16 , 2026 | 04:11 AM
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. చివరిగా కోస్తాలోని అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాలోని మిగిలిన ప్రాంతాలను సోమవారం రుతుపవనాలు తాకాయి.
ఇప్పటికి 5 శాతం అధికంగా వర్షపాతం
రాయలసీమలో ఎక్కువ, కోస్తాలో తక్కువ
విశాఖపట్నం, అమరావతి, జూన్ 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. చివరిగా కోస్తాలోని అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాలోని మిగిలిన ప్రాంతాలను సోమవారం రుతుపవనాలు తాకాయి. సాధారణంగా జూన్ 10వ తేదీనాటికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరిస్తాయి. అయితే ఈ ఏడాది ఐదు రోజులు ఆలస్యంగా రాష్ట్రమంతా విస్తరించాయి. రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ వర్షాలు జోరందుకోలేదు. బంగాళాఖాతం స్తబ్దుగా ఉండడంతో రుతుపవన ప్రభావిత వర్షాలు లేవు. ఎండతీవ్రత, ఉక్కపోతతో ఏర్పడిన వాతావరణ అనిశ్చితితోనే వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాలో ఎండ తీవ్రత కొనసాగుతూ కొన్నిచోట్ల పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. జూన్ ఒకటో తేదీ నుంచి సోమవారం వరకు పక్షం రోజుల్లో రాష్ట్రంలో 47.4 మిల్లీమీటర్లకుగాను 49.6 మిల్లీమీటర్ల(సాధారణం కంటే ఐదు శాతం ఎక్కువ) వర్షపాతం నమోదైంది. సాధారణం కంటే రాయలసీమలో 35 శాతం ఎక్కువగా, కోస్తాలో 16 శాతం తక్కువగా వర్షాలు కురిశాయి.
పిడుగుపాటుకు నలుగురు మృతి..
కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల సోమవారం పిడుగులు, ఈదురుగాలులతో వర్షం కురిసింది. శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఒక్కొక్కరు పిడుగుపాటుకు మరణించారు. అనకాపల్లి జిల్లా కన్నూరుపాలెంలో 45.2, మన్యం జిల్లా బలిజపేటలో 42.5, అనకాపల్లి జిల్లా వెంకన్నపాలెంలో 37.2, మన్యం జిల్లా చిలకలపల్లిలో 35.2, విజయనగరం జిల్లా బొబ్బిలిలో 26.7, అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 24 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మంగళవారం కోస్తాలో పలుచోట్ల ఎండతీవ్రత, వేడి వాతావరణం కొనసాగుతాయని, రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఈదురుగాలులు, పిడుగులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.