Share News

ఆస్తి కోసం తల్లిదండ్రులపై దాడి

ABN , Publish Date - May 19 , 2026 | 05:39 AM

ఆస్తి కోసం కొడుకు, కోడలు, మనుమడు కొడుతున్నారని పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కొత్తోటకు చెందిన వృద్ధ దంపతులు జిల్లా ఎస్పీకి సోమవారం భీమవరంలో ఫిర్యాదు చేశారు.

ఆస్తి కోసం తల్లిదండ్రులపై దాడి

  • కొడుకు, కోడలు, మనవళ్లపై కేసు

మొగల్తూరు, మే 18 (ఆంధ్రజ్యోతి): ఆస్తి కోసం కొడుకు, కోడలు, మనుమడు కొడుతున్నారని పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కొత్తోటకు చెందిన వృద్ధ దంపతులు జిల్లా ఎస్పీకి సోమవారం భీమవరంలో ఫిర్యాదు చేశారు. కొత్తోటకు చెందిన కొపనాతి కస్తూరిబాయి, సూర్యనారాయణ దంపతులకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ఇంటి స్ధలంతో సుమారు ఒక ఎకరం పైబడి ఆస్తి ఉంది. ఇప్పటికే పెద్ద కుమారుడు ముత్యాలరాజు మిగిలిన వారికి తెలియకుండా ఐదు సెంట్ల స్ధలం రాయించుకున్నాడు. ఇటీవల పొలం కూడా రాయాలని కుమారుడు, మనుమలు రాధాకృష్ణ, శేఖర్‌ కర్రలతో దాడిచేసి కొట్టడంతో వృద్ద దంపతులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న ఓ కుమార్తె మొగల్తూరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు నామమాత్రపు సెక్షన్లతో కేసు నమోదుచేశారని తన తల్లితండ్రులకు పూర్తి రక్షణ కావాలని ఆమె విజ్ఞప్తి చేసింది. ఈ విషయమై మొగల్తూరు ఎస్‌ఐ జి.వాసును వివరణ కోరగా మీడియాలో వస్తున్నవి ఆవాస్తవాలని వృద్ధ దంపతుల ఫిర్యాదు మేరకు ఈ నెల 16న కేసు నమోదు చేశామని నిందితులపై చర్యలు తీసుకుని త్వరలో చార్జ్‌షీట్‌ దాఖలు చేస్తామని వివరించారు.


‘ఏబీఎన్‌’ కథనానికి స్పందించిన అధికారులు

ఈ వ్యవహారంపై సోమవారం ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’లో ప్రసారమైన కథనంపై అధికారులు స్పందించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధ దంపతులను ఆర్డీవో దాసిరాజు, డీఎస్పీ సుధాకర్‌ పరామర్శించారు. కొడుకు, కోడలు, ఐదుగురు మనవళ్లపై కేసు నమోదు చేసినట్టు ఆర్డీవో తెలిపారు. పెద్ద కుమారుడుకి రాసిన ఐదు సెంట్లు భూమిని రద్దు చేస్తామన్నారు. ముత్యాలరాజు, అతని భార్య కుటుంబసభ్యులు ఆ భూమిలోకి వెళితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Updated Date - May 19 , 2026 | 05:40 AM