అంబేడ్కర్ రాజ్యాంగం వల్లే ప్రధానిగా మోదీ: మాధవ్
ABN , Publish Date - Jun 12 , 2026 | 04:27 AM
డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగం కారణంగానే సామాన్య, బలహీనవర్గాలకు చెందిన నరేంద్ర మోదీకి ప్రధానమంత్రి అయ్యే అవకాశం లభించిందని...
విజయవాడ అర్బన్, జూన్ 11(ఆంధ్రజ్యోతి): డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగం కారణంగానే సామాన్య, బలహీనవర్గాలకు చెందిన నరేంద్ర మోదీకి ప్రధానమంత్రి అయ్యే అవకాశం లభించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ అన్నారు. మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం 12 సంవత్సరాలుగా అందిస్తున్న సుపరిపాలనపై గురువారం విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా దాదాపు 13ఏళ్ల అనుభవంతో మోదీ దేశాన్ని అభివృద్ధి దిశగా నడిపించారని చెప్పారు. గత 12ఏళ్లలో ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా నిరంతరంగా దేశానికి సేవ చేశారని కొనియాడారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న జనాభా శాతాన్ని 33.8 శాతం నుంచి 11శాతానికి తగ్గించటంలో మోదీ ప్రభుత్వం విజయవంతమైందని తెలిపారు. మోదీ నాయకత్వంలోని కేంద్రం, సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు తిరుపతిలో సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.