మోదీది దేశాన్ని మార్చిన నాయకత్వం
ABN , Publish Date - Jun 11 , 2026 | 05:26 AM
ప్రధాని మోదీ 4,399 రోజుల నిరంతర నాయకత్వం దేశానికి కొత్త దిశ చూపిందని సీఎం ప్రశంసలు కురిపించారు.
సీఎం చంద్రబాబు, పవన్, లోకేశ్ శుభాకాంక్షలు
అమరావతి/న్యూఢిల్లీ, జూన్ 10(ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ 4,399 రోజుల నిరంతర నాయకత్వం దేశానికి కొత్త దిశ చూపిందని సీఎం ప్రశంసలు కురిపించారు. దేశాన్ని మార్చిన నాయకత్వం మోదీదేనని పేర్కొంటూ ‘ఎక్స్’లో ఆయన సుదీర్ఘ పోస్టు చేశారు. ‘భారతదేశ చరిత్రలో అత్యధిక కాలం సేవలందించిన ఎన్నికైన ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించారు. ప్రతి భారతీయుడి జీవితాన్ని తాకిన మార్పులకు మోదీ నాయకత్వమే కారణం. సంక్షేమం- అభివృద్ధి మధ్య సమతుల్యతే మోదీ పాలన. ఆయన నాయకత్వంలో స్వర్ణాంధ్ర నిర్మాణానికి, వికసిత భారత్ లక్ష్యానికి కట్టుబడి ఉన్నాం’ అని సీఎం పేర్కొన్నారు. కాగా, అత్యధిక కాలం దేశాన్ని పాలించిన రికార్డును సాధించిన ప్రధాని మోదీకి మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు అవకాశాలు, గౌరవం కల్పించడం, స్వావలంబన, సాధికారత దిశగా దేశాన్ని నడిపించిన మోదీ సమర్థ నాయకత్వానికి జేజేలు అని పేర్కొన్నారు.
అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా భారత్: పవన్
ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం 12 ఏళ్ల కిందటి కంటే అత్యంత శక్తిమంతంగా, సురక్షితంగా, సుసంపన్నంగా, ఆత్మవిశ్వాసంతో ఉందని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. ప్రపంచంలోనే అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగిందని, జీ20 శిఖరాగ్ర సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించిందని పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను నిర్మించే దిశగా మనం సాగుతుండగా, వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాకారం చేయడంలో ఏపీ ఒక బలమైన భాగస్వామిగా ఉన్నందుకు గర్విస్తోందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి మద్దతు అందిస్తున్న మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.